
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఈ సారి టీడీపీకి చావో రేవోలా మారాయి. గత ఎన్నికల్లో రాష్ట్ర విభజన నేపథ్యంలోనే మల్కాజ్గిరి ఎంపీ సీటుతో పాటు 15 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న టీడీపీ నాలుగున్నర ఏళ్లలో తెలంగాణలో చాలా వరకు కనుమరుగు అయిపోయింది. కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌తో పలువురు ఎమ్మెల్యేలు కారెక్కేయగా టీటీడీపీ ఫైర్ బ్రాండ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి హస్తం కిందకు చేరిపోయారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో టీడీపీకి ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఒక్కరే మిగిలారు. గత రెండు ఎన్నికల్లోనూ సత్తుపల్లి నుంచి వరుస విజయాలు సాధిస్తున్న ఆయన ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సత్తుపల్లి నుంచి వరుసగా మూడో సారి తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు.
క్లీన్ ఇమేజ్ తో….
2009 నియోజకవర్గాల పునర్విభజనలో సత్తుపల్లి నుంచి పోటీ చేసిన సండ్ర తన పాత ప్రత్యర్థి అప్పటి మంత్రి అయిన సంభాని చంద్రశేఖర్‌పై భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో మరో సారి సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగిన చతుర్ముఖ పోటీలో టీఆర్ఎస్, వైసీపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి సండ్ర సంచలన విజయం సాధించారు. సత్తుపల్లిలో టీడీపీ సంస్థాగతంగా ఇప్పటికీ బలంగా ఉండడం ఒక ప్లస్ అయితే వ్యక్తిగతంగా సండ్రకు నియోజకవర్గంలో అన్ని పార్టీల వాళ్లలో ఉన్న క్లీన్ ఇమేజ్ కూడా ఆయనకు కలిసి వచ్చే విధంగా ఉంది. సత్తుపల్లి నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన సండ్ర విజయం సాధిస్తే రెండో స్థానంలో వైసీపీ నుంచి పోటీ చేసిన మట్టా దయానంద్, మూడో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి ఉండగా మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ ఏకంగా నాలుగో ప్లేస్‌కు పడిపోయారు.
హ్యాట్రిక్ కొడతారా….?
ప్రస్తుత ఎన్నికల్లో సత్తుపల్లిలో వరుసగా మూడో సారి పోటీ చేస్తున్న సండ్ర సంచలన రీతిలో హ్యాట్రిక్ సాధిస్తారా ? లేదా ఆయన జోరుకు విపక్షాలు అడ్డుకట్ట వేస్తాయా ? అన్నదానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ సారి మహాకూటమిలో భాగంగా సీపీఐ, తెలంగాణ మహజనసమితితో పాటు కాంగ్రెస్ మద్దతు కూడా ఉండడం సండ్రకు కలిసిరానుంది. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మున్సిపాలిటీతో పాటు ఐదు మండలాల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇటీవల ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సత్తుపల్లిలో పర్యటించినప్పుడు ఇక్కడ కార్యకర్తల్లో ఎక్కడా లేని జోష్ వచ్చింది.
తలరాత మారుస్తారా…?
అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా, గతంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన పిడమర్తి రవికి మరో సారి సీటు కేటాయించింది. గత ఎన్నికల్లో సత్తుపల్లిలో టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య చతుర్ముఖ పోటీ జరగగా ఈ సారి ఇక్కడ వైసీపీ పోటీ నామ మాత్రంగా ఉండడంతో టీడీపీ అభ్యర్థి సండ్ర, టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి మధ్య హోరా హోరి పోరు తప్పేలా లేదు. సత్తుపల్లి నియోజకవర్గం మీద పూర్తి ఆధిపత్యం ఉన్న, గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన తాజా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు తమ అనుచర గణంతో ఇక్కడ ఏలాగైన టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తుమ్మల వెంట చాలా మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కేడర్ వెళ్లిపోయినా ఇప్పటికీ సత్తుపల్లిలో టీడీపీ తనదైన బలాన్ని కలిగి ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో సండ్ర తలరాత ఎలా ఉంటుందో ? చూడాల్సి ఉంది.
Leave a Reply