అందుకోసమేనా… బాబు పాట్లు….!!

nara-chandrababu-naidu-telugudesamparty

రాజకీయాల్లో సానుభూతి బాగానే పనిచేస్తుంది. భర్త చనిపోతే భార్యను ఎన్నికల్లో పెట్టి గెలిపించుకుంటారు, ఒక కీలక నేత మరణిస్తే వారసుడుకి ఏ అర్హత లేకపోయినా పదవి ఇచ్చి పట్టాభిషేకం చేస్తారు. ఈ దేశంలో సానుభూతిని మించిన ఆయుధం వేరొకటి లేదు. దాంతో మన నాయకులు ఈ సులువు దారినే ఎంచుకుంటున్నారు. సానుభూతి ఉంటే చాలు స్వర్గానికి నిచ్చెనలు వేసుకోవచ్చు అన్నది నయా పొలిటీషియన్ల వ్యూహం. ఇపుడు ఏపీలో చంద్రబాబు దారుణంగా ఓడిపోయారు. అదే సమయంలో జగన్ భారీ మెజారిటీతో గెలిచి ఎదురులేకుండా ఉన్నారు. మరి చంద్రబాబుకు అధికార యోగం పట్టాలంటే అయిదేళ్ల వరకూ ఆగాలి. అప్పటివరకూ పార్టీని కాపాడుకోవాలి. క్యాడర్ కి, లీడర్లకు నమ్మకం కలిగించాలి. ఓ వైపు పడమరకు పోతున్న వయసు. అయినా బాబు లాంటి వ్యూహకర్త తలచుకుంటే ఇసుక నుంచి బంగారాన్నే తీస్తారు. అందుకే బాబు ఇపుడు తనదైన కొత్త ఆలోచనలకు పదును పెడుతున్నారు.

వయసే ఆయుధమా…?

ఇపుడు ఇంటా బయటా ఎక్కడ చూసినా చంద్రబాబు వయసు గురించే చర్చ సాగుతోంది. 2024 నాటికి ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి చంద్రబాబు వయసు 74కు చేరువ అవుతుంది. ఆయనలో చురుకుదనం తగ్గిపోతుంది. ఆయన పార్టీ భారాన్ని మోయగలరో లేదో ఇదీ తమ్ముళ్ల ఆందోళన. మరో వైపు చంద్రబాబు వయసు రీత్యా అవుట్ డేటెడ్ కాబట్టి ఆ పార్టీ నుంచి నాయకులను లాగేయాలి. ఇదీ బీజేపీ అజెండా. మరి బాబు గారు వూరుకుంటారా. తన వయసునే ప్లస్ పాయింటు చేసుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు. కొడుకు వయసు ఉన్న జగన్ తనని నానా బాధాలు పెడుతున్నారంటూ యాగీ చేయడానికి రెడీ అయిపోతున్నారు. తనని ఉండవల్లి ఇంటి నుంచి బలవంతంగా గెంటేస్తున్నాడని, తన వయసుకు, చేసిన పదవులకు కూడా ఎటువంటి విలువా ఇవ్వడం లేదని తమ్ముళ్ల చేత గగ్గోలు పెట్టిస్తున్నారు. మరో వైపు తనకు భద్రత తగ్గించేస్తున్నారని, తనకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్ దే బాధ్యత అని కూడా హెచ్చరిస్తున్నారు.

పెంకుటిల్లు..పేదరికం….

ఇక చంద్రబాబు ఉండవల్లి అక్రమ భవనం ఖాళీ చేయాలనుకుంటున్నారట. అయితే ఇలా చేస్తే అక్రమాలను బాబు ఇన్నాళ్ళు సహించారని చెడ్డపేరు వస్తుంది. అందుకే పోతూ పోతూ పెంకుటిల్లు వెతుక్కుంటున్నారు. అక్కడ నుంచే తన రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తారట. జగన్ తోసి పడేస్తే తాను ఇక్కడకు వచ్చి చేరారని లోకానికి చాటాలన్నది బాబు ఆలోచన. అంటే తనని బాగా వేధిస్తున్నారని, అయినా ప్రజలకు మేలు చేసేందుకు తాను పెంకుటింటిలో పేదగా ఉంటానని కూడా కొత్త వేషంలో బాబు చెప్పబోతున్నారు. దీనివల్ల బాబు ఇమేజ్ పెరుగుతుందని, సానుభూతి వస్తుందని తమ్ముళ్ళు అంచనా వేస్తున్నారుట. ఉండవ‌ల్లి దగ్గరలో ఓ మాజీ మహిళా సర్పంచ్ పెంకుటింట్లో బాబు కొత్త కాపురం మొదలవుతోందట. మరి బాబు ని వేధిస్తారన్న పాయింటు ఇపుడు జనంలోకి తీసుకుపోవాలన్నదే టీడీపీ అజెండాగా ఉంది. దానికి బాబు ముదిమి వయసు కూడా తగిలిస్తే ఆ రాజకీయ మసాలా అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుందని తమ్ముళ్ళు అంచనా కడుతున్నారు. మరి ఇది వర్కౌట్ అవుతుందా…? లేదా? అన్నది చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 18753 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*