ఎందుకంత అసహనం…??

nara-chandrababunaidu-cabinet-meet

ఈవీఎంల లెక్కింపుతో పాటు వీవీప్యాట్ లను కూడా పూర్తిస్థాయిలో లెక్కించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో కూడా తెలుగుదేశం పార్టీ రివ్యూ పిటిషన్ వేసింది. వీవీ ప్యాట్ లను లెక్కించేందుకు మరో రెండు, మూడు రోజుుల సమయం మాత్రమే పడుతుందని, డెబ్బయి రోజులు వెయిట్ చేసిన వాళ్లు మరో నాలుగు రోజులు ఆగలేరా? అన్నది చంద్రబాబు సూటి ప్రశ్న. అయితే ఈ నాలుగురోజులు చంద్రబాబు ఎందుకు ఆగలేకపోతున్నారని ఐఏఎస్ అధికారులు సయితం ప్రశ్నిస్తున్నారు.

వచ్చే వారం కేబినెట్ మీట్….

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చే వారం మంత్రివర్గ సమావేశం పెడతానని ప్రకటించారు. మంత్రివర్గ సమావేశం పెట్టి అభివృద్ధి, సంక్షేమ పథకాలు వంటి అంశాలను చర్చించేందుకు వీలుపడదు. వీటిని అధికారులు అజెండాలో కూడా చేర్చే వీలులేదు. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నాయి కాబట్టి ఎటువంటి నిర్ణయాలను కేబినెట్ తీసుకోలేదు. మరి చంద్రబాబు కేబినెట్ సమావేశం ఎందుకు పెడుతున్నట్లు? దీనికి ప్రత్యేక కారణాలున్నాయంటున్నారు టీడీపీ నేతలు.

తనను కలవలేదనేనా?

ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రహ్మణ‌్యంను నియమించిన నాటి నుంచి చంద్రబాబుకు మింగడుపడటం లేదు. ఏ అధికారి తనను సంప్రదించడం లేదన్న అసహనం చంద్రబాబులో కన్పిస్తుంది. చీఫ్ సెక్రటరీ ఇంతవరకూ చంద్రబాబునాయుడు వద్దకు వచ్చి ఏ విషయంపైనా రిపోర్టు చేయలేదు. పైగా కొన్ని పైళ్లను ర్యాటిఫికేషన్ కోసం ముఖ్యమంత్రి వద్దకు పంపుతుండటం ఆయనకు మరింత కాలుతోంది. ఫోని తుపాను సమీక్ష విషయంలోనూ చీఫ్ సెక్రటరీ సంబధిత అధికారులను మాత్రమే పంపారు కాని ఆయన రాలేదు.

వస్తారా..? రారా…?

దీంతో చీఫ్ సెక్రటరీని తన వద్దకు రప్పించుకోవాలంటే మంత్రి వర్గ సమావేశం ఒక్కటే మార్గమని చంద్రబాబు భావించారు. ఈ సమావేశంలో ఎన్నికల నిబంధనల పేరిట బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘిస్తున్న అధికారులపై చర్చ చేయడానికే చంద్రబాబునాయుడు ఈ మంత్రివర్గ సమావేశం పెట్టాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. మరి మంత్రి వర్గ సమావేశమంటూ పెడితే దానికి చీఫ్ సెక్రటరీ హాజరవ్వాల్సి ఉంటుంది. ఆయన హాజరవుతారా? లేక మరోసారి నిబంధనల బుక్ ను చూపుతారా? అన్నది తేలాల్సి ఉంది. మొత్తం మీద ఎటువంటి అజెండా లేకుండానే మంత్రివర్గ సమావేశం పెట్టాలని చంద్రబాబు అనుకోవడం ఆయనలోని అసహనానికి ఉదాహరణగా చెప్పుకోవాలి.

Ravi Batchali
About Ravi Batchali 39148 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*