ఆలస్యం…..విషమయిందా….?

nara chandrababunaidu late decission cost

ఒకటి రెండయింది…రెండు మూడయింది… ఈ లెక్కేమిటనుకుంటున్నారా….? రాజకీయాల్లో లెక్కలు చాలా వేగంగా మారిపోతుంటాయి. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగితే గణాంకాలు వాటంతట అవే తిరగబడతాయి కూడా. ఈ లెక్క నెల్లూరు జిల్లాకు బాగా వర్తిస్తుంది. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. వైసీపీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నా, ఎమ్మెల్సీలుగా చేసి మంత్రి పదవులు ఇచ్చినా పెద్దగా ఉపయోగం ఏమీ లేదని పార్టీ అధినేతకు దాదాపుగా అర్థమయింది. అందుకే నెల్లూరు జిల్లాలో పార్టీని గాడిన పెట్టడానికి ఆయన నష్టనివారణ చర్యలకు దిగారంటున్నారు.

సమన్వయ లోపం……

రెండు రోజుల క్రితం జరిగిన ధర్మపోరాట దీక్ష సభ నిర్వహణలో కూడా నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కన్పించింది. జనసమీకరణ కూడా వీక్ గానే ఉండటంతో చంద్రబాబు ఇద్దరు మంత్రులపై అసహనం ప్రదర్శించారన్న వార్తలు వచ్చాయి. జిల్లాలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రి నారాయణకు పడదు. అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి పడదు. అలాగే జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు, ఆదాలకు మధ్య తేడాలున్నాయి. ఇన్ని లొసుగులతో పార్టీ గట్టెక్కడం కష్టమేనన్నది పసుపు కండువాలు సయితం అంగీకరిస్తున్న విషయం.

ఆత్మకూరులో ఆధిపత్యపోరు…..

ఇదిలా ఉంటే కొన్ని నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు ఇంకా పార్టీని వీడలేదు. ఇక్కడ ఆశావహులు రోజురోజుకూ పెరుగుతుండటమే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. ఆత్మకూరు నియోజకవర్గంలో మొన్నటి వరకూ ఆనం రామనారాయణరెడ్డి పార్టీ ఇన్ ఛార్జిగా ఉండేవారు. ఆయనకు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పడక పోవడం, పార్టీ నుంచి సహకారం కొరవడంతో ఆయన వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కన్నాబాబు ఆనం రాకముందు వరకూ పార్టీ ఇన్ ఛార్జిగా ఉండేవారు. ఆనం వెళ్లిపోయిన తర్వాత ఆయనకు ఇన్ ఛార్జి పదవి ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీ కార్యాయలంలోనే దీక్షకు కూడా దిగిన సంగతి తెలిసిందే.

ముగ్గురు చేరారు…..

అయితే ఈ నేపథ్యంలో ఆత్మకూరులో బొల్లినేని కృష్ణయ్యను వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇటీవల ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి నియోజకవర్గ ఇన్ ఛార్జిగా జగన్ నియమించడంతో అప్పటి వరకూ ఇన్ ఛార్జిగా ఉన్న బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆ పార్టీని వీడారు. ఆయన టీడీపీ నుంచి ఆత్మకూరు సీటును ఆశిస్తున్నారు. ఇలా చంద్రబాబు ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జి విషయంలో నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసినందుకు ఒకరికి ముగ్గురయ్యారని, ఇప్పుడు కన్నబాబుతో పాటు బొల్లినేని కృష్ణయ్య, రాఘవేంద్రరెడ్డిలు టిక్కెట్ కోసం పోటీ పడుతుండటం పార్టీని మరింత కష్టాల్లోకి నెట్టినట్లయింది. వీరి వెనక కూడా మంత్రులు ఉన్నారన్నది టాక్. మరి నెల్లూరు జిల్లా పార్టీని చంద్రబాబు ఎలా సరి చేస్తారన్నది తెలియాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 38940 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*