దారి తప్పారుగా…!!

nara-chandrababunaidu-narendramodi

నాయకులు దారి తప్పారు. ఆనాటి విలువలు పాటించమని ఎవరూ పెద్దగా చెప్పరు. కానీ కనీస సామాజిక సంప్రదాయాలను సైతం పాటించడం లేదు. దేశంలో రెండు విడతల పోలింగు ముగిసింది. దక్షిణాదిలో పెద్ద రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్ర్రప్రదేశ్, తెలంగాణల్లోనూ లోక్ సభ హడావిడి ముగిసింది. కర్ణాటకలో సగం తంతు అయిపోయిందనిపించారు. ఎన్నికలు ముగుస్తున్నకొద్దీ నాయకుల్లో ఆవేశకావేశాలు తగ్గుముఖం పట్టాలి. కానీ పెరుగుతున్నాయి. కేంద్రంలో మోడీ, ఏపీలో చంద్రబాబు, జగన్, తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ వంటి వారిని నిరంతరం మనం పరిశీలిస్తూ ఉంటాం. ఈసారి తెలంగాణలో పెద్దగా రోడ్డెక్కిన ఉదంతాలు కనిపించడం లేదు. కానీ దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ నాయకుల తీరు చర్చకు దారితీస్తోంది. వారిమాటలు మొదలు చర్యల వరకూ చర్చనీయమవుతున్నాయి. ఓట్లు తెచ్చుకోవడం కోసమే నాటకీయతను ప్రదర్శిస్తే తప్పులేదు . కానీ సమాజంలోని భిన్నవర్గాలను శాశ్వతంగా దూరం చేసే రీతిలో నాయకులు ప్రవర్తిస్తున్నారు. రెచ్చగొడుతున్నారు. తమ కులాలు, మతాలను ప్రాతిపదిక చేసుకుంటూ బాధిత పాత్ర ద్వారా ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ప్రధాని మొదలు ప్రతిపక్షపార్టీ అధినేత వరకూ అందరిదీ అదే దారి.

తగునా మీకిది…

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన అంబుల పొదిలోని చివరి అస్త్రాన్ని ప్రయోగించేశారు. సర్జికల్ స్ట్రైక్స్ , జాతీయవాదం, రామమందిర నిర్మాణం, దేశరక్షణ వంటి అంశాలు సరిపోవని భావించారు. కులం కార్డు బయటికి తీశారు. తాను వెనకబడిన వర్గాలకు చెందిన వాడిని కాబట్టి తనపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయనేది ఆయన ఆరోపణ. దేశంలో ఇందిరాగాంధీతో సరితూగగల శక్తిమంతమైన ప్రధానిగా గుర్తింపు తెచ్చుకున్నారు మోడీ. దీనిని కాంగ్రెసు వర్గాలు సైతం అంగీకరిస్తాయి. అటువంటి నేత బేల పలుకులు అందులోనూ దేశంలోని వెనకబడినవర్గాలతో తనను పోల్చుకోవడం అసంగతం. 2014లో మోడీ వెనక దేశమంతా కలిసి కదలింది, ఆయనకు బ్రహ్మాండంగా నీరాజనాలు పట్టింది. వెనకబడిన తరగతులకు చెందిన వాడని గుర్తించి ఆయనను అక్కున చేర్చుకోలేదు. సమర్థ నేతగా యువతరం ఆశలవారధిగానే దేశం ఆయనకు పెద్దపీట వేసింది. గుజరాత్ మూడు సార్లు ఆయనను ముఖ్యమంత్రిని చేసింది కూడా ఆయనలోని నాయకుడిని చూసే. అటువంటి ఉన్నతస్థాయి వ్యక్తి కులం కార్డును బయటికి తీయడం ఆశ్చర్యమనిపించకమానదు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రవర్ణాలు అంతా కలిసి వ్యతిరేకించినా ఫర్వాలేదని భావిస్తున్నారనుకోవాలా? లేకపోతే బాధిత పాత్రలోకి మారి ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్నారనుకోవాలా? అన్నదే తాజా ప్రశ్న. గతంలోనూ బీసీ కార్డు వాడినప్పటికీ ఇప్పుడు ఆ వేడి పెంచారు. చరిత్రలో నిలిచిపోవాలనుకునేవాళ్లు ఒక కార్డు ముసుగులో దాగిపోవడం, తనను తాను కుదించుకోవడం దేశహితానికి ఏమాత్రం మంచిదికాదు.

ఆది నుంచి అదే తంతు..

తాము అధిష్ఠించిన పదవులకు, తాము నేతృత్వం వహిస్తున్న పార్టీలకు ఏమాత్రం తగనిరీతిలో ప్రవర్తించడంలో మాయావతి, యోగి ఆదిత్యనాథ్ లనే చెప్పుకోవాలి. బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొట్టి ఓటు బ్యాంకును స్థిరపరుచుకోవాలనేది మాయావతి ఎత్తుగడ. ఇప్పటికే హిందూ, ముస్లిం ల మధ్య చెరపలేనంత దూరం చోటు చేసుకుంది. దానిని మరింత పెంచడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనేది బీఎస్పీ అధినేత్రి యోచన. దేశంలోని అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ ది సైతం అదే ధోరణి. తాను పాలిస్తున్న రాష్ట్ర ప్రజల్లో 16శాతం పైచిలుకు ముస్లింలు ఉన్నారన్న సంగతిని ఆయన పట్టించుకోరు. వారిని టార్గెట్ చేస్తూ హిందువులను పోలరైజ్ చేయాలని చూస్తారు. ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీ కూటమి గట్టడంతో ఈ ఎత్తుగడల్లో దూకుడును యోగి మరింతగా పెంచారు. దీనివల్ల యూపీలో శాంతిభద్రతల సమస్య పెచ్చరిల్లే అవకాశం ఉంది. అది అధికారాన్ని పటిష్ఠపరిచే పక్కా మార్గంగా భావిస్తున్నారు యోగి. మాయా, యోగి ల మధ్య ముదిరిన అలి, భజరంగబలి వివాదం మత విద్వేష ప్రేరకంగా మారింది. ఎన్నికల కమిషన్ స్పందించి వీరి ప్రచారంపై నిషేధం విధించి కొంతమేరకు చర్యలు తీసుకుంది. దేశ సైనికులు, సర్జికల్ స్ట్రైక్స్ వంటి వాటిని ప్రస్తావిస్తున్న ప్రధాని ప్రచారంపై సైతం ఒకరోజైనా నిషేధం విధించి ఉంటే కమిషన్ నిష్ఫాక్షికంగా, నిర్భయంగా పనిచేస్తోందన్న మంచి పేరు తెచ్చుకుని ఉండేది. కానీ అంతటి సాహసం చేయలేకపోయింది. జీ హుజూర్ గానే మిగిలిపోయింది. సుప్రీం జోక్యం మేరకే చర్యలకు పూనుకుంది. తన స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకోవడానికి వేరే సంస్థ సూచనలు చేయాల్సి రావడం దురద్రుష్టకరమే.

రాష్ట్రంలో రచ్చ..రచ్చే..

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు మొత్తం వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నం అందరూ ఖండించాల్సిన విషయమే. ఈవీఎం మిషన్లలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. వైసీపీకి అనుకూలించేందుకు గాను కేంద్రం చేస్తున్న కుట్రగా దానిని అభివర్షించారు. ఎన్నికల రోజున పెద్దగొడవ చేశారు. హడావిడిలో అష్ట కష్టాలు పడుతున్న ముఖ్య ఎన్నికల అధికారిని కలిసి హెచ్చరికలు జారీ చేశారు. నిజానికి ఇది విధులకు భంగం కలిగించేరీతిలోనే ఉందన్నది ప్రత్యక్ష సాక్ఖుల అంచనా. దాంతో సరిపుచ్చుకోకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జగన్ కు కోవర్లుగా అభివర్ణించడం పరిధులు దాటిన తీరుకే నిదర్శనం. అంతటి సీనియర్ నాయకుడు ఈ తరహా చౌకబారు చర్యలకు దిగడం యంత్రాంగం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. పధ్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, పదేళ్లపాటు ప్రతిపక్షనాయకునిగా పనిచేసిన చంద్రబాబు నాయుడే సీనియర్ ఐఏఎస్ ల ఇంటిగ్రిటిని అవమానించే వ్యాఖ్యలు చేయడమేమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పక్కనపెడితే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి నుద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు, కించపరిచే పదాలు అసభ్య స్థాయి దాటి అశ్లీలతకు చేరిపోయాయి. వీటన్నిటిని నియంత్రించడానికి ఎన్నికల కమిషన్ కోడ్ ఆఫ్ కాండాక్టు తరహాలోనే వర్డ్ ఆఫ్ కాండాక్టు కూడా పెట్టాలేమో.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 39095 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*