మారిస్తేనే…..విన్నర్లవుతారా?

అధికార తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులలో దాదాపు చాలా మంది ఈసారి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని చెప్పేశారు. పార్లమెంటుకు వెళ్లడం కన్నా అసెంబ్లీకి పోటీ చేయడం మిన్న అని చాలా మంది ఎంపీలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సయితం ఈసారి పార్లమెంటుకు కొత్త ముఖాలను దించాలని, అలాగే అసెంబ్లీకి ఫేస్ లు మారిస్తే ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనేకమంది పార్లమెంటు సభ్యులు అమరావతికి వచ్చి తమ సీటు మార్చమని గోడు వెళ్లబోసుకుంటున్నారు.

అసెంబ్లీకి వెళ్లాలని…..

పార్లమెంటుకు పోటీ చేసి రాష్ట్రానికి, అసెంబ్లీకి దూరం అయ్యేదానికన్నా ఈసారి శాసనసభలో అడుగుపెట్టాలన్న కోరికతో అనేకమంది తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఉన్నారు. శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు అసెంబ్లీకి పోటీ చేయాలన్న తలంపుతో ఉన్నారు. చంద్రబాబు కూడా మంచి వాగ్దాటి ఉండటంతో రామ్మోహన్ నాయుడిని అసెంబ్లీకి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అచ్చెన్నాయుడిని పార్లమెంటుకు పంపితే ఇటు జిల్లాలో నేతల మధ్య విభేదాలు కూడా సర్దుకుంటాయని భావిస్తున్నారు.

మంత్రిగా అవ్వాలంటే….

అలాగే ఇక విజయనగరం పార్లమెంటు సభ్యుడు అశోక్ గజపతి రాజు ఎప్పటి నుంచో అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని అధినేతకు కూడా చెప్పేశారు. విజయనగరం నియోజకవర్గం నుంచి తానే ఈసారి పోటీ చేస్తానని ఆయన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. విజయనగరం కంచుకోట కావడంతో ఆ సీటు టీడీపీకి గ్యారంటీ. ఎందుకంటే 2004లో మినహా అన్నిసార్లు రాజుగారు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే కాకినాడ ఎంపీ తోట నరసింహంది కూడా అదేదారి. ఇప్పటికే ఇక్కడ నుంచి చలమలశెట్టి సునీల్ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో ఆయన జగ్గంపేట అసెంబ్లీని కోరుతున్నారు. అయితే జగ్గంపేటలో ఇప్పటికే వైసీపీ నుంచి వచ్చిన జ్యోతుల నెహ్రూ ఉన్నారు. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా అసెంబ్లీ సీటును ఆశిస్తున్నారు.

అసెంబ్లీ బరిలో ఉండాలని….

ఇక అనకాపల్లి ఎంపీ అవంతీ శ్రీనివాస్ ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీకి పోటీచేస్తానని చెబుతున్నారు. ఆయన గతంలో భీమిలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అక్కడ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉండటంతో అది సాధ్యమయ్యే పనేనా? అన్నది పార్టీలో టాక్. అయినా అవంతి పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వీరితో పాటు బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. కాని అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఉన్నారు. వైసీపీలో గెలిచి ఇటీవల పార్టీ లోచేరిన బుట్టా రేణుక సయితం ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానం పై ఆశలు పెట్టుకున్నారు. అక్కడ జయనాగేశ్వరరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వీరి ప్రతిపాదనలను చంద్రబాబు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. విభజన హామీల కోసం పార్లమెంటులో వీరు చేసిన పోరాటాలతో ఖచ్చితంగా గెలిచే అవకాశముందని భావించి వీరిని అసెంబ్లీకి పంపే ఆలోచనలో కూడా బాబు ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద సిట్టింగ్ ఎంపీల కోరిక నెరవేరుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 30943 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*