
మాజీ మహిళా స్పీకర్, ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ మోస్ట్ టీడీపీ నాయకురాలు, రాజాం నియోజకవర్గం మాజీ ఎమ్మె ల్యే ప్రతిభా భారతి భవిష్యత్తు ఏంటి? ఆమె పయనం ఎటు? ఏం జరుగుతోంది? ఇలాంటి అనేక ప్రశ్నలు మరోసారి తెర మీదికి వచ్చాయి. గతంలో ఉమ్మడి ఏపీలో మంచి ఫామ్లో ఉన్న సమయంలో చంద్రబాబు.. ప్రతిభా భారతికి స్పీకర్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు. దళిత మహిళా నేతగా ఉన్న ఆమెకు చంద్రబాబు స్పీకర్ పదవి ఇవ్వడంతో ఆమె ఓ వెలుగు వెలిగారు. 2004 ఎన్నికలకు ముందు వరకు వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన ఆమె రాజకీయ వెలుగులు ఆ తర్వాత ఆగిపోయాయి. వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోవడమే ఆమె కెరీర్ను డౌన్ చేసేసింది.
గత ఎన్నికల్లో…….
గత ఎన్నికల్లో ఆమె కేవలం 500 ఓట్లతోనే ఓడాల్సి వచ్చింది. అయితే, విభజన తర్వాత ఆమె హవా దాదాపు తగ్గిపోయింది. అనారోగ్య కారణాలతో ఆమె పార్టీలో పెద్దగా యాక్టివ్గా ఉండలేక పోతున్నారు. పైగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్తో ఆమెకు అస్సలు పొసగడం లేదు. తను రాజకీయంగా ఎదగలేక పోవడానికి వెంకట్రావే కారణమని ఆమె పదే పదే ఆరోపిస్తున్నారు. తన వర్గాన్ని, తనను కూడా కళా వెంకట్రావు తొక్కేస్తున్నారని ప్రతిభ ఆరోపిస్తున్నారు. దీనికితోడు ఇక్కడ నుంచి కాంగ్రెస్ మాజీ నాయకుడు, మాజీ మంత్రి కొండ్రు మురళీని టీడీపీలోకి చేర్చుకున్నారు. దీని వెనుక కూడా కళా హస్తం ఉందనేది బహిరంగ రహస్యం అంటున్నారు ప్రతిభా భారతి.
మామూలు హామీ మాత్రమే……
రాజాం నియోజకవర్గంలో తనను ఓడించిన తన ప్రత్యర్థి కొండ్రును కనీసం తనతో కూడా చెప్పకుండానే పార్టీలోకి ఎలా తీసుకుంటారనేది ఆమె ఆవేదన. ఈ క్రమంలోనే తాజాగా ఆమె సీఎం చంద్రబాబును కలిసి తన గోడును వినిపించారు. తన భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. పోనీ.. తనకు టికెట్ ఇవ్వకపోయినా.. తన కుమార్తె గ్రీష్మ కయినా రాజకీయ భవిష్యత్తు కల్పించాలని ఆమె అభ్యర్థించారు. అయితే, ప్రతిభా భారతి.. చంద్రబాబుకు విన్నవించిన ఏ అభ్యర్థనపై కూడా సానుకూల హామీ లభించకపోవడం గమనా ర్హం. ‘‘పార్టీలో మీకు ఎప్పుడూ అగ్ర ప్రాధాన్యం ఉంటుంది. అది ఏ మాత్రం తగ్గదు’’ అని ముక్తసరి సమాధానం/ హామీ మాత్రమే సీఎం నుంచి భారతికి లభించింది.
కెరీర్ క్లోజ్ అయినట్లేనా?
చంద్రబాబు ప్రకటనతో ప్రతిభ ఫ్యూచరే కాదు… ఆమె కుమార్తె గ్రీష్మ కెరీర్ కూడా క్లోజ్ అయినట్టే కనిపిస్తోంది. అదేసమయంలో రాజాం నియోజకవర్గంలో కొందరు నేతలు పార్టీలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారని, దీనివల్ల సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదు చేయగా, వీటిపైనా సీఎం చంద్రబాబు ముక్తసరిగానే సమాధానం ఇచ్చారు. సదరు ఆరోపణలపై పరిశీలన చేయిస్తానన్నారు. మొత్తంగా ఈ పరిణామాలను చూస్తే.. ఇక, ప్రతిభా భారతికికానీ, ఆమె కుమార్తెకు కానీ వచ్చే ఎన్నికల్లో టికెట్ లభించే ఛాన్స్ లేదని తెలుస్తోంది. మరి ఈ మాజీ మహిళా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Leave a Reply