బాబు ఒకటైతే…జగన్ రెండు…ఇదీ లెక్క…!

ఎన్నికలు దగ్గరపడే సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. తమ బలం పెంచుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకూ పనిచేసిన నేతలను కాదని ప్రజాదరణ నేతలను పార్టీలోకి తెచ్చుకునేందుకు విపరీతంగా శ్రమిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు. అయితే రెండు పార్టీలే ప్రధాన ప్రత్యర్థులు కావడంతో వైసీపీ, టీడీపీల్లో చేరేందుకు గిరాకీ మాత్రం బాగానే ఉంది. ప్రకాశం జిల్లాలో పరిస్థితిని చూస్తుంటే అదే అనిపిస్తుంది. వైసీపీ ఒక నేతను చేర్చుకుంటే దానికి ప్రతిగా టీడీపీ మరో నేతకు గాలం వేస్తుంది. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ అధిక సీట్లను సాధించుకుంది. ఈసారి కూడా పట్టు నిలుపుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. అలాగే అధికార తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలాగైనా మెజారిటీ సీట్లు సాధించాలని చెమటోడుస్తోంది.

ఎన్నికల హడావిడి…..

ప్రకాశం జిల్లాలో రాజకీయాలు ఇప్పుడే హీటెక్కాయి. ఏ నియోజకవర్గంలో చూసినా ఎన్నికల హడావిడే కన్పిస్తోంది. పార్టీలోకి చేరుతున్న నేతలతో సందడి వాతావరణం నెలకొంది. ఇటీవలే కందుకూరు మాజీ శాసనసభ్యుడు మానుగుంట మహీధర్ రెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇతర నియోజకవర్గాలపై కన్నేసింది. ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు ఉగ్ర నరసింహారెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయి. త్వరలోనే ఉగ్రనరసింహారెడ్డి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు.

కేపీ కొండారెడ్డిని చేర్చుకునేందుకు…..

ఇక మార్కాపురం విషయానికొస్తే మాజీ ఎమ్మెల్యే కొండారెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన జంకె వెంకటరెడ్డి ఉన్నారు. ఆయనను ఢీకొట్టాలంటే కేపీ కొండారెడ్డి బెటర్ అన్న నిర్ణయానికి వచ్చిన తెలుగుదేశంపార్టీ ఆయనతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కొండారెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కొండారెడ్డి రాకతో మరోసారి మార్కాపురంలో జెండా ఎగరేయవచ్చన్నది తెలుగుదేశం పార్టీ వ్యూహంగా కన్పిస్తోంది.

ఆ నాలుగు చోట్ల……

ప్రజాదరణ ఉన్న సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలను గుర్తించే పనిలో పడ్డాయి రెండు పార్టీలు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీలు నియోజకవర్గాల్లో పట్టున్న నేతలెవరన్న విషయంపై ప్రత్యేకంగా సర్వేలు కూడా చేయించి మరీ జిల్లా పార్టీ కార్యాలయాలకు పంపుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, యర్రగొండ పాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ లు టీడీపీలో చేరడంతో అక్కడ బలమైన అభ్యర్థుల కోసం వైసీపీ ప్రయత్నిస్తోంది. కరణం బలరామ్ ను పార్టీలో చేర్చుకోవాలని కూడా నిర్ణయించింది. త్వరలోనే కరణం నిర్ణయం తీసుకుంటారన్న టాక్ ప్రకాశం జిల్లాలో బలంగా విన్పిస్తోంది. కందుకూరులో ఇప్పటికే మహీధర్ రెడ్డిని వైసీపీ చేర్చుకుంది.మిగిలిన రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించింది. మొత్తం మీద ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో సీనియర్ నేతలను చేర్చుకునే పనిలో రెండు పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 38942 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*