‘‘కింగ్’’లంతా ఒకేచోట చేరతారా…!!

nara chandrababunaidu ys jaganmohanreddy

విజయనగరం జిల్లాలో రాజులు, రాజ వంశాల చరిత్ర చాలా పెద్దది. ప్రజాస్వామ్య దేశంలో కూడా వారి ముద్ర చాలా బలంగా ఉంటుంది. ఎన్నికల్లో రాజులు నిలబడితే ఓటు వేసి గెలిపించడం ద్వారా ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటూంటారు. ఇక చరిత్రలో చూసుకుంటే విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు, కురుపాం రాజులు సంస్థానాధీశులుగా ఈ జిల్లాలో చక్రం తిప్పారు. శతాబ్దాల తరబడి రాజ్యాలు ఏలారు. అటువంటి రాజులంతా ప్రజాస్వామ్య యుగంలో నచ్చిన రాజకీయ పార్టీలలో చేరి ప్రజా ప్రతినిధులుగా కూడా కీలకమైన పాత్రను పోషిస్తూ వస్తున్నారు.

భిన్నమైన పార్టీల‌లో…

ఇక విజయనగరం జిల్లాలో రాజులు తమకు గౌరవం ఇచ్చిన పార్టీలో ఉంటూ రాజకీయాలు చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ లో బొబ్బిలి రాజులు, కురుపాం రాజులు ఉంటే, మొదట్లో కాంగ్రెస్ లో ఉన్నా టీడీపీ ఆవిర్భావం తరువాత పూసపాటి రాజులు సైకిలెక్కేశారు. అప్పటి నుంచి ఆ పార్టీనే నమ్ముకుని అశోక్ గజపతి రాజు రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఇక, ఆయన సోదరుడు మాత్రం టీడీపీని కాదని మ‌ళ్ళీ కాంగ్రెస్ పార్టెలోనే చేరి ఎంపీ వంటి పదవులు పొందారు. బొబ్బిలి రాజుల విషయానికి వస్తే వారు సుజయకృష్ణ రంగారావు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చి అటునుంచి మూడేళ్ళ క్రితం సైకిలెక్కేశారు. దాంతో శతాబ్దాల నాటి వైరం మరచి బొబ్బిలి రాజులు, విజయనగరం రాజులు ఒకే గూటికి చేరినట్లైంది. ఇక మరో వైపు కురుపాం రాజులు ఎప్పటి నుంచో కాంగ్రెస్ లోనే ఉంటూ వచ్చారు. విభజన తరువాత వేరే అవకాశం లేక వారంతా కూడా టీడీపీ నీడకే వచ్చి చేరారు.

ఈ రాజు అటువైపేనా…

ఇక తాజాగా విజయనగరం జిల్లాలో సీనియర్ నాయకుడు అయిన పెనుమత్స సాంబశివరాజు వైసీపీ పట్ల అసంతృప్తితో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనకు నెల్లిమర్ల టికెట్ ని జగన్ తిరస్కరించి మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు కి కేటాయించారు. దాంతో అలక బూనిన ఈ రాజు గారి చూపు కూడా టీడీపీ వైపు ఉందని అంటున్నారు. ఆయన కనుక పార్టీ మారితే నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం వంటి మూడు నాలుగు అసెంబ్లీ సీట్ల మీద ఆయన ప్రభావం గణనీయంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే కనుక జరిగితే వైసీపీకి చేదు అనుభవాలు తప్పవని ఆ పార్టీ నాయకులు కంగారు పడుతున్నారు. ఇప్పటికే బొబ్బిలి రాజులు, కురుపాం రాజులను కోల్పోయిన వైసీపీ సాంబశివరాజుని కూడా వదులుకుంటే జిల్లాలో కీలకమైన రాజ వంశీకుల మద్దతు పూర్తిగా పోగొట్టుకుంటుందని అంటున్నారు. రాజులంతా టీడీపీ వైపు ఉంటే జిల్లాలో ఫలితాలు కూడా తారు మారు అవుతాయని కూడా ఫ్యాన్ పార్టీ నేతలు బెంగటిల్లుతున్నారు. మరి ఈ సాంబశివరాజుని బుజ్జగించడానికి ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 16632 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*