లోకేష్ టీం రెడీ అయిపోతోంది…!

తెలుగుదేశం పార్టీ నేతలు తమకు తామే పోటీ చేస్తామని ప్రకటించుకోవడం పార్టీలో ఆసక్తిగా మారింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడి నుంచే పోటీ చేస్తానని తెలపడంతో ఇప్పుడు లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ఆసక్తి జోరుగా సాగుతోంది. నారా లోకేష్ శాసనమండలికి ఎన్నికై మంత్రి అయిన సంగతి తెలిసిందే. విపక్షాల నుంచి విమర్శలు రావడంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన రెడీ అయిపోయారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో యువతరానికే పెద్దపీట వేస్తారన్న టాక్ నడుస్తోంది.

కృష్ణా జిల్లా నుంచే…..

నారా లోకేష్ కృష్ణా జిల్లా నుంచే బరిలోకి దిగుతారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరు పామర్రు నియోజకవర్గంలో ఉంది. పామర్రు నియోజకవర్గం రిజర్వ్ డ్ నియోజకవర్గం కావడంతో లోకేష్ కు అక్కడ ఛాన్స్ లేదు. అందుకే దగ్గరలో ఉన్న గుడివాడ నియోజకవర్గాన్ని లోకేష్ ఎంచుకుంటారన్న వార్తలు కూడా విన్పిస్తున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో ఇటీవల లోకేష్ ఎక్కువగా పర్యటిస్తుండటం కూడా అక్కడే పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నియోజకవర్గం లోకేష్ కు అంతసేఫ్ కాదు. అక్కడ బలమైన అభ్యర్థి కొడాలి నాని ఉన్నారు.

పెనమలూరు సేఫ్…..

దీంతో పాటు తెలుగుదేశం పార్టీకి పట్టున్న హిందూపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే లోకేష్ తాజా ప్రకటనతో ఆయన అక్కడి నుంచి పోటీ చేయరన్నది స్పష్టమైంది. వచ్చే ఎన్నికల్లో హిందూపూర్ నియోజకవర్గం నుంచి బాలకృష‌్ణ మళ్లీ పోటీ చేయనున్నారని లోకేష్ ప్రకటించారు. అయితే లోకేష్ కు సేఫ్ నియోజకవర్గం పెనమలూరు అని పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. దీంతో 99 శాతం లోకేష్ పెనమలూరు నుంచే బరిలోకి దిగుతారన్న టాక్ పార్టీ వర్గాల్లో బలంగా విన్పిస్తోంది.

యువనేతలకే……

ఇక తాజాగా పత్తికొండ నుంచి తనకుమారుడు శ్యాంబాబు పోటీ చేస్తారని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి ప్రకటించారు. శ్యాంబాబు గత కొంతకాలం నుంచి పత్తికొండ నియోజకవర్గం పై దృష్టిపెట్టారు. దూరదృష్టితోనే ఆయనకు పత్తికొండ నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతలను అప్పగించారు. కేఈ కృష్ణమూర్తి ప్రత్యక్ష్య రాజకీయాలను వదిలేసి వారసుడికి అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇలా మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో ఎక్కువ శాతం టిక్కెట్లు యువతకే ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయంగా తెలుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యేల మీద కొంత అసంతృప్తి ఉండటంతో వారి వారసులను రంగంలోకి దించే యత్నంలో ఉంది పార్టీ. అప్పుడైనా ప్రజావ్యతిరేకత తగ్గి గెలుపు బాటలో పయనిస్తామన్నది ఆ పార్టీ అంచనాగా తెలుస్తోంది.

Ravi Batchali
About Ravi Batchali 36875 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*