
టీడీపీ అధినేతగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. ఆయన ప్రభుత్వ పనులతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా చూడలేని బిజీ షెడ్యూల్ లో ఉన్నారు. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో పార్టీ నేతల మధ్య కలహాలు ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యేలకు, అక్కడ ఉన్న ద్వితీయ శ్రేణి నేతలకు పడటం లేదు. కడప, ప్రకాశం, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఇలా ఒకటేమిటి?దాదాపు అన్ని జిల్లాల్లో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పంచాయతీని చంద్రబాబు పరిష్కరించాల్సి వస్తోంది. మొన్న కర్నూలు…నిన్న కడప….రేపు ఏ జిల్లా పంచాయతీ వస్తుందో తెలియని పరిస్థితి. ఇందుకోసం చంద్రబాబుపై వత్తిడి పడకుండా ముందుగానే జిల్లాల నుంచి తనకు ఖచ్చితమైన సమాచారం తెప్పించుకునేందుకు లోకేష్ ఒక టీమ్ ను రెడీ చేశారని తెలుస్తోంది.
యువనేతల ద్వారా…..
ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తీరాలి. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారాలోకేష్ పట్టుదల.అంతేకాదు ఇప్పటి నుంచే లోకేష్ తన టీమ్ ను రంగంలోకి దించారు. మొన్న జరిగిన మహానాడు సందర్భంగా లోకేష్ యువనేతలతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమై ఆ జిల్లాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షించినట్లు తెలుస్తోంది. జిల్లాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితి, వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల అనుకూలత ఉందా? ప్రతికూలత ఉందా? అన్నది తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని లోకేష్ యువనేతలను కోరినట్లు తెలుస్తోంది. కనీసం వారానికి ఒకసారి తనకు నివేదికలు నియోజకవర్గాలుగా అందాలని ఆయన వారిని ఆదేశించినట్లు సమాచారం.
సిక్కోలులో రామ్మోహన్ నాయుడు…..
ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మంత్రులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడులకు పొసగడం లేదు. ఎమ్మెల్యేల మధ్య కూడా సఖ్యత లేదు. దీంతో లోకేష్ అక్కడ పరిస్థితులను శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ద్వారా పరిస్థితులను అడిగితెలుసుకుంటున్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం గురించి, అక్కడ ఎమ్మెల్యేల పరిస్థితిపైనా తనకు ఖచ్చితమైన సమాచారం కావాలని లోకేష్ కోరారు. మంత్రులు అచ్చెన్నాయుడు, కళావెంకట్రావుల మధ్య ఉన్న విభేదాలతో ఎమ్మెల్యేలు కూడా రెండు గ్రూపులుగా విడిపోయినట్లు తెలియడంతో రామ్మోహన్ నాయుడుకు జిల్లా బాధ్యతలను అప్పగించాలన్న యోచనలో కూడా లోకేష్ ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం రామ్మోహన్ నాయుడిని జిల్లా బాధ్యతలను అప్పగిస్తారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తోంది.
మిగిలిన జిల్లాల్లో కూడా….
ఇక విజయనగరం జిల్లాలోనూ అంతే. విశాఖపట్నంలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులకు అస్సలు పొసగడం లేదు. దీంతో ఆ జిల్లాలకు ప్రత్యేకంగా తన టీం ను పంపించిన లోకేష్ అక్కడి పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. గంటా తీసుకుంటున్న నిర్ణయాల వల్లనే ఎక్కువగా అభిప్రాయ బేధాలు తలెత్తినట్లు లోకేష్ కు నివేదిక అందినట్లు చెబుతున్నారు. ఇక కడప జిల్లాలో కూడా సీఎం రమేష్ ప్రతి నియోజకవర్గంలో వేలు పెడుతుండటాన్ని కూడా తన టీం రిపోర్ట్ ఇవ్వడంతో ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచరం. మొత్తం మీద తను నియమించుకున్న ప్రత్యేక వేగుల ద్వారా లోకేష్ అన్ని నియోజకవర్గాల సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు.
Leave a Reply