
ఇప్పుడు తెలుగుదేశంలో ఇదే హాట్ టాపిక్. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ గురించే. 32 ఏళ్ల వయస్సులో మంత్రి అయిన నారా లోకేష్ వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. గత ఎన్నికల్లో బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసిన లోకేష్ ఈసారి ఫ్రంట్ డోర్ రాజకీయాల్లోకి వచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్ పార్టీకి ప్రధాన సమస్యగా మారుతున్నారని లోలోపల తెలుగు తమ్ముళ్లు మదనపడి పోతున్నారు. బయటకు చెప్పలేక, అలాగని చినబాబును దూరం చేసుకోలేక… ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతున్నారు. 13 నెలలు పాటు మంత్రిగా పనిచేసిన లోకేష్ అవినీతి ఆరోపణలను మూటగట్టకున్నారు. ఇవి నిజమా..? కాదా? అని పక్కనపెడితే ఇప్పుడు ఏపీ రాజకీయల్లో లోకేష్ మాత్రమే ఫోకస్ అవుతున్నారు.
గత ఎన్నికల్లో…..
గత ఎన్నికల్లో చంద్రబాబు సమర్థత, నిజాయితీ, శ్రమ వంటి అంశాలపై హైలెట్ గా నిలిచాయి. తెలుగుదేశం పార్టీకి ఏపీ ప్రజలు పట్టంకట్టారు. చంద్రబాబు ఎంతకాదనుకున్నా ఆయన నిరంతరం శ్రమిస్తుంటారన్నది నిజం. పరిపాలన అనుభవం పుష్కలంగా ఉన్న చంద్రబాబుకు చరిష్మా లేకున్నా, వాగ్దాటి అంతగా లేకపోయినా ప్రజలు ఆయననే ఎన్నుకున్నారు. ఇందుకు అనేక కారణాలున్నాయి. ప్రతిపక్ష నేత జగన్ పై ఉన్న అవినీతి ఆరోపణలు కూడా టీడీపీకి అప్పట్లో కలిసి వచ్చాయి. దీంతో చంద్రబాబు గెలుపు గత ఎన్నికల్లో నల్లేరు మీద నడకే అయింది. పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ క్రేజ్ కూడా కొంత కలసి వచ్చిందనుకోండి.
ఈసారి జగన్ అవినీతి ఆరోపణలు….
అయితే ఈసారి జగన్ అవినీతి ఆరోపణలను పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదంటున్నారు. చిన్న గీత ముందు పెద్దగీత వచ్చి చేరినట్లు ఇప్పుడు జగన్ కు పోటీగా లోకేష్ వచ్చారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్ పెద్ద డ్యామేజీ అవుతారని టీడీపీ సీనియర్ నేతలు కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్, జగన్ లు చంద్రబాబు కంటే లోకేష్ అవినీతిపైనే ఫోకస్ పెట్టారు. వారు చేసే అవినీతి ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికీ, అవి ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశాలున్నాయన్నది పార్టీలోనే చర్చ జరుగుతుండటం విశేషం.
టిక్కెట్ల కేటాయింపులోనూ….
మరో్వైపు టిక్కెట్ల కేటాయింపులో కూడా లోకేష్ టీం ఈసారి ముఖ్యపాత్ర పోషించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయనకు ప్రత్యేకంగా ఒక టీమ్ ఉంది. వారు నిరంతరం ప్రతి నియోజకవర్గంలో జరిగే పరిస్థితులను అంచనా వేసి నివేదికలను చినబాబుకు సమర్పిస్తుంటారు. ఆర్థికంగా బలంగా ఉండి, ప్రజల్లో కొద్దోగొప్పో పలుకుడి ఉన్న నేతలకే ఈసారి టిక్కెట్లు గ్యారంటీ అంటున్నారు. దాదాపు నలభై మంది సిట్టింగ్ లకు ఈసారి టిక్కెట్లు అధికార పార్టీ ఇచ్చే అవకాశం లేదంటున్నారు. ఇందులో వైసీపీ నుంచి జంప్ చేసి టీడీపీలో చేరిన దాదాపు పది మంది ఎమ్మెల్యేలున్నారని తెలుస్తోంది. ఇలా లోకేష్ టిక్కెట్ల ఖరారులోనూ జోక్యం చేసుకుంటే పార్టీ దెబ్బతింటుందని వాదిస్తున్నారు.
లోకేష్ కోటాలోనే……
ఇప్పటికే పార్టీ మారి వచ్చిన వారికి లోకేష్ సూచనలతోనే పదవులు ఇచ్చారని సీనియర్ నేతలు వాపోతున్నారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ కు ఎమ్మెల్సీ పదవి, టీజీ వెంకటేశ్ కు రాజ్యసభ, నామినేటెడ్ పోస్టుల్లో ఫిరాయింపు దారులకు పోస్టులు కేటాయించడం, పార్టీ మారి వచ్చిన ఆదినారాయణరెడ్డి, అమర్ నాధ్ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావులకు కూడా పదవులు వచ్చింది లోకేష్ కోటాలోనన్నది తెలుగుదేశం వర్గాల టాక్. దీంతో లోకేష్ వచ్చే ఎన్నికల్లోనూ టిక్కెట్ల ఖరారులో కీలకం అవుతారని భావించిన నేతలు బయటకు చెప్పడం లేదు కాని ఆయనవల్లనే పార్టీకి నష్టం జరుగుతుందన్నది పార్టీ వర్గాల టాక్. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Leave a Reply