
రాయపాటికి నో చెప్పారు…. అయ్యన్నకు కాదన్నారు… కోడెల రిక్వెస్ట్ ను లేదన్నారు… పరిటాలను పొమ్మన్నారు… కానీ కేఈ కృష్ణమూర్తి, కోట్ల కుటుంబాలకు పెద్ద పీట వేయడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుటుంబంలో ఒకరికే టిక్కెట్ అని నేతలకు తెగేసి చెప్పారు. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో వారసులను కూడా దింపవద్దని, సీనియర్లే పోటీ చేయాలని సూచించారు. కానీ చాలా మంది నేతలు అందుకు అంగీకరించలేదు. తమ వారసుల భవిష్యత్తు కోసమైనా చూడాలని కోరారు. అయినా వినలేదు.
కోడెల, రాయపాటికి….
ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును తీసుకుంటే ఆయన నరసరావుపేట, సత్తెన పల్లి టిక్కెట్లు కోరారు. తన తనయుడికి నరసరావుపేట టిక్కెట్ ఇవ్వాలని కోరారు.చంద్రబాబు మాత్రం కోడెల శివప్రసాదరావుకు ఒక్కరికే సత్తెనపల్లి టిక్కెట్ ఖరారు చేశారు. ఇక రాయపాట సాంబశివరావు తనకు నరసరావుపేట ఎంపీ స్థానంతో పాటు సత్తెన పల్లి స్థానాన్ని తనయుడు రాయపాటి రంగారావుకు ఇవ్వాలని గట్టిగానే ప్రయత్నించారు. అయితే రాయపాటి ప్రయత్నాలు కూడా ఫలించలేదు. సత్తెనపల్లి టిక్కెట్ ను కోడెలకు ఖరారు చేశారు.
అయ్యన్న బతిమాలినా…
మరో మంత్రి అయ్యన్నపాత్రుడు తన కుమారుడు విజయ్ పాత్రుడికి టిక్కెట్ కోరారు. నర్సీపట్నం ఎమ్మెల్యేగాని, అనకాపల్లి పార్లమెంటు సీటు కాని ఇవ్వాలని కోరారు. కానీ చంద్రబాబు మాత్రం ఖరాఖండిగా నో చెప్పేశారు. పరిటాల సునీత తనకు రాప్తాడు, కుమారుడు శ్రీరామ్ కు కల్యాణదుర్గం టిక్కెట్లు అడిగారు. చివరకు రాప్తాడు పరిటాల శ్రీరామ్ కు కన్ఫర్మ్ చేసిన చంద్రబాబు సునీతను పక్కన పెట్టేశారు. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం చంద్రబాబునాయుడు ఒకే కుటుంబం రెండు టిక్కెట్ల ఫార్ములాను ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకంటే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి కర్నూలు ఎంపీ స్థానాన్ని ఇవ్వాల్సి ఉంది. ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మకు టిక్కెట్ ఇచ్చారు. ఇక కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి కూడా చంద్రబాబు రెండు టిక్కెట్లు ఖారారు చేశారు.
వీరికి మాత్రం…..
డోన్ నియోజకవర్గం నుంచి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ కు, పత్తికొండ నియోజకవర్గం నుంచి కేఈ శ్యాంబాబు కు టిక్కెట్ ను ఖరారు చేశారు. దీంతో ఈ బలమైన రెండు కుటుంబాలకు మాత్రం రెండు సీట్లు కేటాయించారు. ఇక ఇదే జిల్లాలో మరో బలమైన ఫ్యామిలీ అయిన భూమా కుటుంబానికి కూడా ప్రస్తుతానికి ఒకేటిక్కెట్ ను కేటాయించారు. ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ పేరు ఒక్కటే ఖరారయింది. నంద్యాల, కర్నూలు పెండింగ్ లో పెట్టారు. మొత్తం మీద కర్నూలు, కోట్ల, కేఈ అంటేనే బాబు భయపడుతుందన్న సెటైర్లు పార్టీలోనే విన్పిస్తుండటం విశేషం.
Leave a Reply