మోదీజీ….. ఇది సాధ్యమేనా?

నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా జమిలి ఎన్నికల మంత్రాన్ని జపిస్తోంది. 2014లో గెలిచిన తర్వాత తొలుత పార్లమెంటు సమావేశాల్లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నోట ఈ మాటను పలికించారు. అప్పటి నుంచి వివిధ వేదికలపై పార్టీ నాయకులు, మంత్రులు ఈ పాట పాడటం పరిపాటి అయింది. అనంతరం నీతి ఆయోగ్ కూడా ఇందుకు వత్తాసు పలికింది. తాజాగా లా కమిషన్ ఈ విషయంపై వివిధ పార్టీల అభిప్రాయాలను సేకరించింది. స్థూలంగా బీజేపీ జమిలి ఎన్నికలకు మద్దతు ఇస్తుండగా, కాంగ్రెస్ ఇతమిద్ధంగా తన వైఖరిని ప్రకటించలేదు. చాలా వరకూ ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

ఏకకాలంలో నిర్వహించాలని…..

లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించడమే జమిలి ఎన్నికలు. ‘‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’’ అంటూ 2016లో తొలిసారి ప్రధాని మోదీ గళం విప్పారు. దీని సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘ చర్చ జరుగుతున్నా ఇప్పటి వరకూ కొలిక్కి రాలేదు. ఇది అసాధ్యమని కొన్ని పార్టీలు వాదిస్తుండగా, అసలు ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని, చిత్తశుద్ధిని మరికొన్ని పార్టీలు అనుమానిస్తున్నాయి. జమిలి ఎన్నికల అనుకూల, వ్యతిరేక వాదనలను ఒకసారి పరిశీలిస్తే వాస్తవాలు బోధపడతాయి. తరచూ ఎన్నికల వల్ల ఖజానాపై అధిక భారం పడుతుందన్నది ప్రధాన వాదన. 2004 లో లోక్ సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల రూ.4500 కోట్ల రూపాయల భారం పడిందని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఇది అసంబద్ధ వాదన. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఖర్చు తప్పదు. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేంత సమర్థత, దక్షత, యంత్రాంగం, బలగాలు మనకు లేవు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో అయిదారు దశల్లో ఎన్నికలు జరుపుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్ని దశల్లో ఎన్నికలు జరపాలో ఆలోచిస్తేనే భయం వేస్తుంది.

ఇది పసలేని వాదన…..

తరచూ ఎన్నికల వల్ల అభివృద్ధి పనులకు అడ్డంకులు కలుగుతున్నాయని, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నది మరో వాదన. ఇది పూర్తిగా పసలేని వాదన. ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి 40 నుంచి గరిష్టంగా 60 రోజులకు మించి ఉండదు. ఈ కొద్దికాలంలో జరిగే అభివృద్ధి ఏమీ ఉండదు. నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలకు అయిదేళ్లకు మించి అక్కరలేదు. గతంలో వివిధ సందర్భాల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వల్ల శ్రీలంక విషయంలో కేంద్రం గట్టి నిర్ణయం తీసుకోలేకపోయిందన్న అంశాన్ని కేంద్రం తెరపైకి తెస్తోంది. ఇది వాస్తవం కావచ్చు. కానీ ఒకటి, రెండు అంశాలను సాకుగా చూపి ఏకకాలంలో దేశంపై ఎన్నికలను రుద్దడం సమంజసం కాదు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించమని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. అలాంటి చట్టాలు కూడా లేవు. అలా చేయడం అంటే సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడమే అవుతుంది. ఉదాహరణకు యూపీ, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, త్రిపుర, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ ల్లో ఎన్నికలు జరిగి పట్టుమని రెండేళ్లు కూడా కాలేదు. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండు నెలలు కూడా కాలేదు. ఇప్పుడు జమిలి ఎన్నికల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేస్తారా? అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. రాష్ట్రపతి పాలన అరుదుగా, అంతిమ ప్రయత్నంగానే విధించాలన్న సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో ఎలా సాధ్యం? మరో నాలుగు నెలల్లో రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, మిజోరామ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఏడాదిలోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏకకాలంలో ఎన్నికలు జరపాలంటే ఈ అసెంబ్లీలను ముందు రద్దు చేయాల్సి ఉంటుంది. ఇది ఆచరణలో ఎలా సాధ్యం. భిన్న కులాలు, మతాలు, ప్రాంతాలతో ‘‘భిన్నత్వంలో ఏకత్వం’’ సూత్రానికి ప్రతీకగా నిలుస్తున్న అఖండ భారతావనిలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఎంతవరకూ సమంజసం? వీటిపై విస్తృత చర్చ అవసరం.

ప్రాంతీయ సమస్యల మాటేమిటి?

జమిలి ఎన్నికల జపాన్ని వల్లిస్తున్న బీజేపీ చిత్తశుద్ధిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తమ పార్టీకి పూర్తిగా కాకపోయినా, ఒకింత సానుకూలత ఉందని బీజేపీ భావిస్తుంది. ఇదే అదనుగా ఎన్నికలకు వెళితే లబ్ది పొందవచ్చన్నది బీజేపీ దూరాలోచన. ఒకేసారి ఎన్నికల వల్ల ప్రాంతీయ అంశాలు, సమస్యలు, ఎన్నికల ప్రణాళికలు మరుగునపడి పోతాయి. జాతీయ అంశాలు, సమస్యలు తెరపైకి వస్తాయి. తద్వారా కేంద్రంలో ఉన్న అధికార పార్టీ లబ్ది పొందే అవకాశం ఉంది. ఒకేసారి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు కాళ్లు, చేతులు కూడదీసుకుని పోరాటం చేసే అవకాశం ఉండదు. ఆ యా రాష్ట్రాలకే అవి పరిమితం కావాల్సి ఉంటుంది. ఒక్కడై కేంద్రంపై పోరాటం చేసే అవకాశం ఉండదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుకుని బీజేపీ జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తెస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. జమిలి ఎన్నికల వల్ల కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీకి ఎక్కువ మంది ఓటర్లు ఓటేస్తారన్న సర్వేల నేపథ్యంలో బీజేపీ ఈ పాట పాడుతుందన్న వాదనలూ ఉన్నాయి. దీనిని కాదనలేని పరిస్థితి ఉంది.

ఎక్కువ పార్టీలు వ్యతిరేకమే?

నిజానికి జమిలి ఎన్నికలపై రాజ్యాంగం ఏమీ చెప్పనప్పటికీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 70వ దశకం వరకూ లోక్ సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వాన్ని నాడు నెహ్రూ రద్దు చేయడంతో ఈ సంప్రదాయానికి బ్రేక్ పడింది. 70వ దశకంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం వల్ల కూడా ఒకేసారి ఎన్నికలు జరగలేదు. అప్పటి నుంచి విడివిడిగానే ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా లా కమిషన్ చేపట్టిన అభిప్రాయ సేకరణపై కూడా ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ దోబూచులాడుతున్నాయి. జమిలి ఎన్నికలను సమర్థిస్తున్న బీజేపీ నెలాఖరు వరకూ సమయాన్ని కోరింది. విపక్షాలతో మాట్లాడి చెబుతామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. సీపీఐ, సీపీఎంలతో పాటు తృణమూల్ కాంగ్రెస్, ఏఐడీయూఎఫ్, గోవా ఫార్వార్డ్, తెలుగుదేశం వంటి పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకించాయి. జాతీయ పార్టీలు తమ అధికార బలంతో, అంగబలంతో, అర్థబలంతో ప్రాంతీయ పార్టీలను తొక్కేస్తాయని ఈ పార్టీలు వాదిస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటున్నాయి. బీజేపీ మిత్రపక్షమైన అకాళీదళ్ మాత్రం సమర్థిస్తోంది. టీఆర్ఎస్ ది కూడా అదే బాట. జమిలి ఎన్నికల ఆవశ్యకత ఉన్నప్పటికీ కొన్ని ఆచరణాత్మక ఇబ్బందుల దృష్ట్యా 2024 లోనే తమిళనాడులో ఎన్నికలు చేపట్టాలని ఏఐడీఎంకే స్పష్టం చేసింది. ఒక వేళ మెజారిటీ పార్టీలు అంగీకరించినా ఇప్పటికిప్పుడు ‘‘జమిలి’’ సాధ్యపడదు. ముందుగా ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేపట్టాలి. ఇది అంత తేలికైన, ఆషామాషీ విషయం కాదు. ఇది కమలనాధులకూ తెలియంది కాదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 33906 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*