
హస్తం పార్టీకి దేశ ప్రజలు రెండు సార్లు వరుస అవకాశాలిచ్చారు. వరుస కుంభకోణాలు బయటపడినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గుచూపారు. 2004, 2009 ఎన్నికల్లో హస్తం పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పట్లో బీజేపీకి పెద్దగా పట్టు లేకపోవడంతో కూటమి పార్టీలతో అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ వేరు. భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒంటరిగా, బలహీనంగా ఉన్న చోట పొత్తులతో ముందుకు వెళుతుంది. తమ ఐదేళ్ల పరిపాలనలో కుంభకోణాలేవీ లేవు కనుక మరోసారి తమకు ప్రజలు అవకాశమిస్తారని కమలం పార్టీ గట్టిగా భావిస్తోంది.
కాంగ్రెస్ పై వ్యతిరేకతతోనే….
భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికలకు ముందు పెద్దగా ప్రభావం చూపే పార్టీగా లేదన్నది మాత్రం వాస్తవం. కేవలం ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల్లోనే దానికి పునాదులున్నాయి. అయితే 2014లో గుజరాత్ మోడల్ అన్న నినాదంతో బీజేపీ నరేంద్ర మోదీని ముందుపెట్టింది. కాంగ్రెస్ పదేళ్ల పాటు చేసిన కుంభకోణాల పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. మోదీ ఇమేజ్ కూడా మామూలుగా లేదు. దీంతో 2014 లో పార్లమెంటులో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఎవరి సహకారం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది.
మరో ఐదేళ్లపాటు….
కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నరేంద్ర మోదీ చరిష్మాలేదు. ఐదేళ్లలో పెద్దగా దేశంలో మార్పులు చోటు చేసుకుందీ లేదు. దీంతో పాటుగా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటివి బీజేపీ విజయానికి ఆటంకంగా మారాయి. అందుకోసమే ఈసారి ఎన్నికలు మోదీ ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయన్నది విశ్లేషకుల అంచనా. ఎవరికైనా అధికారం ఉంటే ఐదేళ్లలో పెద్దగా చేయగలిగిందేమీ లేదని, మరోసారి అవకాశమిస్తే దేశ స్వరూపాన్నే మార్చేస్తామని కమలనాధులు కొత్త నినాదం అందుకున్నారు. మరోవైపు ఉత్తర భారతంలోని అన్ని రాష్ట్రాల్లో అన్ని విధాలుగా బీజేపీ బలం పెరిగింది.
వారి అండ ఉంటేనే…..
ఇక హస్తం పార్టీ విషయానికొస్తే పొత్తులు కుదుర్చుకోవడంలోనే విఫలమయింది. కాంగ్రెస్ ఇటు ఉత్తరాది, అటు దక్షిణాదిలోనూ సొంత బలం లేక అవస్థలు పడుతుంది. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ బలంగా ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ అరకొర సీట్లు తప్ప స్వీప్ చేసే ఛాన్సులు లేవు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఆపసోపాలు పడుతుంది. ప్రాంతీయ పార్టీలు ఎన్నికల అనంతరం మద్దతిస్తే తప్ప గద్దెనెక్కే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి మరోసారి అవకాశం దక్కుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. పదేళ్ల పాటు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చిన విధంగానే మోదీకి కూడా మరో అవకాశం దక్కుతుందన్నది విశ్లేషకుల అంచనా. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Leave a Reply