పాచిక పారేనా..?

దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ట క్రమేపీ మసకబారుతోంది. దీనిని పునరుద్దరించుకోవడంతోపాటు అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవడం లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేస్తున్నారు పార్టీ అధినాయకులు. కరుడుగట్టిన హిందూవాదం ఒకవైపు ,అభివృద్ధి అజెండాను మరొక వైపు అస్త్రాలుగా ప్రయోగించాలని యత్నిస్తున్నారు. ఉత్తరభారతావనిలో ఉత్తరప్రదేశ్, దక్షిణ భారతంలో కేరళను ఇందుకు ప్రయోగవేదికలుగా మార్చాలని చూస్తున్నారు. యూపీలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అయితే ప్రతిపక్ష శక్తులన్నీ ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితులు ఎదురైతే ఒక్కటైన విపక్షాలను మెజార్టీ వాదం ద్వారా ఒంటిచేత్తో ఓడించే బలం సంతరించుకోవచ్చునని భావిస్తున్నారు. మోడీ, అమిత్ షా ల ఈ వ్యూహరచనకు పార్టీలో పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. గత కొంతకాలంగా సంఘ్ పరివార్ శక్తులు ప్రభుత్వ విధానాలపై సంతృప్తి గా లేవు. ఈ దెబ్బతో వారిని కూడా దారికి తేవచ్చని అంచనా వేస్తున్నారు.

రాజకీయ అనివార్యత…

ఎస్పీ, బీఎస్పీ,కాంగ్రెసు కలిసికట్టుగా కదిలితే ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతాపార్టీకి చుక్కలు కనిపించడం ఖాయం. ఓటింగు బలం రీత్యాను, సామాజిక సమీకరణల దృష్ట్యాను ఈ కాంబినేషన్ ను ఓడించడం అసాధ్యం. 2017 ఎన్నికల్లో ఎస్పీ,బీఎస్పీలు పరస్పరం కలహించుకోవడం వల్ల కమలం పార్టీ రికార్డు స్థాయి విజయం సాధించింది. సమాజ్ వాదీ పార్టీలోని అంతర్గత కలహాలూ కలిసివచ్చాయి. సమర్థ నాయకునిగా పేరున్నప్పటికీ అఖిలేష్ యాదవ్ తమ పార్టీకి విజయం సాధించిపెట్టలేకపోయారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ హవా నడుస్తున్న పరిస్థితుల్లో తమ పార్టీలు బతికిబట్టకట్టాలంటే సోషల్ ఇంజినియరింగ్ తప్పనిసరి అవసరంగా ఎస్పీ, బీఎస్పీలు గుర్తించాయి. యువ నాయకుడైన అఖిలేష్ యాదవ్ రాజకీయం నడపడంలో దిట్ట. మాయావతి కొంత చంచల మనస్తత్వం కలిగిన నాయకురాలు. ఆమెను అత్తమ్మ అంటూ సంబోధించి , వ్యక్తిగతంగా మచ్చిక చేసుకునే యత్నాలు చేపట్టారు. బీఎస్పీ ఆర్థికంగా దెబ్బతింది. సుదీర్ఘకాలం ప్రతిపక్షంగా ఉండటానికి తోడు కేంద్రంలోని దర్యాప్తు సంస్థలు ఆమెను చక్రబంధంలో ఇరికించేశాయి. ఈ పరిస్థితుల్లో బలమైన మద్దతు ఉంటే తప్ప ఆమె నిస్సహాయురాలిగా మిగిలిపోతుంది. రాజకీయంగా బలాన్ని సంతరించుకోవడమే ఆమె సమస్యలకు పరిష్కారం. ఎస్పీతో చేయి కలిపి ఒక ఇరవై లోక్ సభ స్థానాలైనా గెలుచుకుంటే కేంద్రంలో కొంత పట్టు చిక్కుతుంది. అందువల్ల 2019లో ఎస్పీతో చేయి కలపడం మాయావతికి తప్పనిసరి అవసరంగా మారింది. ఇప్పటికే స్నేహహస్తం అందిస్తున్న అఖిలేష్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఇక మిగిలి ఉంది.

మళ్లీ మందిర్….

ఎస్పీ, బీఎస్పీ కలిసి ఇప్పటికే ఉప ఎన్నికల్లో తమ హవా చూపించగలిగాయి. బీజేపీ సర్కారు కు ప్రభుత్వ వ్యతిరేకత ఎదురవుతోంది. మరోవైపు పొలిటికల్ పోలరైజేషన్ జరుగుతోంది. 2019లో 15 నుంచి 20 స్థానాలకు బీజేపీ బలం పడిపోతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదే జరిగితే దారుణమైన పరాభవం కిందే లెక్క. ఈ నేపథ్యంలో హిందూ ఓటును సంఘటితం చేసుకోగలిగితే మాత్రమే బీజేపీ గట్టెక్కగలుగుతుంది. బీజేపీ అనుబంధ సంఘాలు, శక్తులు, భావనలు కలిగిన వ్యక్తులు మూడు రకాలుగా తమ అజెండాను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. గోరక్ష, లవ్ జిహాద్, ఘర్ వాపసీ వంటి సాధారణ అజెండా యూపీలో పెద్దగా ప్రభావం చూపదు. అందుకే 1990లలో పార్టీకి జీవం పోసి, అధికారానికి సోపానంగా నిలిచిన ‘రామ్’ నామాన్ని జపించడానికి సిద్దమవుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంలో బాధ్యతను తలకెత్తుకుంటున్నారు. అదే సమయంలో మధ్యతరగతి వర్గాలు , విద్యావర్గాలు హిందూ అజెండాతో విభేదించే అవకాశాలున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి అజెండాను ముందుకు తెస్తున్నారు. దీనికి ప్రతీకగా నరేంద్రమోడీని చూపించే ప్రయత్నం మొదలుపెట్టారు. అటల్ బిహారీ వాజపేయి గతంలో ఏరకమైన ఇమేజ్ తో ప్రజాభిమానాన్ని చూరగొన్నారో అదే తరహాలో మోడీకి కూడా మధ్యతరగతిలో ఆదరణ తెచ్చే దిశలో ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు.

పాగా వేసేందుకు…

కేరళలోని వామపక్ష ప్రభుత్వ చాందసత్వం కారణంగా తెలివైన ఎత్తుగడలతో బీజేపీ పక్కాగా పాగా వేస్తోంది. ముఖ్యమంత్రి విజయన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అన్న తరహాలో వ్యవహరించే కరడుగట్టిన వామపక్ష వాది. సుప్రీం కోర్టు తీర్పును సాకుగా చేసుకుంటూ తరతరాలుగా వస్తున్న సంప్రదాయానికి చాప చుట్టించేయాలనే దిశలో యోచిస్తున్నారు. అయ్యప్పసన్నిధికి నిర్దిష్ట వయసులోని ఆడవారి ప్రవేశంపై శతాబ్దాలుగా షరతులు కొనసాగుతూ వస్తున్నాయి. వాటిని ఒక్కసారిగా పక్కన పెట్టడం అంత సులభం కాదు. అయినా మొండిగా ముందుకు వెళ్లేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. 45 శాతం వరకూ రాష్ట్రంలో ముస్లిం, క్రిస్టియన్ జనాభా ఉంది. అందువల్ల తమ ప్రభుత్వానికి మద్దతుగా ఆయా వర్గాలు కలిసి వస్తాయని, ప్రభుత్వం హిందూ వాదులపై ఉక్కు పాదం మోపేందుకు ఉద్దేశపూర్వకంగా చర్యలకు దిగుతోంది. దీనిని అడ్వాంటేజ్ గా మార్చుకుంటూ హిందువులలో 25శాతం ఓటింగు తెచ్చుకోవాలనే దిశలో పక్కా ప్లాన్ గీస్తోంది బీజేపీ. రథయాత్రలకు శ్రీకారం చుడుతోంది. క్రిస్టియన్, ముస్లిం ఓట్లు కాంగ్రెసు, వామపక్షాల మద్య చీలిపోతే 25 నుంచి 30 శాతం ఓట్లు పోలరైజ్ చేసుకోగలదని అంచనా. ఆ స్థితిలో ప్రభుత్వంలోకి లేదా ప్రధాన ప్రతిపక్ష పాత్రలోకి బీజేపీ రావడం ఖాయం. అనాలోచిత చర్యలతో ప్రస్తుత సర్కారే అందుకు మార్గం సుగమం చేయడం విచిత్రం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 30968 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*