ఆ ముగ్గురితోనే ముప్పు….???

narendramodi-fight-with-three-leaders

లోక్ సభ ఎన్నికల్లో అధికార పార్టీ వ్యవహారాలు అన్నీ సాధారణంగా ప్రధాని చుట్టూనే కేంద్రీకృతమవుతాయి. అధికార పార్టీకి అధ్యక్షుడు ఉన్నా ఆయన పాత్ర నామమాత్రమే. హడావిడి అంతా ప్రధానిదే. ఆయనను ఎదుర్కొనడానికి లోక్ సభలో విపక్ష నేత, విపక్ష పార్టీ అధ్యక్షుడు సిద్ధంగా ఉంటారు. లోక్ సభలో కాంగ్రెస్ కు తగిన సంఖ్యాబలం లేకపోవడంతో విపక్ష నేతే లేకుండా పోయారు. కాంగ్రెస్ పక్ష నాయకుడుగా కర్ణాటకకు చెందిన దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే వ్యవహరిస్తున్నారు. మోదీని ఎదుర్కొనేంత ధీటైన నాయకుడు కాదు ఆయన. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో రాటు దేలి మోదీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మరో ముగ్గురు మహిళ నేతలు కూడా ప్రధానికి గట్టిపోటీ ఇస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, తాజాగా రాజకీయ అరంగేట్రం చేసిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీలు మోదీకి ధీటైన పోటీ ఇవ్వనున్నారు. ఈ దిశగా ఈ ముగ్గురు మహిళా నేతలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.

దీదీ దడ దడ…..

ఈ వరసలో అందరికన్నా ముందున్నారు మమత బెనర్జీ. మోదీపై ఒంటికాలి మీద లేస్తున్నారు ఈ బెంగాలీ దీదీ. మోదీకి వ్యతిరేకంగా గత రెండేళ్లుగా జాతీయ స్థాయిలో కూటమి కట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ దిశలో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వంటి అగ్రనేతలతో మంతనాలు సాగిస్తున్నారు. గత నెలలో కోల్ కత్తాలో వివిధ పక్షాల నేతలతో భారీ బహిరంగ సభను నిర్వహించి తన సత్తా చాటారు. 42 లోక్ సభ గల ఈ రాష్ట్రం అతిపెద్ద రాష్ట్రం. ఏ ప్రాంతీయ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రంలో కూడా ఇన్ని లోక్ సభ స్థానాలు లేవు. 2014 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 42 లోక్ సభ స్థానాలకు గాను మమత సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 34 స్థానాలను గెలుచుకుని తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. బీజేపీ 2, సీపీఎం 2, కాంగ్రెస్ నాలుగు స్థానాలకు పరిమితమయ్యాయి. ఇటీవల కాలంలో సీపీఎం, కాంగ్రెస్ ప్రభావం బాగా తగ్గినట్లు చెబుతున్నారు. దీంతో అత్యధిక స్థానాలను గెలుచుకోవడం ద్వారా జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలన్నది ఆమె కోరిక. ప్రధాని అభ్యర్థిగా తెరపైకి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఒక్క బెంగాల్ లోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో మోదీ పార్టీకి గట్టిపోటీ ఇచ్చేందుకు మమత సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కాంగ్రెస్ తో బద్ధవైరం ఉన్నప్పటికీ ప్రధాన శత్రువు మోదీని ఎదుర్కొనే క్రమంలో తాత్కాలికంగా వెనక్కు తగ్గారు. వాస్తవానికి ఒకప్పుడు మమత వాజ్ పేయి మంత్రివర్గంలో సభ్యురాలు. రైల్వే మంత్రిగా పనిచేశారు. బీజేపీతో కలసి ఎన్నికల్లో పోటీ చేయడం గమనార్హం. అలాంటి మమతకు ఇప్పుడు బీజేపీ పొడ అంటేనే గిట్టడం లేదు.

“మాయా”లోచనలు…..

మోదీని సిద్ధమవుతున్న మరో మహిళానేత మాయావతి. గతంలో నాలుగుసార్లు యూపీ సీఎంగా పనిచేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి గత లోక్ సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నారు. ఒక్క సీటు గెలుచుకోలేకపోయారు. అయితే ఓట్ల శాతం పరంగా చూస్తే బలంగా ఉన్నారు. ఈసారి ఎలాగైనా మోదీ ప్రాబల్యాన్ని రాష్ట్రంలోనూ, దేశవ్యాప్తంగా కట్టడి చేయాలన్నది మాయావతి పట్టుదల. ఇందులో భాగంగానే తన బద్ధ శత్రువైన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో కలసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పొత్తు పెట్టుకున్నారు. ఒంటరిగా మోదీని ఎదుర్కొనడం అంత తేలిక కాదన్న ఉద్దేశ్యంతో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో కలసి అడుగులు వేస్తున్నారు. పొత్తులో భాగంగా మొత్తం రాష‌్ట్రంలోని 80 స్థానాల్లో బీఎస్పీ 38, ఎస్పీ 37 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అజిత్ సింగ్ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ లోక్ దళ్ కు కూడా సీట్లను కేటాయిచంారు. కాంగ్రెస్ కు అమేధీ, రాయబరేలీ స్థానాలను కాంగ్రెస్ కు వదిలేయాలన్నది ఆలోచన. బిజనూర్, అలీఘడ్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, సీతాపూర్, సుల్తాన్ పూర్, బస్తీ, నాగినా, సహరాన్ పూర్, కైసర్ గంజ్, సలేంపూర్ తదితర స్థానాలపై బీఎస్పీ దృష్టి సారించింది. మాయావతి లక్ష్యం మోదీని గద్దె దించడం మాత్రమే కాదు. పరిస్థితులు అనుకూలిస్తే తానే ప్రధాని కావాలన్నది ఆమె ఆలోచన. ఈ దిశగా కూడా పావులు కదుపుతున్నారు.

సవాల్ విసురుతున్న ప్రియాంక…..

కాంగ్రెస్ నుంచి మోదీకి సవాల్ విసురుతున్న మరో మహిళ ప్రియాంక గాంధీ. తాజాగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆమెను సోదరుడు, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శిని చేశారు. యూపీ వ్యవహారాల బాధ్యతలను అప్పగించారు. ఆమెతో పాటు జ్యోతిరాదిత్య సింధియా కూడా యూపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలో సంప్రదాయకంగా పార్టీకి మద్దతుదారులుగా ఉన్న బ్రాహ్మణ, వైశ్య, ఠాకూర్లను ఆకర్షించడం ఆమె ముందున్న ప్రధాన కర్తవ్యం. గాంధీ కుటుంబానికి చెందిన నేతగా తటస్థ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. ఎస్పీ, బీఎస్పీ లను నియంత్రించడం కన్నా బీజేపీకి గల సంప్రదాయ ఓటు బ్యాంకును దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రియాంక ప్రచారం చేస్తున్నారు. 2014లో తటస్థ ఓటర్లు మోదీ వైపు మొగ్గు చూపారు. తండ్రి రాజీవ్ గాంధీ, నాయనమ్మ ఇందిరాగాంధీ పేరుతో కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ తూర్పు యూపీపై ప్రభావం చూపలగలరన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 37326 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*