
ప్రధాని మోడీ ఏపీకి వచ్చేస్తున్నారు. వాగ్దాటితో తిమ్మిని బమ్మిని చేయగల మోడీ సమర్ధత దేశమంతా తెలుసు. ముఖ్యంగా ఎపి సీఎం టిడిపి అధినేత చంద్రబాబు కు తెలిసినంతగా మోడీ వ్యవహారం ఎవరికీ తెలియదు. జనవరి 6 న అమరావతి రానున్న మోడీ టిడిపి పై పేల్చనున్న బాంబులు ఒక రేంజ్ లో వుండబోతున్నాయన్నది పొలిటికల్ టాక్. దాంతో వచ్చే ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు బాబు అస్త్రశస్త్రాలు ముందే సిద్ధం చేసేసారు.
బాబు అస్త్రాలు ఇవే …
ఏపీలో గత నాలుగున్నరేళ్లల్లో ఏం జరిగింది? శాఖల వారీగా వున్న పరిస్థితి ఏంటి ? కేంద్రం నుంచి రావలిసింది ఏంటి ? రాష్ట్రం చేసింది ఏంటి ? ఇలాంటి ముఖ్య అంశాలన్నీ శ్వేతపత్రాల రూపంలో ప్రజలముందు పెట్టి చర్చ పెట్టేశారు చంద్రబాబు. ఇక శాఖల వారీగా ఒక్కో శ్వేత పత్రం బయట పెట్టనుంది టిడిపి సర్కార్. గత నాలుగేళ్లుగా విపక్షాలు, ప్రజాసంఘాలు శ్వేతపత్రాలు విడుదల చేసి బాబు నిజాలు ప్రజలతో నేరుగా పంచుకోవాలని నెత్తినోరుకొట్టుకున్నా పట్టించుకోని ఎపి సీఎం ఇప్పుడు తెల్లకాగితాలు విడుదల చేయడం ద్వారా తన పాత మిత్రుడు మోదీకి పూర్తిగా చెక్ పెట్టాలన్న వ్యూహమే కనిపిస్తుంది.
ఎప్పుడు ఏది ఎలా వాడాలో ….
రాజకీయ చాణుక్యుడిగా అందరిచేత ప్రశంసలు అందుకునే చంద్రబాబు కు పాలిటిక్స్ లో టైమింగ్ రైమింగ్ తెలిసినంత ఎవరికీ తెలియదు. అందుకే అదను చూసి బాబు ఇప్పుడు తెల్లకాగితాలు విడుదల చేస్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికలకు యుద్ధ శంఖం పూరించారు. అయితే ఈ పోరాటం రెండేళ్లక్రితం మొదలు పెట్టి ఉంటే ఏపీకి ఎంతో కొంత మేలు జరిగేదని కానీ ఇప్పుడు చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్లు శ్వేత పత్రాల విడుదల పొలిటికల్ ట్రాజెడీ గా మిగిలిపోవడం తప్ప ప్రయోజనం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బాబు శ్వేత పత్రాలకు పోటీగా బ్లాక్ పేపర్స్ విడుదలకు వైసిపి సిద్ధమైన నేపథ్యంలో ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఈ వ్యవహారం ఒక ప్రహసనంగా మారడం తప్ప ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
Leave a Reply