సెల్ఫ్ గోల్….!!

narendramodi-trinamool-congress

నిజంగానే ఆయనతో నలభై మంది పశ్చిమబెంగాల్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారా? లేక కేవలం బెదిరింపు కోసం అలా ప్రకటించారా? ఏదేమైనప్పటికీ ప్రధాని మనసులోని మాటను మాత్రం బయటపెట్టేశారు. తాము ప్రభుత్వాన్ని కూల్చేయడానికి సిద్ధం. అవసరమైతే ఫిరాయింపులనూ ప్రోత్సహించేందుకు సిద్దమని నిర్ద్వంద్వంగా చెప్పకనే చెప్పేశారు. ఇదే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చోపచర్చలకు దారితీస్తోంది. స్థాయినిబట్టే స్పందన ఉంటుంది. హోదాను బట్టే మర్యాదను ఆశిస్తాం. లేకి రాజకీయాల ఏరువాకలో ప్రధాని సైతం నేనున్నానడమే నేటి విచిత్రం. నలభైమంది టచ్ లో ఉన్నారంటూ బెంగాలీ తృణమూల్ ఎమ్మెల్యేలనుద్దేశించిన వ్యాఖ్య విపక్షాల్లో అభద్రతను రేకెత్తిస్తోంది. పశ్చిమబంగ ప్రభుత్వాన్ని కూల్చేసే సామర్థ్యముందనే పరోక్ష హెచ్చరిక అందులో దాగి ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ, పార్టీఫిరాయింపుల నిరోధక చట్టం వంటి వాటిని స్వయంగా ప్రధానే పక్కనపెట్టేశారు. ఇక రాజ్యాంగం, విలువల గురించి ఎవరు మాట్టాడాలి? ప్రత్యర్థి పార్టీ తప్పులను ఏకరవు పెట్టడం, వారిని కాదు తమను ఎన్నుకోండి. మంచి పరిపాలన అందిస్తామని చెప్పడం ప్రచారానికి హుందా తనాన్నిస్తుంది. కానీ నాయకులు ఆ సంప్రదాయాన్ని ఎప్పుడో మరిచిపోయారు. గోడ దూకి వచ్చేస్తే ఎంత గిట్టుబాటవుతుందో పక్కా లెక్కలతో చెప్పేస్తున్నారు. బేరసారాల విద్యలో అన్నిపార్టీలు ఆరితేరిపోయాయి. ప్రజాతీర్పు వారికి బేఫికర్. ప్రధాని మాటల్లోని ఆంతర్యమదే.

స్థాయి తగ్గింది…

ప్రధాని స్థాయి వాళ్లే ఫిరాయింపులకు ద్వారాలు తెరిస్తే చిన్నాచితక పార్టీలు, ప్రాంతీయ అధినేతలు కట్టుతప్పి కొనుగోళ్లకు తెగిస్తే తప్పేంటి? మామూలు రోజుల్లో అయితే ఇదో పెద్ద వ్యవహారమే కాదు. ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. కానీ ప్రధాని లేవనెత్తిన సందర్భమే చర్చకు దారి తీస్తోంది. ఎన్నికల హీట్ పీక్ లో ఉన్నప్పుడు ఆయన ప్రత్యర్థి పార్టీ పీకల మీద కాసుకోమంటూ ఫిరాయింపుల కత్తి పెట్టారు. దీంతో అంతా ఒకటయ్యారు. ప్రతిపక్షాలు ఒకే కంఠంతో ఆయనపై ధ్వజమెత్తుతున్నాయి. సింగిల్ పాయింట్ అజెండాను ప్రధానే వారికి అందించారు. ఇందులో ఏపీ ముఖ్యమంత్రినే మొదటగా చెప్పుకోవాలి. వైసీపీ ఎమ్మెల్యేలు 23 మందిని కలిపేసుకుని నలుగురికి మంత్రిపదవులిచ్చిన తన స్వీయోదంతాన్ని అవసరార్థం ఆయన మరిచేపోయారు. ప్రధానిపై ఎన్నికల కోడ్ ప్రయోగించాలని డిమాండ్ చేశారు. ఎదుటివారికి చెప్పేందుకే నీతులు. తనవరకూ వస్తే అవి రోతలు అనేదే కదా సామెత. సార్వత్రిక ఎన్నికల సంబురం మధ్యలో ఉంది. అందుకే ఇంత రభస. మమత ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర సాగుతోందంటూ సమాజ్ వాదీ నుంచి కాంగ్రెసు వరకూ కమలం పార్టీపై కన్నెర్ర చేస్తున్నాయి. బీజేపీపైనా ప్రత్యేకించి మోడీపైనా ధ్వజమెత్తేందుకు ఏ ఒక్క అంశం దొరికినా వదలకుండా వజ్రాయుధంలా వాడుకుందామని చూస్తున్న ప్రతిపక్షాలకు ఒక పవర్ ఫుల్ అస్త్రాన్ని అందించారు ప్రధాని. పాలిటిక్స్ లో ఇదో సెల్ఫ్ గోల్.

సిద్దాంతాల చింతే లేదు…

రాజకీయాల్లో విలువలు అంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడమన్నది జగమెరిగిన సత్యమే. అయినా ఎవరూ అంగీకరించరు. అదే హిపోక్రసీ. ఒకవేలు ప్రత్యర్థి వైపు చూపితే నాలుగువేళ్లు తమనే చూస్తుంటాయని గుర్తించడానికి నిరాకరిస్తారు. బీజేపీ కూడా ఇప్పుడు ఆ తాను ముక్కే. వాజపేయి, అద్వానీల కాలం నాటి కమలం కాదిది. ఆ సిద్ధాంతరాద్ధాంతాలు పాతచింతకాయ పచ్చడి. మరిచిపోయి చాలా రోజులైంది. పదే పదే అదే విషయాన్ని మోడీ, షాలు ప్రత్యక్షంగా రుజువు చేస్తూనే ఉన్నారు. ఉనికే లేని ఈశాన్య రాష్ట్రాలు మొదలు మెజార్టీ రాని గోవా వరకూ సర్కారులను ఏర్పాటు చేయడంలో ఎన్నెన్ని ఎత్తుగడలు వేయాల్సి వచ్చిందో ఇతర పార్టీలకు తెలియని కొత్త సంగతా? ఉత్తరాది ముద్ర నుంచి పాన్ ఇండియా పార్టీగా మార్చడంలో ఈ మెలకువలన్నీ మేలిముత్యాలుగా నిరూపితమైన అంశాలే. అయినా కోడ్ అమలు చేయమని, ప్రధాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోమని కోరడంలో పార్టీల రాజకీయమే కనిపిస్తుంది. ఉల్లంఘనలపై సుప్రీం కోర్టు స్పందించి నిలదీసినా మొక్కుబడిగా చర్యలకు పూనుకుంటున్న ఎన్నికల సంఘం రాజకీయ డిమాండ్లను పట్టించుకుంటుందనుకోవడం అత్యాశే.

కర్ర ఉన్నవాడిదే బర్రె…

రాత్రికి రాత్రి పవర్ పగ్గాలు మారిపోతున్న ప్రస్తుత తరుణంలో కర్ర ఉన్నవాడిదే బర్రె. ఈడీ, ఇన్ కమ్ టాక్సు మొదలు సీబీఐ, ఇంటిలిజెన్సు వరకూ కేంద్ర సంస్థలే. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. ష్ ..గప్ చుప్ అనుకుంటూ నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. లేదంటే దాడులు, కేసులు, విచారణల పేరిట అణచివేత కొనసాగుతుంది. కాగల కార్యానికి ప్రత్యక్షసాక్షులు కాకూడదనుకుంటే కళ్లు మూసుకోవాల్సిందే… ఇంతకీ పీఎంతో టచ్ లో ఉన్న ఆ నలభైమంది ఎవరన్నదే ఆసక్తి తప్పితే …మార్గదర్శక సూత్రాల కొరడా ఝళిపించి మోడీని అదుపు చేస్తారనేది దింపుడు కళ్లెం ఆశే. తెలిసీ తెలియనట్లు నటిస్తూ రక్తి కట్టించడమే పొలిటికల్ హైడ్రామా…ఈ అభినయంలో అన్నిపార్టీలకూ ఫస్టు మార్కులే. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమే వస్తే తాము కూడా అదే పని చేస్తారు. యూపీఏ, ఎన్డీఏలకు ప్రత్యామ్నాయంగా అధికారంలోకి రావాలని చూస్తున్న ప్రాంతీయపార్టీల అధినేతలు అవసరమైతే ఆ రెండు కూటముల మద్దతు తీసుకునేందుకూ వెనకాడరు. ఎందుకంటే అధికారానికి అంతటి అవకాశవాదం జోడై ఉంటుంది.

 

-ఎడిటోరియలో డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 31025 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*