వార్… వన్ సైడ్ అయ్యేలా లేదే…!!

చంద్రబాబు

ఏపీ లో విభజన సెంటిమెంట్ ఇంకా చల్లారలేదు. ఇదే పాయింట్ పై వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలని టిడిపి విపక్షాల అజెండాను ఆరునెలల క్రితం అకస్మాత్తుగా హైజాక్ చేసి రంగంలోకి దిగింది. కేంద్ర సర్కార్ ను అన్ని పాపాలకు బాధ్యుల్ని చేసేలా సెంటిమెంట్ రాజేసి మోస పోయామని వాపోతూ జనం ఓట్లు కొల్లగొట్టే పక్కా ప్లాన్ గీసి దానికి అనుగుణంగా పద్ధతిగా అడుగులు వేస్తూ ఆ విధంగా ముందుకు నడుస్తుంది. దీనిని ధీటుగా తిప్పికొట్టే పనిలో విపక్షాలు కొంత ప్రయత్నం చేస్తున్నా వారు అనుకున్నంత సక్సెస్ కాలేక పోతున్నాయి. అయితే ఆయా పార్టీల సానుభూతిపరులు సోషల్ మీడియా వేదికలపై మాత్రం గట్టి పోరాటమే చేస్తున్నారు.

ప్రధాన ప్రతిపక్షం సోషల్ మీడియా నే …

నాడు…. నేడు బాబు వైఖరిపై అపరిచితుడు గా చిత్రీకరించి చిత్రంలోని హీరో మూడు క్యారెక్టర్లను ఆవిష్కరిస్తూ ప్రధాన పార్టీల కన్నా పెద్ద ఎత్తునే టిడిపి ని డ్యామేజ్ చేసి పారేస్తున్నారు సోషల్ మీడియా లో నెటిజెన్లు. ఇదిలా ఉంటే ఇప్పుడు హస్తినను వేదికగా చేసుకుని సోమవారం చేపట్టనున్న చంద్రబాబు ఒక రోజు దీక్ష హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని మోడీపై నేరుగా యుద్ధానికి దిగిన బాబు ఎపి కి ప్రత్యేక హోదా విభజన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ స్థాయిలో తన పోరాటానికి గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ఏపీ లో ప్రధాని మోడీ గుంటూరు బహిరంగ సభలో పాల్గొని టిడిపి చేస్తున్న ప్రచారం ఖండించేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో అన్ని వర్గాలు ఈ రాజకీయాన్ని ఎంతో ఆసక్తితో ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నాయి. బిజెపి వెర్సెస్ టిడిపి నడుమ సాగే యుద్ధంగా బాబు రాజకీయ వ్యూహం మాత్రం అనుకున్నది అనుకున్నట్లు చేయగలిగారు.

ఫలితం ఉంటుందా ….?

ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకు వచ్చాక కొత్త అవతారం ఎత్తేశారు. ఎపి వెనుకబాటుకు కేంద్రమే కారణం అంటూ పొగిడిన నోటితోనే బూతులు తిట్టడం మొదలు పెట్టేశారు. ఇలా యు టర్న్ తీసుకున్నారేమిటి అని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎవరు ప్రశ్నించినా బిజెపి మోసం చేసిందని ఇప్పుడు ధర్మ పోరాటం అని పిలుపునిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే వున్నా ఎపి లో బిజెపి బలీయమైన శక్తిగా లేదు. అలాంటి పరిస్థితుల్లో శత్రువు లేనప్పుడు మరి ఎవరితో చంద్రబాబు యుద్ధం చేస్తున్నారో విశ్లేషకులకు సైతం అర్ధం కానీ అంశం. గాలి వున్నప్పుడు తప్ప గాలి లేనప్పుడు కమలం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ పోటీదారుగానే లేదు. అలాంటప్పుడు బిజెపి ని ప్రధాన విలన్ చేసి బాబు సాగిస్తున్న పోరాటం ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని ఏ మేరకు పెంచుతుంది అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలో ఎదురౌతుంది.

ప్రధాని ఏం చెప్పనున్నారు …?

గుంటూరు సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెప్పనున్నారు అనేది ఆసక్తి రేకెత్తిస్తుంది. గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుంటూరు సభకు వస్తే ఏ మొహం పెట్టుకుని ఏపీ కి వస్తున్నారంటూ చంద్రబాబు చెలరేగిపోయారు. చచ్చామా..? బతికామా…? చూడటానికి వస్తున్నారా..? అంటూ అగ్గి రాముడే అయ్యారు. కట్ చేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ, జాతీయ రాజకీయాల్లో పాత్ర అంటూ రాహుల్ తో చెట్టాపట్టాల్ వేసుకు తిరుగుతున్నారు. నాలుగున్నరేళ్ళు మోడీతో దోస్తీ కట్టి అసెంబ్లీలో సైతం ప్రపంచంలోనే మోడీ నెంబర్ వన్ అన్న చంద్రబాబు తాజాగా కట్ చేస్తే మోడీ గో బ్యాక్ నినాదంతో కృష్ణా గుంటూరు జిల్లాల్లో పోస్టర్ లు దింపించారు. ఈ నేపథ్యంలో టిడిపి సాగిస్తున్న ఈ ప్రచారం మోడీ తన మాటల గారడితో ఎలా తిప్పికొట్టనున్నారా అన్నది కమలదళమే కాదు అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి.

గతంలో మోడీ…

పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పై చర్చ సందర్భగా మోడీ మాట్లాడిన తీరు టిడిపి అధినేత ఇగోను తీవ్రంగా హర్ట్ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి తో పోలిక తెచ్చి ఏపీ సిఎం ను తీసిపారేశారు ఆయన. అప్పటినుంచి బాబులో పగ మరింత పెరిగినట్లే ఆయన తాజా చర్యలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో గోద్రా అల్లర్ల తరువాత మోడీని హైదరాబాద్ లో ఆయన అడుగు పెట్టనీయకుండా అడ్డుకున్నారు చంద్రబాబు. అప్పటినుంచి లోలోపల ఆ జ్ఞాపకాలు పెట్టుకునే మోడీ బాబును సమయం చూసి దెబ్బ తీయడానికి చూస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇరువురు నేతలకు ఎన్నికలకు ముందు ఢీ అంటే ఢీ అనేందుకు సమయం వచ్చేసింది. దాంతో వీరిద్దరూ అనుసరించే రాజకీయ వ్యూహాలు ఇప్పుడు వేడి పుట్టిస్తున్నాయి. అవి వచ్చే ఎన్నికల్లోగా ఎన్నెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1352 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*