ఏపీలో వాటిపైనే గురిపెట్టారా?

రాష్ట్ర విభజనతో కుదేలైన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించేందుకు ఏపీకి కొత్త ఇన్ ఛార్జిగా నియమించిన మాజీ కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే చాందీ చేస్తున్న కసరత్తు వచ్చే ఎన్నికల్లో వర్క్ అవుట్ అవుతుందా? అంటే చెప్పలేం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జిగా ఉమెన్ చాందీని ఏఐసీసీ నియమించిన సంగతి తెలిసిందే. ఉమెన్ చాందీ విజయవాడకు వచ్చి పార్టీ నేతలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై అథ్యయనం చేసే ప్రయత్నం చేశారు.

డిగ్గీరాజాను తప్పించి……

దిగ్విజయ్ సింగ్ మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జిగా ఉండేవారు. అయితే విభజన సమయంలో దిగ్విజయ్ సింగ్ పోషించిన పాత్రపై ఇప్పటికీ ఆంధ్రప్రజలు మండిపడుతున్నారు. ఇది గమనించిన అధిష్టానం ఆయనను మార్చి ఉమెన్ చాందీని నియమించింది. రాష్ట్ర విభజన చేయడంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీని గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. ఎలా అంటే మామూలుగా కాదు. ఏ అభ్యర్ధికీ డిపాజిట్లు కూడా దక్కనంతగా. ఇక తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో సయితం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టినా ధరావత్తులు దక్కలేదు.

బీజేపీపై ఉన్న వ్యతిరేకత…..

ఈ నేపథ్యంలో బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు తమకు ఉపకరిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఏపీలో ప్రత్యేక హోదా సెంటిమెంట్ బలంగా ఉండటం, బీజేపీ దానిని పక్కన పెట్టేయడం కొంతవరకూ తమకు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. అందుకే ప్రత్యేక హోదా నినాదంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీ సీట్లు పక్కన పెట్టినా పార్లమెంటు సీట్లపైనే ఆ పార్టీ కన్నేసింది. రాహుల్ ఇప్పటికే తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని, ప్లీనరీలో సయితం తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైలుపైనే చేస్తానని ప్రకటించిన విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు.

పార్లమెంటు స్థానాలపైనే…..

ఏపీలోని పార్లమెంటు సీట్లలో తొలుత బోణీ కొడితే తర్వాత అసెంబ్లీ స్థానాలపై దృష్టి పెట్టవచ్చన్నది ఆ పార్టీ నేతల ఆలోచన. రాహుల్ ప్రధానమంత్రి కావాలంటే ఎంపీ అభ్యర్ధులకు ఓట్లు వేయాలన్న నినాదాన్ని బలంగా తీసుకెళ్లనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత ఈజీ కాదు. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే వైసీపీ, టీడీపీలు గోదాలోకి దిగాయి. తమకు ఎక్కువ ఎంపీ స్థానాలను ఇస్తే, కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తామని చెబుతూ వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను ఏపీ ప్రజలు విశ్వసిస్తారా? అనేది చూడాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 29997 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*