సైకిల్ కు రివర్స్ వేవ్…..!!

negetive-wave-telugudesamparty

అదేంటో అధికార టీడీపీకి అన్నీ ఇపుడు అపశకునాలే కనిపిస్తున్నాయి. 2014లో అలా కలసివచ్చిన వాతావరణం ఇపుడు మాత్రం రివర్స్ అవుతోంది. విశాఖ జిల్లా అంటేనే టీడీపీకి పెట్టని కోట. అటువంటి చోట కూడా ఓటమి పలకరించిందంటే దానికి పార్టీ నేతలే ప్రధమ బాధ్యులవుతారన్న మాట గట్టిగా వినిపిస్తోంది. విశాఖ అర్బన్ జిల్లా గాజువాకలో టీడీపీ బలంగా ఉంది. మంచి మెజారిటీతో గత ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు గెలిచారు. ఆయన అప్పటికపుడు పార్టీ మారినా,చివరి నిముషంలో టికెట్ దక్కించుకున్నా కూడా జనం నమ్మి ఓట్లు వేశారు. ఫలితంగా అంతకు కొన్నేళ్ళ నుంచి వైసెపీ తరఫున జనంలో ఉన్న తిప్పల నాగిరెడ్డి ఓటమి చెందారు. అయితే గెలిచిన తరువాతే ఎమ్మెల్యే పల్లా వైఖరి మారింది. దాంతో పార్టీలోనూ కుమ్ములాటలు మొదలయ్యాయి.

టికెట్ కోసం పోరు…

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అందరి కన్నూ గాజువాక మీదనే ఉంది. ఇక్కడ నుంచి పోటీ చేయడానికి మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా రెడీ అవుతున్నారని అంటున్నారు. అందుకే ఆయన తన నిన్నటి అనుచరుడైన పల్లాకు వ్యతిరేకంగా వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా చెబుతున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో కాపులు ఎక్కువగా ఉన్నారు. అలాగే యాదవులు, రెడ్లు, బీసీలు కూడా బాగా ఉన్నారు. అటువంటి సీట్లో పోటీకి దిగితే గెలుపు తధ్యమని గంటా భావిస్తున్నారని అంటున్నారు. ఇక ఆయన తనకు కాకపోతే తన వారికి టికెట్ ఇప్పించుకోవాలానుకుంటున్నారట.

ఆశావహులు చాలా మందే….

ఇక టీడీపీలో చాలాకాలంగా పనిచేస్తూ వస్తున్న నాయకుడు కాకి గోవిందరెడ్డి రెడ్డి కోటాలో టికెట్ అడుగుతున్నారు. తనకు కనుక టికెట్ ఇస్తే వైసీపీ అభ్యర్ధి నాగిరెడ్డి మీద మంచి మెజారిటీతో గెలుస్తానని ఆయన భారీ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఇక మాజీ కార్పోరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ఇపుడు టికెట్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈయన తనకు టికెట్ గ్యారంటీ అంటున్నారు. తాను లోకల్ అని తనకు కాకుండా బయట నుంచి వచ్చిన వారు, ఇతర పార్టీల నుంచి దిగుమతి అయిన వారికి టికెట్ ఇస్తే మాత్రం పార్టీ ఓటమి పాలు అవుతుందని గట్టి హెచ్చరికలే చేస్తున్నారు. ఆయన ఈ మధ్యనే బాబుని కలసి మరీ టికెట్ కోసం అర్జీ పెట్టుకున్నారు.

పల్లా వర్గం పట్టుదల….

తమ నేతకే మళ్లీ టికెట్ ఖాయమని ఎమ్మెల్యే వర్గం గట్టి ధీమాతో ఉంది. అలా కాకుండా ఎవరికి టికెట్ వచ్చిన ఇక్కడ పార్టీ ఓటమి ఖాయమని కూడా శాపాలు పెడుతోంది. మరి ఈ విధంగా పార్టీలో గ్రూపుల వారీగా చీలిపోయి ఎవరి మటుకు వారే టికెట్ కావాలని కుమ్ములాడుకోవడం చూసి జనానికి కూడా రోత పుడుతోంది. మరో వైపు పార్టీ అభిమానులు సైతం ఈసారి టీడీపీ జెండా ఎగరడం కష్టమేనని అంటున్నారు. మరి ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రాజుకుంటున్న చిచ్చుకుని ఆర్పేందుకు అధినాయకత్వం గట్టి ప్రయత్నం చేయకపోతే రేపటి రోజున ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ పరాజయం బాట పట్టక మానదని హితైషులు అంటున్నారు. బలమైన గాజువాకలోనే ఓడిపోతే అది మిగిలిన చోట్ల కూడా ప్రభావం చూపించి అర్బన్ జిల్లాలో కూడా వ్యతిరేక పవనాలు వీస్తాయని హెచ్చరిస్తున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 38942 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*