
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంతో అమితుమీ తేల్చుకునేందుకే సిద్ధమయినట్లు కనపడుతుంది. ఆయన స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో జరపాలని భావిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎన్నికల కమిషన్ అని, దానిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదే పదే ఆరోపిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్. ఇందులో ఎవరికి సందేహం లేదు. ఆయన చంద్రబాబు అపాయింట్ మెంట్ చేస్తే నియమితులైన విషయం మర్చిపోయారు.
ఎవరో అపాయింట్ మెంట్ చేస్తే….
ఆయన ఎవరో అపాయింట్ చేస్తేనే ఎన్నికల కమిషనర్ గా పదవి వచ్చింది. ఆయనకే అంత పట్టుదల ఉంటే…. పదేళ్లు పోరాడి శ్రమించి 151 మందితో అధికారంలోకి వచ్చిన జగన్ ను ఏమనుకోవాలి? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జనం గెలిపించుకున్న నేత జగన్ అని, నీలా అపాయింట్ మెంట్ అయిన వారు కాదని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంత పట్టుదలకు పోవడానికి కూడా వైసీపీ నేతలు అనేక కారణాలు చూపుతున్నారు.
అన్నింటికీ అభ్యంతరాలే….
మార్చిలో పదవీ విరమణ చేసే లోపు ఎన్నికలను నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు. అయితే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ఉందని ప్రభుత్వం చెబుతోంది. అది కుంటిసాకు మాత్రమేనని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాదిస్తున్నారు. వ్యాక్సిన్ రాష్ట్రానికి వచ్చేందుకు మరో ఆరు నెలలు సమయం పడుతుందని ఆయన చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్ని దారులూ వెతుక్కుంటున్నారు.
న్యాయపరంగా…..
ప్రధానంగా హైకోర్టులో ప్రభుత్వంపై థిక్కారణ పిటీషన్ వేశారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయడం లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ పిటీషన్ లో పేర్కొన్నారు. రాజ్యాంగపరమైన విధులను ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటుందని ఆయన చెబుతున్నారు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుదలకు పోయేంత కొద్దీ ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో పంతానికి పోతుంది. దీంతో రెండు వ్యవస్థల మధ్య యుద్ధం జరుగుతుంది. మరి చివరకు ఎవరు విజేత అనేది కాలమే తేల్చాల్సి ఉంటుంది.
Leave a Reply