అది మాత్రం అడగొద్దు….!!

nithishkumar-prasanth-kishore

బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత, ఎన్డీఏలో భాగస్వామి అయిన నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారు. ఒక్క బీహార్ లోనే జనతాదళ్ యు భాగస్వామిగా ఉంటుందని, బయట రాష్ట్రాల్లో ఈ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీతో పొత్తు ఉంటుందని, ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఉండదని నితీష్ చెప్పడం వెనక కారణాలు లేకపోలేదు.

మమత ఇలాకాలో బలపడాలని….

ప్రధానంగా పశ్చిమ బెంగాల్ లో బీజేపీ బలపడాలనుకుంటోంది. అక్కడ మమత బెనర్జీ పై విజయం సాధించేందుకు ఇప్పటికే కమలనాధులు మిషన్ 250 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో 18 లోక్ సభ స్థానాలను సాధించడంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మమతను దెబ్బతీయాలని కమలనాధులు వ్యూహాలు రచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ముఖ్యమైన నేతలను పార్టీలోకి తీసుకురావడం ద్వారా మమతకు చెక్ పెట్టాలని యోచిస్తున్నారు.

పీకేని వ్యూహకర్తగా….

అయితే మమత మాత్రం బీజేపీ రాష్ట్రంలో వేళ్లూనుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారన్న వార్తలు వచ్చాయి. ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థతో మమత ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని చెబుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో మమత ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకోవాలనుకుంటున్నారు.

లైన్ క్లియర్ అయినట్లే….

కానీ ప్రశాంత్ కిషోర్ జనతాదళ్ యు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇటు బీహార్ రాష‌్ట్రంలోనూ ఆయన జేడీయూ, బీజీపీ విజయం కోసం వ్యూహం రచించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన పార్టీకి చెందిన నేత బీజేపీకి ప్రధాన శత్రువుగా ఉన్న మమతకు ఎన్నికల వ్యూహకర్తగా ఎలా వ్యవహరిస్తారని కమలనాధులు ప్రశ్నించే అవకాశముండటంతో ముందు జాగ్రత్తగా నితీష్ ఈ ప్రకటన చేశారని చెబుతున్నారు. ఈ ప్రకటనతో ప్రశాంత్ కిషోర్ మమతకు రాజకీయ సేవలందించేందుకు మార్గం సుగమమయిందంటున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 20506 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*