
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పదవీ గండం నుంచి తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలపై కోర్టు తీర్పు ఎలా వచ్చినా సర్కార్ మనుగడకు ముప్పు తప్పదని గ్రహించిన పళనిస్వామి నష్ట నివారణ చర్యలకు దిగినట్లు సమాచారం. ఇందులో భాగంగా తొలుత తనకు ప్రధాన శత్రువైన దినకరన్ కు దెబ్బేయాలన్నది ఆయన మొదటి ప్లాన్. అన్నాడీఎంకే నుంచి 18 మంది ఎమ్మెల్యేలు దినకరన్ వర్గానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వీరంతా గవర్నర్ కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖలు కూడా రాశారు. దీంతో స్పీకర్ ధన్ పాల్ వీరిపై అనర్హత వేటు వేశారు.
మంతనాలు జరిపేందుకు….
ఈ అనర్హత వేటు విషయం మద్రాస్ హైకోర్టులో ఉంది. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వేర్వేరు తీర్పులు ఇవ్వడంతో మూడో న్యాయమూర్తికి ఈ కేసును అప్పజెప్పారు. కోర్టు తీర్పు వచ్చేందుకు మరికొంత సమయం ఉండటంతో ఈ టైమ్ ను ఉపయోగించుకోవాలని పళనిస్వామి నిర్ణయించుకున్నారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం. వారికి నచ్చజెప్పి తన గూటికే చేర్చకుంటే ప్రభుత్వం పూర్తికాలం కొనసాగుతుంది. అందుకే పళనిస్వామి అనర్హత వేటు పడిన 18 మంది ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపేందుకు సీనియర్ నేతలను రంగంలోకి దించనున్నట్లు సమాచారం.
వారిని చేర్చుకుంటారా?
ఈ 18 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి తిరిగి వస్తే చేర్చుకుంటామని తమిళనాడు మంత్రి జయకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. అమ్మ వల్లనే అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిందని, పూర్తికాలం ప్రభుత్వం కొనసాగకుంటే అమ్మ జయలలిత ఆత్మ క్షోభిస్తుందని కూడా ఆయన సెంటిమెంట్ ను రంగరించారు. దినకరన్ పై కూడా ఈ 18 మంది ఎమ్మెల్యేల్లో కొందరు అసంతృప్తిగా ఉన్నారు. రెండాకుల గుర్తు, పార్టీ తమ చేతికి తెచ్చుకునే ప్రయత్నాలు చేయకుండా, సొంత పార్టీ పెట్టినప్పుడే దినకరన్ ను కొందరు వ్యతిరేకించారు. వారిపై పళనిస్వామి ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
దినకరన్ వర్గంలో చీలిక తెస్తే….
ముందు దినకరన్ వర్గంలో చీలిక తెస్తే దాదాపు విజయవంతమైనట్లేనని పళని భావిస్తున్నారు. ఇందుకు ఆపరేషన్ ను స్టార్ట్ చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ సాయం కూడా ఇందుకోసం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీకి బయలుదేరిన పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు ప్రధాని మోడీని కలవనున్నారు. రాష్ట్ర సమస్యలతో పాటు కోర్టు తీర్పు అంశం….ప్రభుత్వ మనుగడపైన కూడా వారు ప్రధానితో చర్చించే అవకాశముందంటున్నారు. ఆ 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును ఎత్తివేసి, తిరిగి తమ గూటికి రప్పించుకోవాలన్న ప్రయత్నం నెరవెరుతుందో లేదో? చూడాలి.
Leave a Reply