
ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశంలో నల్లమల్ల అటవి ప్రాంతంలో కర్నూలు జిల్లా నంద్యాల, గుంటూరు జిల్లాలకు సరిహద్దుగా విస్తరించి ఉన్న నియోజకవర్గం యర్రగొండపాలెం. 1972లో రద్దు అయ్యి తిరిగి 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఏర్పడిన యర్రగొండపాలెం నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోతూ వస్తోంది. 2009లో జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్, ప్రస్తుత యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించిన డేవిడ్ రాజు ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో సైకిల్ ఎక్కేశారు.
ఎమ్మెల్యే ఘోరంగా విఫలం…..
గత ఎన్నికల్లో డేవిడ్ రాజు తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి బుడాల అజితారావుపై 19వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఘనవిజయం సాధించారు. డేవిడ్ రాజు గతంలో సంతనూతలపాడు నుంచి కూడా టీడీపీ టిక్కెట్‌పై విజయం సాధించారు. ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే యర్రగొండపాలెంలో తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో తెలుగు పోస్ట్ ప్రత్యేక సమీక్షలో చూద్దాం. నియోజకవర్గంలో నాలుగున్నర ఏళ్లలో జరిగిన అభివృద్ధి చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు తనదైన ముద్ర వెయ్యడంలో ఘోరంగా విఫలం అయ్యారనే చెప్పాలి. వైసీపీలో ఉండగా ఆయన్ను అధికారులు పట్టించుకోలేదు, ఇటు టీడీపీ వాళ్లు పట్టించుకోలేదు. పార్టీ మారినా ఇదే జిల్లాల్లో ఇతర నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలతో పోలిస్తే డేవిడ్ రాజు యర్రగొండపాలెంకి నిధులు రాబట్టడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.
సొంత పార్టీ నేతల నుంచి…..
నియోజకవర్గంలో తాగు నీటి సమస్య, అంతర్గత రహదారులు విషయంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. నీయోజకవర్గంలో పార్టీలకు అతీతంగా సామాన్య జనాలకు అవసరమైన ఫెన్షన్లు లాంటివి కూడా సరిగ్గా మంజూరు చెయ్యలేదని నియోజకవర్గ జనాలు డేవిడ్ రాజుపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గంలో సగటు ఓటరును మెప్పించలేని డేవిడ్ రాజు టీడీపీ వీరాభిమానుల్లో సైతం తీవ్రమైన అసంతృప్తి కొనితెచ్చుకున్నారు. సొంత పార్టీ వాళ్లే డేవిడ్ రాజుకు ఇక్కడ సీటు ఇస్తే తాము సహకరించేది లేదని చెబుతున్నారు. చంద్రబాబు చేయించిన పలు సర్వేల్లో సైతం డేవిడ్ రాజుకు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో డేవిడ్ రాజుకు సీటు రాదన్న టాక్ బయటకు వచ్చేసింది.
మాగుంట సిఫార్సు సయితం….
దీంతో ఆయన తాను గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన సంతనూతలపాడు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీకి రెడీ అవుతున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సైతం యర్రగొండపాలెం నుంచి గత ఎన్నికల్లో టీడీపీకి భారీగా మైనెస్ ఓట్లు రావడంతోనే తాను ఓడిపోయానని ఇప్పటికే అక్కడ పరిస్థితులు మార్పు లేదని అక్కడ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని చంద్రబాబుకి ఇప్పటికే సూచించారు. ఈ లెక్కన బట్టీ చూస్తే డేవిడ్ రాజుకు యర్రగొండపాలెం సీటు రాదన్నది దాదాపు ఖరారు అయ్యినట్టే. ఇక విపక్ష వైసీపీ విషయానికి వస్తే సంస్థాగతంగా తిరుగులేని బలంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ప్రకాశం జిల్లాల్లో యర్రగొండపాలెం సీటును వైసీపీ గెలుచుకుంటుందని టీడీపీ వాళ్లు సైతం ముక్తకంఠంతో అంగీకరించే పరిస్థితి ఉంది.
వైసీపీ విజయానికి దగ్గరలో……..
2009లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన ఆదిమూలపు సురేష్ గత ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి ఆయన యర్రగొండపాలెంలో వైసీపీ తరపున పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆదిమూలపు సురేష్ సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఉన్నా యర్రగొండపాలెం వైసీపీ ఇన్చార్జ్గా ఉన్నారు. సురేష్‌కు యర్రగొండపాలెం వైసీపీ సీటు ఖరారు అయ్యింది. ఇక టీడీపీ నుంచి కొత్త అభ్యర్థి రంగంలో ఉండడం ఖాయం కావడంతో ఎవరు పోటీ చేస్తారన్నది మాత్రమే చూడాల్సి ఉంది. ఇక కొత్తగా పోటీకి రెడీ అవుతున్న జనసేన ప్రభావం నియోజకవర్గంలో శూన్యం. యర్రగొండపాలెంలో టీడీపీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్ రాజుపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉండగా ప్రస్తుతం అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ బట్టీ చూస్తే వైసీపీకే ఎడ్జ్ కనపడుతుంది. ఎన్నికల వేళ ఈ పరిణామాలు ఎలా మారతాయో చూడాల్సి ఉంది.
Leave a Reply