ఇక్కడ కొత్తవారికే అవకాశమట…!!!

palasa constiuency new leaders

అన్ని పార్టీలూ దాదాపుగా ఇక్కడ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని ప్రకటించబోతున్నాయి. దీంతో అనేక ఏళ్లుగా ఇక్కడ ఉన్న పాతతరానికి చెక్ పెట్టబోతున్నారు. అదే శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం. ఇక్కడ రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి యువత టిక్కెట్ల కోసం పోటీ పడుతుంది. కొత్త వారికే అన్ని పార్టీలూ దాదాపుగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనున్నాయి. పలాస నియోజకవర్గమంటే జీడిపప్పుకు ప్రసిద్ధి. ఈ నియోజకవర్గంలో గత కొంతకాలంగా గౌతు కుటుంబం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. గత ఎన్నికల్లోనూ పలాస నియోజవర్గం నుంచి గౌతు శ్యాం సుందరశివాజీ దాదాపు పదిహేడు వేల పైచిలుకు మెజారిటీతో ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వజ్జ బాబూరావుపై గెలుపొందారు.

వారసురాలిగా….

అయితే ఈసారి గౌతు శ్యాంసుందర శివాజీ పోటీ చేయడం లేదు. ఆయన మూడేళ్ల ముందే తాను ఈసారి పోటీ చేయబోనని ప్రకటించారు. తన స్థానంలో తన కుమార్తె గౌతు శిరీషను బరిలోకి దింపనున్నారు. అధిష్టానం సయితం శ్యాం సుందర శివాజీ ప్రతిపాదనను అంగీకరించింది. గత కొంతకాలంగా గౌతు శిరీష రాజకీయాల్లో ఉన్నారు. నియోజకవర్గంలో సయితం తండ్రితో కలసి ఆమె పర్యటిస్తున్నారు. గౌతు శిరీష తన తండ్రి చేసిన అభివృద్దే తనను గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రజలే ఈసారి కూడా తనను ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

డాక్టర్ గా సేవలందించి….

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ వైద్యుడైన సిదిరి అప్పలరాజు ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారయినట్లే. వైద్యుడిగా పలాస ప్రజలకు సుపరిచితమైన అప్పలరాజు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు. కొన్నేళ్ల నుంచి వైద్య వృత్తిలో ఉండటంతో ప్రజలకు ఈయన సుపరిచితుడు. దీంతో ఈయన తనను ప్రజలు తప్పకుండా గెలిపిస్తారన్న ఆశాభావంతో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి తనను విజయతీరాలకు చేరుస్తాయని ఆయన గట్టిగా ఉన్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

జనసేన అభ్యర్థి కూడా….

మరోవైపు జనసేన నుంచి కూడా ఇక్కడ అభ్యర్థి దాదాపుగా ఖరారయినట్లే. కాశీబుగ్గ మున్సిపల్ ఛైర్మన్ కోత పూర్ణ చంద్రరావు ఇక్కడ జనసేన బాధ్యులుగా ఉన్నారు. ఈయన టిక్కెట్ కన్ఫర్మ్ కావడంతో ఆయన కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఏడాది నుంచి ఈయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే ఇక్కడి నుంచి మాజీ పార్లమెంటు సభ్యులు కణితి విశ్వనాధం, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారదలు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఎవరికి టిక్కెట్ దక్కినా ఎమ్మెల్యే స్థానానికి కొత్తవారే. దీంతో పలాస నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలిచినా కొత్త వారే అసెంబ్లీలోకి అడుగుపెట్టడం ఖాయమన్నది తేలిపోయింది.

Ravi Batchali
About Ravi Batchali 27858 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*