
పనబాక లక్ష్మి… 2014 ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆమె సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ లోనే ఐదేళ్లపాటు కొనసాగారు. అయితే చివరి నిమిషంలో కండువాను మార్చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి చివరి నిమిషంలో చంద్రబాబునాయుడు ఎంపిక చేశారు. గత ఎన్నికల్లో తిరుపతి స్థానాన్ని మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించారు. అయితే ఈసారి టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగడంతో పనబాక లక్ష్మి రైట్ ఛాయిస్ అని చంద్రబాబు భావించారు. పనబాక లక్ష్మి పోలింగ్ సరళి తర్వాత కొంత ఫ్రస్టేషన్ లో ఉన్నట్లు కన్పిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వర్గాలు తనకు అనుకూలంగా చేయలేదని ఆమె అనుమానిస్తున్నారు.
నియోజకవర్గాలన్నింటిలో వైసీపీ….
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరు పేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పనబాక లక్ష్మి నెల్లూరు వాసి కావడంతో తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరిల్లో తనకు అనుకూలంగా ఉంటుందని ఆమె భావించారు. అయితే నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు తప్ప ఏ నియోజకవర్గంలో పనబాక లక్ష్మికి మెజారిటీ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. గూడూరు తప్ప మిగిలిని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. వైసీపీ తరుపున తిరుపతి ఎంపీగా పోటీ చేసిన మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ సయితం అదే ప్రాంతానికి చెందిన వారు కావడంతో పనబాక లక్ష్మికి ఇబ్బందులు తప్పవంటున్నారు.
ఇక్కడకు వచ్చే మెజారిటీతో…..
సర్వేపల్లి, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో వచ్చే మెజారిటీతోనే తమ గెలుపు సాధ్యమన్నది వైసీపీ నేతల అంచనాగా విన్పిస్తోంది. మాజీ మంత్రిగా బల్లి దుర్గాప్రసాద్ ఈ ప్రాంతానికి సుపరిచితుడు కావడం, నెల్లూరు జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో సూళ్లూరుపేట,సర్వేపల్లి, వెంకటగిరి ల్లో వైసీపీ గెలుపు ఖాయంగా కన్పిస్తుంది. ఒక్క గూడూరు నియోజకవర్గంలోనే గట్టి పోటీ ఉందని చెబుతున్నారు. ఇక ఇదే పార్లమెంటు నియోజకవర్గంపరిధిలో ఉన్న తిరుపతి,కాళహస్తి నియోజకవర్గాల్లో సయితం వైసీపీకే ఎడ్జ్ ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఒక్క సత్యవేడులో మాత్రం టీడీపీకి అవకాశాలున్నాయని చెబుతున్నారు.
సహకరించని తెలుగు తమ్ముళ్లు…..
కేంద్ర మంత్రిగా పనిచేసిన పనబాక లక్ష్మి నెల్లూరు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లోనూ ఆమె బాపట్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా పార్లమెంటులో అడుగుపెట్టాలని పనబాక భావించారు. అయితే గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కారుమంచి జయరాం టీడీపీలో చేరారు. ఆయనతో పాటుగా టీడీపీ నేతలు డాక్టర్ శ్రీహరిరావు, డాక్టర్ సుకుమార్ లు కూడా తిరుపతి ఎంపీ టిక్కెట్ ను ఆశించారు. వీరికి దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరూ సహకరించలేదన్న అసహనంతో పనబాక ఉన్నారట. మరి పనబాక గెలుస్తారా? అంటే డౌటే నంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
Leave a Reply