పన్నీర్ ఆ పదవి కోసం….?

అన్నాడీఎంకేలో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం నేత టీటీవీ దినకరన్ ను కలిసిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించడం సంచలనంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న పళనిస్వామిని దించేందుకు తనతో పన్నీర్ సెల్వం మంతనాలు జరిపారని టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే దినకరన్ వ్యాఖ్యలు అన్నాడీఎంకే నేతలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ దినకరన్ ను కలసినట్లు పన్నీర్ సెల్వం స్వయంగా అంగీకరించడంతో అధికార పార్టీలో కలకలం మొదలయింది.

దినకరన్ ను కలిసింది నిజమే…..

దినకరన్ ను పన్నీర్ సెల్వం అసలు ఎందుకు కలవాల్సి వచ్చింది? గత ఏడాది జులైలో వీరిద్దరూ భేటీ అయ్యారని చెబుతున్నారు. ప్రధానంగా తనను ముఖ్యమంత్రిని తిరిగి చేయాలన్నదే పన్నీర్ ప్రధాన డిమాండ్ అని దినకరన్ చెబుతున్నారు. అయితే దినకరన్ నుతాను కలిసిన మాట వాస్తవమేనని, అయితే దినకరన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారని పన్నీర్ సెల్వం చెబుతున్నారు. దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించడం, ఆ తర్వాత ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతోనే పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశ్యంతోనే దినకరన్ తో భేటీ అయినట్లు చెబుతున్నారు.

దినకరన్ నుంచి హామీ……

తన వెంట ఉన్న ఎమ్మెల్యేలను కూడా పన్నీర్ కు మద్దతు ప్రకటిస్తానని ఈ సమావేశంలో పన్నీర్ సెల్వానికి దినకరన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా దినకరన్ వర్గానికి చెందిన నేతలకు ప్రభుత్వంలో కీలక పదవులు ఇస్తామని కూడా పన్నీర్ సెల్వం హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. డీఎంకేతో కలిసి అవిశ్వాసం పెట్టే ఉద్దేశ్యంలో ఉన్న దినకరన్ ఆలోచనను మార్చి తనకు అనుకూలంగా మలచుకునేందుకే పన్నీర్ సెల్వం యత్నించారని పళనివర్గం అనుమానిస్తుంది. అసలు పన్నీర్ సెల్వం దినకరన్ ను ఎందుకు కలవాల్సి వచ్చిందన్న దానిపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు పళనిస్వామి.

తమ మధ్య చిచ్చుపెట్టడానికే…….

ఇదిలా ఉండగా తాను శశికళ కుటుంబాన్ని తొలినుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నానని, వారితో ఎందుకు చేతులు కలుపుతానని పన్నీర్ సెల్వం వాదిస్తున్నారు. తాను దినకరన్ ను కలసిన మాట వాస్తవమే అయినా అది ప్రభుత్వాన్ని కూలదోయడానికి కాదన్నారు. తమ మధ్య చిచ్చు పెట్టేందుకు దినకరన్ ప్రయత్నిస్తున్నారని పన్నీర్ వర్గం ఆరోపిస్తోంది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు దినకరన్ వైఖరి పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారని, దాన్నుంచి బయటపడేందుకే ఏడాది తర్వాత పన్నీర్ భేటీని బయటకు తీసుకువచ్చారంటున్నారు. మొత్తం మీద ఇది మైండ్ గేమా? నిజంగానే పళని ప్రభుత్వాన్ని పడదోయడానికి పన్నీర్ ప్రయత్నించారా? అన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.

Ravi Batchali
About Ravi Batchali 32507 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*