ఆ మరక జగన్ కు అంటించడానికేనా?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ రాజీనామా అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ రాజీనామా అంశాన్ని, పుర్వాపరాలను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. ఇదంతా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను విలన్ ను చేసేందుకేనా అన్న చర్చ జరుగుతోంది. పరకాల ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్ కేంద్రంలో రక్షణ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే, బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసినా చంద్రబాబు పరకాల ప్రభాకర్ ను పక్కన పెట్టుకున్నారని, భార్య బిజేపీలో భర్త చంద్రబాబు పక్కన ఉన్నారని విమర్శించారు జగన్. అయితే, పరకాలతో పాటు టీటీడీలో సభ్యురాలిగా ఉన్న మహారాష్ట్ర మంత్రి భార్యపైనా, బాలకృష్ణ చిత్ర షూటింగ్ కు వెంకయ్య నాయుడు హాజరవ్వడంపైన కూడా జగన్ అదేరోజు విమర్శలు చేశారు. అయితే, వారెవరూ ఈ విమర్శలకు స్పందించలేదు.

ఆరునెలలుగా ప్రాదాన్యత తగ్గింపు….

వాస్తవానికి బీజేపీతో తెగదెంపులు చేసుకున్న నాటి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరకాల ప్రభాకర్ కి ప్రాధాన్యత తగ్గించారని తెలుస్తోంది. అంతకుముందు పరకాలకు చంద్రబాబు ….ఒకరకంగా మంత్రుల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. విదేశాలకు సయితం వెంట తీసుకుని వెళ్లేవారు. అయితే, బీజేపీతో విడిపోయాక ప్రభాకర్ ను తప్పించాలని చంద్రబాబుతో కొందరు టీడీపీ సీనియర్లు చెప్పారని తెలుస్తోంది. అయితే, నేరుగా పక్కకు పెట్టలేక పొమ్మన లేక పొగిబెట్టినట్లుగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించిందనే చర్చ కూడా జరుగుతోంది. ఇంతకుముందు ఏ సమీక్ష అయినా, మంత్రివర్గ సమావేశమైనా పరకాల ప్రభాకర్ ని చంద్రబాబు నాయుడు పక్కనే పెట్టుకునే వారు. కానీ, గత ఆరునెలలుగా ప్రభాకర్ కి ప్రాధాన్యత తగ్గించారు. అంతేకాదు, కుటుంబరావు, లక్ష్మీనారాయణ వంటి వారికి ప్రాధాన్యత పెంచారు. దీంతో సహజంగానే పరకాల ప్రభాకర్ కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

15 రోజుల ముందే…

పరకాల ప్రభాకర్ కు ప్రాధాన్యత తగ్గించిన ముఖ్యమంత్రి ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో మీడియాకు సంబంధించిన వ్యవహారాలు ఇప్పటి నుంచి మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ చూసుకుంటారని సైతం పరిచయం చేశారు. పరకాల ప్రభాకర్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను కేవలం సాకుగా చూపించారని, ప్రజల్లో జగన్ ని విలన్ చేసేందుకు ఇప్పుడు రాజీనామా చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. రాజీనామా చేస్తూ జగన్ పై విమర్శలు చేయడం కూడా ఇందులో భాగమేనని తెలుస్తోంది. ఇక మరో ముఖ్య విషయం ఏంటంటే పరకాల ప్రభాకర్ పదవీకాలం వచ్చే నెల 4వ తేదీతో ముగుస్తోంది. అంటే 15 రోజుల ముందు ఆయన రాజీనామా చేశారనేది స్పష్టమవుతుంది. ఏదేమైనా చంద్రబాబుకు, పరకాలకు ఇద్దరికీ కావాల్సిన నిర్ణయమే తీసుకున్నా జగన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు కలిసివచ్చాయి. పరకాల నిజంగా రాజీనామా చేయదలుచుకుంటే చంద్రబాబు బీజేపీతో కటీఫ్ చెప్పినప్పుడే చేసి ఉండాల్సిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

అందువల్లనేనా?

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని ఒక సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో ఉంది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించడం, తిరుమల తిరుపతి దేవస్థానంలో రమణదీక్షితులకు ఉద్వాసన పలకడం వంటి విషయాలతో ఆ సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం కొంత పలుచన అయింది. దీనిని వైసీపీ నేత జగన్ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో పరకాల ప్రభాకర్ రాజీనామా వ్యవహారాన్ని ముందుకు తెచ్చారన్న వాదనలూ లేకపోలేదు. అయితే పరకాల రాజీనామాను ఆమోదించేది లేదని, ఒక ముద్దాయి వ్యాఖ్యలను పట్టించుకోబోమని మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలో….!

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*