
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తాను పోటీ చేసే అంశాన్ని ప్రస్తావించారు. ఇంతకు ముందు పవన్ కల్యాణ్ తాను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా శ్రీకాకుళంలో పర్యటించిన పవన్ కల్యాణ్ తాను శ్రీకాకుళం జిల్లా నుంచే పోటీచేసే అవకాశాలు ఉన్నట్లు చెప్పడం విశేషం. అన్నీ కుదిరితే తాను సిక్కోలు జిల్లా నుంచి పోటీ చేస్తానని చెప్పడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పవన్ కు ప్రజలు అఖండ రీతిలో స్వాగతం పలికారు. ఆయన సభలకు జనం పోటెత్తారు. ప్రజాభిమానాన్ని చూసి చలించిపోయిన జనసేనాని ఈ ప్రకటన చేశారనిపిస్తోంది.
ఉత్తరాంధ్ర నుంచి కూడా…..
వెనుకబడిన ప్రాంతాలపైనే తొలి నుంచి పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలపైనే ఆయన ఎక్కువ శ్రద్థ కనబరుస్తున్నారు. అనంతపురం జిల్లాలో పార్టీకి ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. తాజాగా ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేనాని అక్కడి సమస్యలను చూసి చలించిపోయారు. ఉత్తరాంధ్రను పాలకులందరూ విస్మరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆయన ఉద్వేగంగా తాను సిక్కోలు నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు సంకేతాలు పంపారు.
చంద్రబాబుకూ రిటైర్ మెంట్…..
ఇక సిక్కోలు పర్యటనలో జనసేనాని టీడీపీని చెడుగుడు ఆడుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు పదవీ విరమణ ప్రకటించినట్లే, చంద్రబాబుకు కూడా ప్రజలు రిటైర్ మెంట్ ప్రకటిస్తారని పవన్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి, ఎన్టీఆర్ ఫొటో లేకుండా ప్రచారం చేసి గెలవాలని సవాల్ విసిరారు. టీడీపీ పొత్తు లేకుండా ఒంటరిగా ఏ ఎన్నికల్లో ఇప్పటి వరకూ గెలవలేదని గుర్తు చేశారు పవన్.
లోకేష్ పై సెటైర్లు……..
గతంలో మాదిరిగానే చంద్రబాబు పాలన సాగుతుందన్న పవన్, ఇలాగే కొనసాగితే మరోసారి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వస్తాయని హెచ్చరించారు. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం చేస్తున్నారని, సామాన్యులు రాజధాని అమరావతికి వచ్చే అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. ఇక లోకేష్ మీద కూడా సెటైర్లు వేశారు. టీడీపీ నిర్మించిన రహదారులపై తాను కవాతు చేస్తున్నట్లు లోకేష్ ఆరోపిస్తున్నారని, ఆ రోడ్లు ప్రజల సొత్తుతోనే నిర్మించినవని లోకేష్ గుర్తుంచుకోవాలన్నారు. పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పోటీ చేసే అవకాశం కన్పిస్తోంది.
Leave a Reply