ఏంటీ జనం…? ఓటు బాక్స్ బద్దలు కొడతారా?

pawankalyancontested constiuency

పవన్ కల్యాణ్ ను చూసేందుకు జనం విరగబడుతున్నారు. ఆయన బసచేసిన హోటల్ ను సయితం అభిమానులు వదలడం లేదు. అక్కడే ఉండి ఆయన ఎప్పుడు బయటకు వస్తారా? అని గంటల కొద్దీ ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ సభలకయితే మంచి రెస్పాన్స్ లభిస్తుంది. పవన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన విజయవంతంగా ముగియడంతో జనసేన పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. జనసమీకరణ లేదు. సరైన నేతలు నియోజకవర్గాల్లో లేరు. అయినా పవన్ సభలు సక్సెస్ అవ్వడం చూసి ఆ పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.

సిక్కోలులో సూపర్ సక్సెస్…..

శ్రీకాకుళం జిల్లాలో పవన్ పర్యటన ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. పవన్ కేవలం ప్రత్యేక హోదా నినాదం మాత్రమే కాకుండా స్థానిక సమస్యలను తీసుకుని కూడా ముందుకు వెళుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ముందుగా ప్రత్యేక హోదా కావాలని కోరుతూ కవాతు నిర్వహిస్తున్నారు. ఇక ఉద్దానం సమస్యపై ఒక రోజు దీక్ష చేశారు పవన్. ఉత్తరాంధ్ర వెనకబడటానికి కారణం గత పాలకులే అని పవన్ ప్రజలకు గట్టిగా చెప్పగలిగారు.

నేటి నుంచి విజయనగరంలో…..

ఈరోజు నుంచి పవన్ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. బొబ్బిలి నుంచి కురుపాం వరకూ పవన్ యాత్ర కొనసాగుతుంది. పేరుకు బస్సు యాత్ర అయినా పవన్ ప్రతి చోటా ఆగాల్సి వస్తుంది. ఎక్కడికక్కడ అభిమానులు, ప్రజలు పవన్ ను చూసేందుకు పోటీ పడుతుండటంతో ఆయన బస్సు యాత్ర నెమ్మదిగా సాగుతుంది. ఒక్క శ్రీకాకుళం జిల్లా పర్యటనే పది రోజులకు పైగా పట్టింది. పవన్ తొలి దశలో 45 రోజులు పర్యటించాలని పెట్టుకున్నారు. ఈ 45 రోజుల్లో అన్ని నియోజకవర్గాలను బస్సు యాత్ర ద్వారా చుట్టేయాలని భావించారు.

ఓట్లుగా మారతాయా?

కాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నలభై అయిదు రోజుల్లో కేవలం నాలుగైదు జిల్లాలు మాత్రమే పూర్తయ్యేటట్లు కన్పిస్తోంది. జనం విపరీతంగా వస్తుండటంతో అవి ఓట్లగా మారతాయా? లేక సినిమా అభిమానంతో కేవలం పవన్ ను చూసేందుకే వస్తున్నారా? అన్నది ఎన్నికల నాటికి గాని తేలదు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా విపరీతమైన స్పందన కన్పించింది. కానీ ఎన్నికలకు వెళ్లేనాటికి అవి ఓట్లుగా మారలేదు. అయితే పవన్ పార్టీ నేతలు మాత్రం ఈసారి ఆ పరిస్థితి రాదంటున్నారు. పవన్ ప్రసంగాలను చూసి ఆయనపై విశ్వాసం పెరిగిందని చెబుతున్నారు. మొత్తం మీద పవన్ యాత్రలు సూపర్ సక్సెస్ అవుతుండటం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిందనే చెప్పాలి.

Ravi Batchali
About Ravi Batchali 40405 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*