పవన్ పంచ్ అదిరిపోయిందిగా

ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు రచించిన అమరావతి ఎవరిదీ ? పుస్తకాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవిష్కరించి అదిరిపోయే ప్రసంగం చేసి ఆకట్టుకున్నారు. పవన్ ఏమన్నారంటే ఆయన మాటల్లో …

అమరావతి భవిష్యత్తు భయానకం కావొచ్చు…..

ఒక తరం తీసుకునే పాలసీ ఆ తరం వారిపై ప్రభావం చూపకపోవొచ్చు. 1960 ల్లో చేసిన నిర్ణయాలు ఇప్పుడు మనల్ని దెబ్బతినేలా చేశాయి. పాలకులు చేసే తప్పులకు ప్రజలు బాధపడతారు. ఇన్ క్లూజివ్, ఎక్స్ క్లూజివ్ అనే రెండు పదాలే రాష్ట్ర విభజనకు దారితీశాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే జనసేన ఆవిర్భావానికి కారణం. తెలంగాణ ఉద్యమం ఆరంభం లో చిన్నగా మొదలై పెరిగి పెద్దది అయ్యి విభజనకే దారితీసింది. అందరిని అభివృద్ధిలో భాగస్వాములను చేయకపోతే అసమానతలకు దారితీస్తుంది. వాటిని పరిష్కరించకపోవడం వల్ల సమస్యలు పెరిగి పెద్దవి అవుతాయి. పాలకులు చేసిన తప్పులకు ప్రజలు బలి కాకూడదు. కేవలం ధనమే రాజకీయాలను శాసిస్తే వాటి పరిణామాలు ఇప్పుడున్న తరం ఎదుర్కోవాలి. నాగరికత విధ్వంసానికి దారి తీస్తుంది. మనం అనుభవించే ప్రతి సౌఖ్యం వెనుక ఎంతో యుద్ధం సాగుతుంది.

ఆ రైతు మాట నన్నెంతో బాధించింది …

అభివృద్ధికి నేను వ్యతిరేకం కాదు. కానీ దాని పేరుతో చేసే కొన్ని పనులు చేటు తేకూడదు. హైదరాబాద్ లో రింగ్ రోడ్ నిర్మాణం అవుతున్నప్పుడు ఒక రైతు చెప్పిన మాట నన్నెంతో బాధించింది. ఊర్ల కోసం రోడ్లు వేయడం చూశాం. ఇప్పుడు రోడ్ల కోసం గ్రామాలు ఖాళీ చేయించడం చూస్తున్నాం. ఇది ఎంత బాధాకరం. అభివృద్ధి అన్నది ప్రభుత్వాలు బాధ్యతగా చేయాలి. అధికారంలో వున్నవారికి మానవతా దృక్పథం ఉండాలి. అధికారంలో కూర్చుని కూర్చుని అన్ని మర్చిపోతున్నారు. వారి కష్టాల్లోకి తొంగి చూసే ప్రయత్నమే చేయడం లేదు. విజనరీ లీడర్స్ లేకే ఈ బాధలు. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపడినప్పుడు కర్నూలు ను అందుకే ఆనాడు విజనరీ లీడర్స్ నిర్ణయించారు. ముందు చూపు లేక స్వార్ధ చింతనతో ఆలోచిస్తే ఇలాంటివన్నీ వస్తాయి. గత ఎన్నికలు పూర్తి అయ్యాక చంద్రబాబుని రాజధానికోసం అడిగితే ఆయన మంగళగిరి లో వస్తుందని అక్కడ వున్న 15, 18 వందల ఎకరాల అటవీ భూమి డీనోటిఫై చేస్తే చాలు అని చెప్పారు. రైతుల నుంచి తీసుకునే అవసరం లేదని చెప్పారు. అభివృద్ధికి నేను వ్యతిరేకం కానే కాదు.

తెలంగాణ అందుకే విడిపోయింది …

హైదరాబాద్ నేనే నిర్మించా అని చంద్రబాబు చెబుతూ వుంటారు. అది వాస్తవం కాదు. సైబరాబాద్ అనే ప్రాంతాన్ని నిర్మించారు. సైబరాబాద్ ఎవరికి తెలుసు ప్రభుత్వానికే తెలియాలి. సైబరాబాద్ అభివృద్ధిలో తెలంగాణ వాసుల భాగస్వామ్యం లేదు. కేవలం కొద్ది మంది ప్రయివేట్ వ్యక్తులే అందులో భాగస్థులు. ప్రభుత్వం ఏమి చేయబోతుందో కొందరికే తెలుసు. వారు రెండు నుంచి నాలుగు లక్షల రూపాయలకు వేలఎకరాలు చిన్న సన్నకారు తెలంగాణ రైతులనుంచి భూములు కొన్నారు. నాకు తెలిసి అదే అవినీతి. రెండు లక్షల రూపాయలకు కొన్న భూమి కళ్ళముందే కోట్ల రూపాయలు గా మారిపోవడం వారు చూశారు. వారికెలా ఉంటుంది. ఇదంతా ఆంధ్రావాళ్ళు చేశారు అనే ఆగ్రహం వారి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. కానీ అక్కడ లబ్ది పొందింది కొందరే. కానీ ఆంధ్ర వాళ్ళ అందరిమీద ఆ అపవాదు పడింది. దాని ప్రభావం తెలంగాణ సమాజం పై తీవ్రంగా పడి ఆంధ్రులపై కోపం పెరిగేలా చేసింది. రాష్ట్ర విభజనకే దారి తీసింది. ఈసారి ఎవరిని చూపిస్తారు.

అమరావతి కేంద్రం అవుతుందేమో ….

అమరావతిలో అదే జరుగుతుంది. పర్యవసానంగా భవిష్యత్తులో వర్గ కుల పోరాటాలు జరుగుతాయేమో. రైతులు సాగుచేసుకుంటున్న భూములు కి ఇచ్చిన ధరల్లో వ్యత్యాసాలు చూపించారు. అసైన్డ్ భూములకు ఒకలా మరొక వాటికి మరొకలా చేశారు. అదే రైతులకు ఆగ్రహం కలిగించింది. అస్తిత్వం కోసం సాగే పోరాటాలు రాజకీయ అనిశ్చితికి దారి తీస్తాయి. 33 వేలఎకరాల్లో 32 మైళ్ళ వైశాల్యంలో రాజధాని నిర్మాణం రాత్రికి రాత్రి సాధ్యం అయ్యేది కాదు. ఒక రాజు మొదలు పెడితే మనవడి తరం వరకు రాజధానులు నిర్మించిన చరిత్ర చూడండి. రాజధాని అదిగో… ఇదిగో అన్ని అబద్ధాలే. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వారు స్థలం కొనాలంటే ఎక్కడ ఉంది? హైదరాబాద్ విషయంలో చేస్తున్న తప్పే ఇక్కడ చేస్తున్నారు. హైదరాబాద్ లో ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న భవనాలు వున్నది మొత్తం కలిపి 200 ఎకరాలు. ప్రభుత్వానికి చాలా పెద్ద ఆలోచన ఉండొచ్చు. కానీ భూసమీకరణ చట్టాలు ఏమి చెబుతున్నాయి. మూడు పంటల భూములు త్యాగం చేసిన రైతుల ఆవేదన ఒక్కసారి చుడండి. రాజధాని కోసం రైతులు ఇష్టపడితే భూములు తీసుకోండి. లేని పక్షంలో బలవంతంగా అయితే ఒప్పుకోను అని తేల్చి చెప్పాను. కొంత అలా తీసుకోకుండా అడ్డుకోగలిగా. కళింగాంధ్ర, రాయలసీమ ఉద్యమాలు వస్తే విపత్కర పరిస్థితులకు రాష్ట్రం దారి తీస్తుంది. ఇంకా ఇలాంటి పుస్తకాలు చాలామంది రాయాలి. ప్రజలకు నిజాలు తెలియాలిసి వుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ఉత్పన్నం అవుతాయి. అభివృద్ధి కొద్ది మందికి కాదు. నవ్యాంధ్రలో సామాజిక ప్రభావం అంచనాలు తీసుకురాలేదు. హింస ఎవరిని పెట్టకూడదు. బుద్ధుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి అమరావతి. అని పవన్ ఆవేశంగా ప్రసంగించారు.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1723 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*