పవన్ కూడా ప్రశ్నే…?

పవన్

యాక్టింగ్ వేరు. రాజకీయం వేరు. అక్కడ పాత్రను పండించడమే ప్రధాన లక్ష్యం. పాలిటిక్స్ లో ప్రాక్టికాలిటీ ప్రధాన లక్షణం. గతం గత: అనుకుంటూ పాత విషయాలను పక్కన పెట్టి బీజేపీతో చేతులు కలిపిన పవన్ కల్యాణ్ కు ఇంకా ఆచరణాత్మకత వంటబట్టినట్లు లేదు. రెండున్నరేళ్లలో మళ్లీ ఎన్నికలొస్తాయంటూ పవన్ చేసిన ప్రకటన అపరిపక్వ రాజకీయాలకు నిదర్శనంగా చెప్పుకోవాలి. దేశంలో ఉన్న వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా చేసే ప్రకటనలు పరిహాసాస్పదంగా మారతాయి. బీజేపీతో జనసేన చేతులు కలిపినంత మాత్రాన రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోతుందనుకోవడం భ్రమే. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో నైతిక మద్దతు మాత్రం పెరుగుతుంది.

బీజేపీ సిద్దమవుతుందా..?

పవన్ చేరికతో జనసేనకు సమకూరే లబ్ధి కంటే బీజేపీకే ఎక్కువ ప్రయోజనం. ఆ పార్టీ విస్తరణకు, జనాకర్షణకు పెద్ద అండ దొరికింది. జనసేన ఆశిస్తున్న ప్రయోజనాలు సమకూర్చి పెట్టేందుకు బీజేపీకి, కేంద్రానికి కొన్ని సాంకేతిక అవరోధాలున్నాయి. పైపెచ్చు బీజేపీకి జాతీయంగా కొన్ని రాజకీయ అవసరాలు పెరుగుతున్నాయి. తాము కోల్పోయిన రాష్ట్రాలను కాంగ్రెసు, సంకీర్ణ కూటముల నుంచి తిరిగి తెచ్చుకోవడంపైన దృష్టి పెట్టాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ స్థితిలో సానుకూలంగా ఉండే పార్టీలను దూరం చేసుకోవడం రాజకీయంగా ఆత్మహత్యా సదృశమవుతుంది. ఈ బ్యాలెన్సును పాటించడం బీజేపీ అగ్రనాయకులకు పక్కాగా తెలుసు. అంతంత మాత్రంగా తమకు అవకాశాలున్న ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ చాలెంజ్ కు బీజేపీ సిద్ధపడుతుందా? అంటే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.

అందరికీ చెక్…

జనసేనకు సంబంధించి ప్రధాన ప్రత్యర్థి జగన్ మోహన్ రెడ్డి కావచ్చు. కానీ బీజేపీ విషయానికొచ్చేసరికి వైసీపీ సానుకూల ప్రత్యర్థి. సందర్భాన్ని బట్టి కేంద్రంలో సహకరించే మిత్రుడు. అందులోనూ రానున్న నాలుగేళ్ల కాలంలో వైసీపీ రాజ్యసభలో తన బలాన్ని పది వరకూ పెంచుకుంటుంది. ఇది కేంద్రానికి చాలా అవసరం. ఏపీ నుంచి మరే ఇతర పార్టీ తరఫున వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ ఒక్క సభ్యుడు కూడా రాజ్యసభకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రజాస్వామ్యంలో నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తి అంకెలకే ఉంటుంది. ఒక ప్రాంతీయ పార్టీగా జనసేన, వైసీపీని ప్రధాన ప్రత్యర్థిగా చూస్తుంది. తెలుగుదేశం పార్టీ బలహీన పడితే ఆ స్థానాన్ని బీజేపీ సహకారంతో చేజిక్కించుకోవాలని పవన్ చూస్తున్నారు. కానీ బీజేపీ విషయానికొచ్చేసరికి టీడీపీ, వైసీపీలు రెండూ సమానమే. పార్లమెంటు లో సంఖ్యాపరంగా తమకు ఎవరి మద్దతు ఎక్కువగా అవసరమవుతుందో వారితో సఖ్యతగా మెలిగేందుకే బీజేపీ సిద్ధమవుతుంది. అయితే సిద్దాంతపరంగా వైసీపీతో విభేదించి రాష్ట్రంలో తమ బలాన్ని పెంచుకొనే వ్యూహంలో భాగంగానే జనసేనతో చేతులు కలిపింది. అటు టీడీపీకి, ఇటు వైసీపీకి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చూడాలి. అంతే తప్ప రాష్ట్రంలోని అధికారపార్టీతో ముఖాముఖి తలపడి ముందరికాళ్లకు బంధం వేసుకొనే దుస్సాహసానికి బీజేపీ దిగుతుందనుకోలేం.

అవసరాలున్నాయి…

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు మొదలు రాజ్యసభలో బిల్లుల ఆమోదం వరకూ వైసీపీ వంటి బలమైన ప్రాంతీయ పార్టీల సహకారం బీజేపీకి అవసరం. అటు తమిళనాడులో మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే బలం తగ్గిపోనుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి చోట్ల నుంచి తమ పార్టీ తరఫున పెద్దల సభలో ప్రాతినిధ్యం కుదించుకుపోతోంది. ఇటువంటి క్లిష్టమైన స్థితిలో బీజేపీ రాష్ట్రాల విషయాల్లో తలదూర్చి తమకు స్టేక్స్ లేని చోట్ల కొరివితో తలగోక్కునే పనికి తలపడదనేది మెజార్టీ భావన. అందుకే కేంద్రంలో అగ్రనాయకులైన మోడీ, అమిత్ షా ల నుంచి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వ్యవహారాలపై స్పందన వ్యక్తం కావడం లేదు. బీజేపీ రాష్ట్రశాఖ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం బాట పడతామంటూ చెబుతోంది. తద్వారా వైసీపీపై కచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. రాష్ట్రసర్కారును ఇరకాటంలో పెట్టడం ద్వారా ఎన్ పీ ఆర్ , ఎన్ ఆర్ సీ వంటి వాటికి సానుకూలత సాధించేందుకు కేంద్రం వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అతిగా నమ్మితే…

ఒకరకంగా జనసేనతో చేతులు కలపడం బీజేపీ కి వరంగా చెప్పాలి. అధికార, ప్రతిపక్షాలపై ఒత్తిడి పెంచి వాటిని పరోక్షంగా నియంత్రించేందుకు, అదుపులో పెట్టేందుకు పవన్ ప్రజాదరణ కలిసి వస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. లాభనష్టాల సంగతి ఎలా ఉన్నప్పటికీ రాజకీయంగా జనసేన పోరాటానికి బీజేపీ సహకరిస్తుంది. అదే సమయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సంబంధాలు, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వైసీపీ సర్కారుకు, ఎన్డీఏ సర్కారు సహకరిస్తుంది. ఇది ద్వంద్వ వైఖరి అన్న విమర్శలు వచ్చినప్పటికీ చట్టం, కేంద్రరాష్ట్ర పరిధులు అన్న సాకుతో అంతిమంగా పరస్పర సహకారమే ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల పవన్ వంటి నాయకులు జాతీయపార్టీగా బీజేపీని విశ్వసించడం లో తప్పులేదు. కానీ ఆ పార్టీ సారథ్యం వహిస్తున్న కేంద్రంపై అతిగా ఆధారపడితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. రాజకీయావసరాలు, అంకెలే ప్రజాస్వామ్య నిర్ణయాలను నిర్దేశిస్తాయి. అందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా వ్యవహరించినప్పుడే రాజకీయంగా రాటుదేలతారు. వైఎస్సార్ ప్రభుత్వంపై కమలంతో కలిసి పోరాటం చేయాలనేది పవన్ కల్యాణ్ యోచన. నిజానికి రాష్ట్రప్రభుత్వమే ఈ విషయంలో పవన్ ను ఎగదోసిందని చెప్పాలి. చాలాకాలం క్రితమే ప్రత్యేక హోదా విషయంలో తొలిసారిగా గళమెత్తి బీజేపీకి దూరమయ్యారు జనసేనాని. అప్పటికి టీడీపీ, బీజేపీలు కలిసే కాపురం చేస్తున్నాయి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్నాయి. ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే టీడీపీ, బీజేపీ దూరమయ్యాయి.

రెచ్చగొట్టిన సర్కారు….

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ పోతే సరిపోయేది. కానీ జనసేనపైనా వైసీపీ గురి పెట్టింది. పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వైసీపీ విరుచుకుపడింది. దీంతో బీజేపీతో చేతులు కలపకపోతే ముందుకు సాగడం కష్టమని జనసేన గుర్తించింది. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతో రాజీపడి చేతులు కలిపింది. వైసీపీ సర్కారు నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆందోళనలు చేయడం ప్రతిపక్షంగా సమంజసం. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అంతే తప్ప రెండున్నరేళ్ళలో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం వంటి ప్రకటనలు అత్యుత్సాహంతో కూడినవే.

తాత్కాలిక ఆవేశమే…

ప్రభుత్వాన్ని అధికారంలో కి తేవాలన్నా, దింపేయాలన్నా నిర్ణయించాల్సింది ప్రజలు. ఈమధ్య కాలంలోనే వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చింది. స్థానిక ఎన్నికల వంటివి ప్రతిపక్షాలకు తమ సత్తా చాటుకునేందుకు ఎంతో కొంత ఉపకరిస్తాయి. ప్రజాక్షేత్రంలో బలపడేందుకు దోహదం చేస్తాయి. అటువంటి అవకాశాలను ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మలచాలి. ఇందుకు నిరంతరం ప్రజల్లో పనిచేసే క్యాడర్ కావాలి. తమ హీరోని చూసేందుకు ఎగబడి వచ్చే అభిమానులతోనే సరిపోదు. ఆ అభిమానులు సుశిక్షిత కార్యకర్తలుగా మారి పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే పార్టీ నిలబడుతుంది. ఆ దిశలో పార్టీని సమాయత్తం చేసుకునేందుకు తగినంత వ్యవధి పవన్ కు లభిస్తోంది. ఒక పార్టీగా ఎలా బలపడాలో బీజేపీని అనుసరించడం ద్వారా తెలుసుకోవచ్చు. చాలెంజ్ లు, పవర్ పుల్ డైలాగులు తాత్కాలిక ఆవేశాన్ని చల్లార్చుకోవడానికే తప్ప రాజకీయ కార్యాచరణకు ఉపయోగపడవు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 29065 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*