
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వన్య మ్యాన్ షో నిర్వహిస్తున్నారు. ఆయనను ఎవరు విమర్శించినా తిప్పికొట్టడానికి ఎవరూ లేరు. అధికార ప్రతినిధులుగాని, పార్టీ నేతలు ఎవరైనా సరే మైకు ముందు నోరు విప్పాలంటే పవన్ పర్మిషన్ కావాల్సిందే. అందుకే పవన్ పై విమర్శలకు స్వయంగా ఆయనే సమాధానం చెప్పుకోవల్సి వస్తుంది. అదీ ట్విట్టర్ ద్వారానో్, ప్రెస్ నోట్ ద్వారానో ప్రతి విమర్శలకు దిగాల్సి వస్తుంది. పార్టీలో ఇప్పటి వరకూ అగ్రనేతలు ఎవరూ లేరు. పవన్ ఒక్కరే అన్నీ తానై నడిపించుకుంటూ వస్తున్నారు. అయితే నాదెండ్ల మనోహర్ వంటి సీనియర్ నేత పార్టీలో చేరడం కొంత బలం చేకూరినట్లయింది.
కవాతుకు స్పందన రావడంతో…..
రెండు రోజుల క్రితం ధవళేశ్వరం వంతెనపైన నిర్వహించిన కవాతుకు ఊహించని స్పందన రావడంతో పవన్ వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని నిశ్చయించారు. విజయవాడలో అందుబాటులో ఉన్న కీలకనేతలతో సమావేశమయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇక గేట్లు తెరిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇతర పార్టీల నుంచి నేతలను పార్టీలోకి జోరుగా తీసుకురావాలని ముఖ్యనేతలను ఆదేశించినట్లు సమాచారం. పవన్ మొదటి నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఉత్తరాంధ్ర జిల్లలో పవన్ పోరాట యాత్ర పూర్తయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో నెలరోజులు తిరిగారు. త్వరలో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా చేరికలను ఉధృతం చేయాలని పవన్ భావిస్తున్నారు.
టీడీపీ, వైసీపీల వైపే…..
ముఖ్యంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చేస్తామని రాయబారాలు నడుపుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎన్నికల సమయానికి వచ్చేస్తామని సందేశం పంపగా, అలా కుదరదని పవన్ తెగేసి చెప్పినట్లు తెలిసింది. పార్టీలో చేరాలనుకున్న వారికి డిసెంబర్ వరకే అవకాశమని, ఆ తర్వాత వచ్చినా ప్రయోజనం ఉండదని నిక్కచ్చిగా పవన్ చెప్పారని సమాచారం. తమకు సీటు దక్కే ఛాన్స్ లేదని భావిస్తున్న ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు పవన్ తో ఇప్పటికే మంతనాలు జరిపారు. వీరంతా పవన్ సామాజికవర్గానికి చెందిన వారేనంటున్నారు.
పాత తరం నేతలను……
ఇక వైసీపీ నుంచి కూడా కొందరు జనసేన వైపు చూస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళతారని భావించిన చలమలశెట్టి సునీల్ పవన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ముగ్గురు నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జులు జనసేనలో చేరారు. వీరితో పాటు హర్షకుమార్, కొణతాల రామకృష్ణ, వట్టి వసంత కుమార్, దాడి వీరభద్రరావులను కూడా త్వరలోనే పార్టీలోకి చేర్చుకోవాలని పవన్ యోచిస్తున్నారు. వీరంతా చేరితే పార్టీకి బలం చేకూరడంతో పాటు గట్టి వాయిస్ కూడా దక్కుతుంది. కొత్త తరం కంటే పాత ప్రజారాజ్యం పార్టీ నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకే పవన్ మొగ్గు చూపుతున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ ఇటు టీడీపీ, అటు వైసీపీలో ఉన్న అసంతృప్త నేతలకు త్వరలోనే కండువా కప్పేందుకు సిద్ధమయ్యారు.
Leave a Reply