తానే మారెనా..? గుణమే మారెనా..?

pawan-kalyan-janasena-party

మార్పు తెస్తానంటూ పాలిటిక్స్ లో ప్రవేశించిన పవన్ కల్యాణ్ కు తత్వం బోధ పడింది. చేదు వాస్తవాలు ఒక్కటొక్కటిగా వంటపడుతున్నాయి. రాజకీయమంటే ఎత్తు పైఎత్తుల చదరంగం. చినచేపను పెద చేప మింగేసే కపటనాటక విన్యాసం. ‘ఓట్లు అమ్ముకోవద్దు. ఓట్లు కొనుక్కోవద్దు’వంటి సూక్తులు ఎవరి చెవికీ ఎక్కవు. ఎవరూ పట్టించుకోరు. ఖర్చు పెట్టగల సామర్ధ్యం ఉన్న కొందరు నేతలు సైతం జనసేనలో చేతులు కట్టేసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఘోరపరాజయం ఎదురైంది. దీనిని తిప్పికొడతానంటూ పవన్ తాజాగా చెబుతున్నారు. తన ఓటమికి 150 కోట్లు ఖర్చు పెట్టారంటూ సంచలన ఆరోపణ చేస్తున్నారు. ఆధారాలు చూపకపోయినప్పటికీ అసలు విషయం ఆయన గ్రహించినట్లున్నారు. అంతగా డబ్బులు రాజ్యం చేస్తుంటే ప్రజాస్వామ్యంలో పైసలు లేకుండా పదవులు దక్కుతాయా? తన రాజకీయాల సత్తా ప్రత్యర్థులకు రుచి చూపిస్తానంటున్న పవన్ కల్యాణ్ తన పంథా మార్చుకుంటారా? లేక తన దారిలోకే ప్రత్యర్థులను తేగలనన్న నమ్మకం ఆయనకు కుదిరిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్యాడర్ లో నైతిక స్థైర్యం నింపడానికే ఈ వ్యాఖ్యలు చేశారనే వారికీ కొదవ లేదు. ఏదేమైనప్పటికీ పవన్ మార్కు మార్పు కోణంలో మార్పు వస్తోందా?అన్న చర్చ మొదలైంది.

ఆశయం..ఆచరణ వేర్వేరు…

జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ రంగంలోకి దిగిన జనసేన ఆశించిన స్థాయి విజయాలు సాధించలేకపోయింది. అయితే ప్రధానపార్టీలతో పోలిస్తే నిధులను విచ్చలవిడిగా వినియోగించలేదన్న మంచి పేరు మాత్రం తెచ్చుకుంది. కానీ రాజకీయాల్లో మంచి తనం కంటే విజయం ముఖ్యం. పార్టీ వైఫల్యాలకు కారణాలను అన్వేషించే క్రమంలో భాగంగా అంతర్గత సమీక్షలు ప్రారంభించారు పవన్ కల్యాణ్. ఇంతవరకూ తన ఆశయాలను మాత్రమే చూశారని, ఇకపై తన రాజకీయాలు చూస్తారంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. మార్పు కోసం రంగప్రవేశం చేశానన్న సంప్రదాయ రాజకీయాల వైపు మళ్లుతారా? పొలిటికల్ వ్యూహాలు, ఎత్తుగడల గురించి మాట్లాడటం వెనక ఉద్దేశాలేమిటి? మనీ మేక్స్ ఎవిరీ థింగ్ అన్నట్లుగా మారిన నేటి పాలిటిక్స్ లో జనసేన పునరుత్థానం పొందగలుగుతుందా? అంటే సమాధానం దొరకడం కష్టమే. ఆశయం వేరు. ఆచరణ వేరు. క్లీన్ పాలిటిక్స్ అంటూ సిద్ధాంతాలు వల్లె వేసినంత మాత్రాన రాజకీయాలు పరిశుద్ధం కావు. దీనిని గ్రహించిన పవన్ కల్యాణ్ తాను సైతం స్థానిక రాజకీయాలకు అవసరమైన వ్యూహాలను అనుసరిస్తానని ప్రకటించారు. అంటే ప్రత్యర్థుల ఎత్తుగడలను పరిశీలించి ప్రతివ్యూహాలతో ముందుకు వెళతామనేది ఆయన సమీక్షల సారాంశంగా చెప్పుకోవాలి.

రాజకీయ భాష…

శాసనసభ ఎన్నికల్లో 6.7 శాతం ఓటు షేరుకే పరిమితమై జనసేన చతికిలపడింది. ఒక్క స్థానం గెలుపుతో శాసనసభలో కనీస ప్రాతినిధ్యం మాత్రమే దక్కింది. పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమితో మొత్తం పార్టీ నిర్వీర్యమైపోయింది. నిరంతరం ప్రజల్లో ఉండకుండా అప్పుడప్పుడూ మాత్రమే కనిపించే నేతగా ముద్ర పడటమూ, పార్టీ గెలుపు సాధిస్తుందనే నమ్మకం లేకపోవడమూ, తెలుగుదేశంతో అంతర్గత అవగాహన ఉందనే అనుమానం వెరసి జనసేన వైఫల్యానికి దారితీశాయనేది ఒక విశ్లేషణ. అయినప్పటికీ 30 స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకోగలిగింది. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ ఓట్లు కొనవద్దని పవన్ నాయకులకు స్పష్టంగా చెప్పారు. దీంతో ఎంతోకొంత ఖర్చు పెడితే నెగ్గే అవకాశమున్న స్థానాల్లో కూడా చేజేతులారా ఓటమి కొని తెచ్చుకోవాల్సి వచ్చిందని క్యాడర్ వాపోతోంది. అంతర్గత సమీక్షల్లో పూర్తి రాజకీయ భాషను పవన్ వినియోగిస్తూ ఉండటం కొత్త ఆశలు గురింపచేస్తోందంటున్నారు. రాజకీయాల్లో విజయం సాధించాలంటే ఎత్తుగడలు, వ్యూహాలు అనేవి చాలా ముఖ్యం. ఇకపై ప్రతినియోజకవర్గం గెలుపు విషయంలోనూ ముందస్తు వ్యూహంతో పార్టీ నిర్మాణం చేసుకుని ముందుకు కదులుతామంటున్నారు. అంతేకాకుండా తమను ప్రధాన పక్షాలు ఏవిధంగాదెబ్బ తీశాయో గమనించి అదే విధంగా ఆయా పార్టీలను పరాజయం పాలుచేయాలని, అందుకు సిద్ధం కావాలని నియోజకవర్గ నాయకులకు సూచిస్తున్నారు. ఇది కీలకమైన నిర్ణయమే. సామాజిక, ఆర్థిక బలాలతో పటిష్ఠంగా ఉన్నపార్టీలను దెబ్బకు దెబ్బ తీస్తాను అంటున్నారు పవన్ కల్యాణ్..

మూడో పక్షానికి అవకాశమెంత?…

రెండు బలమైన పార్టీలు ముఖాముఖి తలపడుతున్నప్పుడు మూడోపార్టీ హఠాత్తుగా రంగంలోకి వచ్చి వాటిని తోసిరాజని అధికారం సాధించడం అంత సులభం కాదు. 2009లో ప్రజారాజ్యం దెబ్బతిన్నది ఆ పాయింట్ పైనే. ఇప్పుడు జనసేన అసలు పోటీలోనే లేదన్నట్లుగా ఘోరంగా దెబ్బతినడంలోనూ అదే సిద్ధాంతం వర్తిస్తుంది. ఏదో ఒక పార్టీ బలహీనపడితే ఆ స్థానాన్ని మరో పక్షం ఆక్రమించగలుగుతుంది. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీలు ముఖాముఖిగా తలపడినప్పుడు జాతీయ పార్టీలైన కాంగ్రెసు, బీజేపీలు బలహీనపడ్డాయి. బీజేపీ పుంజుకున్న తర్వాత కాంగ్రెసుతోపాటు బీఎస్పీ, ఎస్పీలు బలహీనపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో మూడో పార్టీగా ఉన్న జనసేన బలపడాలంటే ప్రస్తుతం అధికారపార్టీకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న టీడీపీ బాగా బలహీనపడాల్సి ఉంటుంది.

టీడీపీ బలహీన పడితేనే….

సామాజికంగా వివిధ వర్గాల మద్దతు టీడీపీకి క్రమేపీ క్షీణిస్తోందని జనసేన అంచనా వేసుకుంటోంది. ఆ పార్టీ స్థానాన్ని ఆక్రమించాలనేది జనసేన యోచన. అయితే అదంత సులభం కాదు. పార్టీ నాయకత్వం గ్రౌండ్ లెవెల్ లో చొచ్చుకుపోయినప్పుడు మాత్రమే నిర్మాణాత్మకంగా పటిష్ఠమైన స్థానానికి చేరుకోగలుగుతుంది. జనసేన ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే మంచి ఓటు షేర్ తెచ్చుకోగలిగింది. ఉత్తరాంధ్రలోనూ ఫర్వాలేదనిపించింది. రాయలసీమ జిల్లాల్లో నోటాతో పోటీ పడింది. విశాఖ, విజయవాడ, గుంటూరు అర్బన్ ప్రాంతాల్లో ఓ మోస్తరు ఓటు షేరుతో ఉనికిని నిరూపించుకుంది. ప్రాంతాల వారీ అధ్యయనం చేసి, ఓటమికి కారణాలను అన్వేషించాలి. అప్పుడే ప్రధాన పార్టీలకు సవాల్ విసరగలుగుతుంది. వచ్చే ఎన్నికల నాటికి మిగిలిన కాలాన్నంతటినీ పార్టీ నిర్మాణానికి వెచ్చించాలి. అప్పుడే జనసేన ప్రస్థానంలో గుణాత్మక మార్పు కనిపిస్తుంది. సమాజాన్ని మార్చడానికి ముందుగా పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టాలి. ఏక వ్యక్తి కేంద్రంగా పార్టీ తిరగకుండా ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని తయారుచేసుకోవాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 16593 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*