ఎంతో ఆరాటం.. అంతే అయోమయం..?

పవన్ కల్యాణ్

సమాజం పట్ల అతను వ్యక్తం చేసే ఆవేదన సినిమాటిక్ గా అనిపిస్తుంది. కానీ లోతుల్లోకి తొంగి చూస్తే ఏదో చేయాలనే తపన కనిపిస్తుంది. ఆలోచన, ఆవేశం ఉంటే సరిపోదు. అందుకు సరైన మార్గం ఏమిటి? లక్ష్య సాధనకు సమకూర్చుకోవాల్సిన ఆయుధాలేమిటి? అనుసరించాల్సిన విధి విధానాలేమిటన్నది ముఖ్యం. అక్కడే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు క్లారిటీ లోపించింది. సాధారణంగా సినిమా తారలు ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. ప్రజలు తామేం చెబితే అదే వింటారనే భావనలో, భ్రమలో బతికేస్తూ ఉంటారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి, చంద్రబాబు నాయుడి వంటి హేమాహేమీలు రంగంలో ఉన్న దశలో పాలిటిక్స్ లో కి ఎంట్రన్స్ ఇచ్చి బొప్పి కట్టించుకుని ఎగ్జిట్ అయిపోయారు మెగాస్టార్. తనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ఊహించుకుని రాజకీయాల్లోకి దిగడమే ఆయన చేసిన పొరపాటు. సుదీర్ఘకాలం పోరాటానికి సిద్ధమై ఉంటే మరో ఎన్నికల నాటికే ఫలితం వచ్చి ఉండేది. ఇప్పుడు అతని సోదరుడు పవన్ కల్యాణ్ సైతం స్ట్రగుల్ అవుతున్నారు. వెనక్కి పోనని ఇప్పటికే తన అభిమానులకు , ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ గమ్యం ఏమిటనే ప్రశ్నకు, మార్పు ఏనాటికనే సందేహానికి సమాధానం దొరకడం లేదు.

పాలిటిక్స్.. డిఫరెంట్ పిక్చర్…

సినిమాలతో పోలిస్తే రాజకీయం వైవిధ్య భరితమైనది. ప్లాఫ్, హిట్ ఒక్కరోజులో తేలిపోయే వ్యవహారం కాదు. అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. పాత తరాల్లో స్వచ్ఛమైన రాజకీయాలు ఉండేవని చెబుతుంటారు. మేదావి, రాజ్యాంగ రూపకర్త అయిన అంబేద్కర్ ను ఆనాటి తరాలే ఓడించేశాయి. అందువల్ల రాజకీయ గణాంకాలు వేరు. సామ్యవాద సిద్ధాంతాలు ప్రబోధించడం ద్వారానూ, నీతులు చెప్పడం ద్వారానూ పాలిటిక్స్ ను మలుపు తిప్పే అవకాశాలు లేవు. అవి కేవలం ప్రజలకు , మీడియాకు తాము మంచి వాళ్లమని చెప్పుకోవడానికే ఉపయోగపడతాయి. మిగిలిన సినీ హీరోలతో పోలిస్తే పవన్ కల్యాణ్ వైవిధ్యభరితమైన వ్యక్తిత్వం కలిగిన వారనడంలో ఎటువంటి సందేహం లేదు. తనకున్న క్రేజ్ దృష్ట్యా వాణిజ్య ప్రకటనల్లో నటించి వందల కోట్ల రూపాయలు ఆర్జించే అవకాశం అతనికి ఉంది. సినిమాల కంటే అదే ఎక్కువ ఆదాయం. సినీ రంగానికి చెందిన ఇతర వాణిజ్యాల్లోనూ ప్రవేశించవచ్చు. కానీ వాటిని వదులుకుని రాజకీయాలను తన ప్రవృత్తిగా మార్చుకొన్నారు. పాప్యులారిటీ ఉన్న నాయకుడు ప్రశ్నిస్తే అధికారంలో ఉన్న నేతలు ఉలికిపడతారు. పవన్ కల్యాణ్ అందుకు చెక్ పాయింట్ గా ఉపయోగపడతారు. నిజానికి రాజకీయాల్లో ఉన్నవాళ్లందరూ విలన్లు కాదు. చాలావరకూ ఆర్థికంగా సెటిల్ అయిన వారే. కేవలం సంపాదించుకోవడానికే రారు. సమాజంలో హోదా, అధికారం కోసం ఎక్కువ మంది పాలిటిక్స్ ను ఎంచుకుంటారు. పవన్ కల్యాణ్ వంటి వారు ఇందుకు మరొక కోణం. సమాజంలో ఇప్పటికే కావాల్సినంత గుర్తింపు ఉంది. ఇంకేదో తనవంతు చేయాలనే తపనతోనే ఆయన వచ్చారనుకోవచ్చు. కానీ ఈవిషయంలో సఫలీక్రుతం కావాలంటే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ప్రతి ఎత్తుగడలోనూ స్పష్టత ఉండాలి.

ప్రజలు మారుతున్నారు..

సమాజంలో ప్రజలు గతంలో తరహాలో ఆలోచించడం లేదు. ఏ పార్టీ అయినా ఒకటే అనే అవగాహనతో ఉన్నారు. ఓట్లకు నోట్లు మొదలు, స్కీముల వరకూ తమకు ఏమి దక్కుతుందనే ఆలోచన చేస్తున్నారు. దీర్ఘకాలిక అంశాలపై దృష్టి పెట్టడం లేదు. కులం, మతం ప్రధాన అంశాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వంటి సెమీ పాలిటిషియన్స్ కు ఓటింగు పెరగదు. సీజన్ డ్ రాజకీయాల్లో ఉంటూ సీరియస్ గా ప్రయత్నం చేయగలిగితేనే రాణింపు సాధ్యమవుతుంది. ఆశయానికి, వాస్తవానికి మధ్య చాలా అగాధం ఉంటుంది. పార్టీని నడపడం చాలా పెద్ద వ్యయంతో కూడిన అంశం. దీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీలు సైతం ఒకటిరెండు సార్లు పవర్ లోకి రాకపోతే పైసల కోసం అల్లాడిపోతుంటాయి. దేశాన్ని ఇంతకాలం పాలించిన కాంగ్రెసు పార్టీ ఏడేళ్ల కాలంలోనే నిధుల లేమిని ఎదుర్కొంటోంది. బీజేపీతో పోల్చుకుంటే విరాళాలు నాలుగోవంతుకు పడిపోయాయి. అటువంటిది పవన్ కల్యాణ్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళతారంటే జనసేన ద్వితీయశ్రేణి నాయకత్వం వద్ద సమాధానం దొరకడం లేదు. పార్టీకి ఒక వ్యవస్థాగతమైన రూపం, కార్యశ్రేణులు, క్షేత్రస్థాయి సమన్వయం ఏర్పాటు కావాలి. ప్రజలతో అనుసందానమవ్వాలి. అది జరగకుండా పార్టీ దీర్ఘకాలం మనుగడ సాగించలేదు. తన సొంత నిధులతో పార్టీని పోషిస్తానని పవన్ భావిస్తే అది అమాయకత్వమే అవుతుంది.

కమలంతో కాపురం…

సైద్దాంతికంగా పవన్ కల్యాణ్ వామపక్ష భావాలను నిరంతరం ప్రకటిస్తూ ఉంటారు. 2014లో దేశంలో మార్పు కోసం అంటూ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ వచ్చినప్పుడు బాగా కనెక్టు అయినవారిలో పవన్ కూడా ఒకరు. కానీ సైద్దాంతికంగా వారి అజెండాతో ఏకీభవించలేకపోయారు. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం వైఖరి నచ్చలేదు. విభేదించి బయటకు వచ్చేశారు. తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగని చంద్రబాబు నాయుడితో కలిసి రాజకీయ ప్రస్థానం కొనసాగించే పరిస్థితులు లేవు. టీడీపీ పట్ల అప్పటికే ప్రజల్లో తీవ్రమైన వైముఖ్యం నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో వామపక్షాలతో జట్టుకట్టి వైఫల్యాన్ని మూటగట్టుకున్నారు. ఎటువంటి సైద్దాంతిక భూమిక లేకుండానే మళ్లీ బీజేపీ గూటికి చేరారు. ఇదంతా పవన్ అమాయకత్వానికి, అయోమయానికి అద్దం పడుతోంది. నాయకులు తమ వ్యూహాల్లో బాగంగా ఎవరితోనైనా జట్టు కట్టవచ్చు. కానీ తన మనసులో, ఆలోచనలో ఒక స్పష్టతతో ఆ నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసినా , విభేదించినా రాజకీయ పరమైన కోణం, ఎత్తుగడ దాగి ఉంటాయి. అటువంటి అవగాహన లేకపోవడంతో పవన్ దెబ్బతింటున్నారు. పెద్ద పార్టీలు వాడుకుని వదిలేసేందుకు తనంతతాను వీలు కల్పిస్తున్నారు. ఏపీలో జనసేన మూడో పెద్ద పార్టీ. పక్కా వ్యూహంతో కదిలితే భవిష్యత్తులో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే చాన్సులున్న పార్టీ. ఆ దిశలో అడుగులు వేసుకుంటూ వెళితేనే ఫలితం ఉంటుంది. ఎవరో ఒకరికి పవన్ ఉపయోగపడుతున్నాడనే భావన ప్రజల్లో నెలకొంటే సొంత అస్తిత్వం కోల్పోతారు. పవర్ లోకి వచ్చే చాన్సు లేదనే ముద్ర పడితే ప్రజామద్దతు అంత సులభంగా లభించదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 35896 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*