పవన్ టార్గెట్ వారిపైనే….ఎందుకంటే …?

జనసేన అధినేత టార్గెట్ ఇప్పుడు వారే. వారెవరంటే టిడిపి యువరాజు నారా లోకేష్, వైసిపి అధినేత జగన్. ప్రస్తుత భవిష్యత్తు రాజకీయాల్లో తమ పార్టీకి ప్రధాన ప్రత్యర్ధులు వీరే అని గ్రహించిన జనసేన అధినేత వారిద్దరిపై విమర్శలు ఆరోపణలు సాధించడమే అజెండాగా పెట్టుకున్నారు. క్షేత్ర స్థాయిలో జనసేన బలంగా ప్రజల్లో పాతుకుపోవాలంటే నేరుగా రెండు ప్రధాన పార్టీలలో లోపాలను ఎండగట్టకపోతే లాభం లేదని డైరెక్ట్ అటాక్ మొదలు పెట్టారు పవన్. అందులో అధికారపార్టీ ని తన ప్రసంగాల్లో అత్యధిక సమయం విమర్శిస్తున్నారు. ఆ తరువాత వైసిపి అధినేత పై దాడి చేస్తున్నారు. ఇలా ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం తాము మాత్రమే అన్న సంకేతాలు ప్రజల్లోకి పంపుతున్నారు పవన్.

పంచాయితీ ఎన్నికల్లో కూడా …

పవన్ గోదావరి జిల్లాల్లో చేస్తున్న ప్రసంగాల్లో అత్యధికంగా లోకేష్ ను ఎకాఎకి చంద్రబాబు మంత్రి గా నియమించడాన్ని ప్రశ్నిస్తున్నారు. అనుభవం అనుభవం అని చెప్పే ముఖ్యమంత్రి ఏ అనుభవం తో కుమారుడికి అగ్ర పీఠం వేశారని దుమ్మెత్తి పోశారు. జనసేన పార్టీ పెట్టింది జీవిత కాలం తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయడానికి మాత్రం కాదన్నారు. అలాగే చంద్రబాబు తనయుడు కావడమే ఏకైక అర్హతగా ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్న లోకేష్ ను సిఎం సీట్లో కూర్చోబెట్టడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్ కి జగన్ అంటే భయమన్నది తనతో వారు జరిపిన సమావేశాల్లో అర్థమైందని పదేపదే చెప్పుకొస్తున్నారు పవన్. ఇసుక, మట్టి అన్నిటా అవినీతి జరుగుతున్నా రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలి ప్రత్యేక విమానాల్లో ముఖ్యమంత్రి విహరించి ఏమి సాధిస్తున్నారని మళ్ళీ బాబు ఎందుకు రావాలని టిడిపి చేస్తున్న క్యాంపైన్ పై ఫైర్ అయ్యారు జనసేనాని.

జగన్ బ్యాచ్ అరాచకాలకు అంతు లేదు …

తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో పవన్ వైసిపి అధినేత జగన్ బ్యాచ్ కోసం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆస్తిని వైసిపి ఎమ్యెల్యే కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టారని ఆరోపించారు. తాను తీయబోయే సినిమాలో నటించి తీరాలని మరో ఫ్యాక్షనిస్ట్ హీరో గా అత్యున్నత స్థాయిలో ఉన్న తననే బెదిరించారని చెప్పుకొచ్చారు. నా స్థాయిలో వున్న వారికే వారి బెదిరింపులు అలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందని ఇవన్నీ జగన్ కి తెలిసి జరుగుతున్నాయని అనుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి కుమారుడిగా ఆయన ముఖ్యమంత్రి కావాలని లోకేష్, జగన్ భావించినప్పుడు ఒక కానిస్టేబుల్ కొడుకు సిఎం కావాలనుకోవడంలో తప్పేమి లేదని తన ఆశ సరైనదనే సందేశం పంపారు జనసేనాని.

బాబు ఆయన టార్గెట్ కాదా …?

25 ఏళ్లపాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించడమే జనసేన ముందు వున్న ఏకైక లక్ష్యమని గతంలో ప్రకటించిన పవన్ భవిష్యత్తు ప్రత్యర్ధులు ప్రజా సేవలో తనతో సరిపోరనే భావన జనంలో ప్రోది చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు కన్నా ఆయన వారసుడు లక్ష్యంగా విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. అదే స్థాయిలో జగన్ సైతం తన ప్రత్యర్థిగా గుర్తించి ఆ పార్టీ అధినేతను టార్గెట్ చేస్తూ సాగుతున్నారు.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1111 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*