జగన్ ఏదో ఒకటి చేయాల్సిందే….!

ఏపీలో జనసేన పొలిటికల్ స్ట్రాటజి క్రమక్రమంగా మొదలవుతున్నట్టే కనిపిస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి స్టాట్‌ అవ్వడంతో ఏపీలోనూ రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు కొత్తగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన సైతం రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. నిన్నమొన్నటి వరకు చాలా సైలెంట్‌గా రాజకీయ కార్యకలాపాలు చేసుకుంటూ వస్తున్న జనసేన ఎట్టకేలకు తమ పార్టీ నుంచి తొలి అభ్యర్థిని ప్రకటించింది. ఏపీలో 13 జిల్లాల్లో ఏ పార్టీ అయిన అధికారంలోకి రావడానికి కీలకమైన తూర్పుగోదావరి జిల్లాలో తమ పార్టీ తరుపున పోటీ చేసే తొలి అభ్యర్థిని పవన్‌ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ముమ్మడివరం నియోజకవర్గం నుంచి జనసేన తర‌పున పితాని బాలకృష్ణ పోటీ చేస్తున్నట్టు పవన్‌ చెప్పిన సంగతి తెలిసిందే.

నాడు ప్రజారాజ్యం ఎంట్రీతో…..

ఇదిలా ఉంటే ఏపీలో 19 సీట్లతో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి కీలకంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నట్టే కనిపిస్తోంది.ఇక్కడ నిన్నటివరకు అధికార టీడీపీకి ధీటుగా ఉన్న విపక్ష వైసీపీ జనసేన ఎంట్రీతో చాలా నియోజకవర్గాల్లో ఇబ్బంది పడుతుందా? వైసీపీ ప్లేసును జనసేన ఆక్రమిస్తోందా ? అంటే తాజా రాజకీయ పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం ఎంట్రీతో నాడు విపక్షంలో ఉన్న టీడీపీ చాలా నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు లేక బలహీనమైన అభ్యర్థులతో మూడో ప్లేసును సరిపెట్టుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి జనసేన ద్వారా వైసీపీకి కూడా వస్తోందంటున్నారు.

జనసేనలోకి జంప్……

నిన్నమొన్నటి వరకు వైసీపీలో కీలకనేతలుగా ఉన్న పలువురు జనసేనలోకి జంప్‌ చేసేస్తున్నారు. వైసీపీలో రాజకీయ భవిష్యత్తు లేకపోవడం, సీటుపై గ్యారెంటీ లేకపోవడంతోనే వీళ్లంతా జనసేనను ఆశ్రయిస్తున్నారు.కాకినాడ సిటీలో కొద్ది రోజుల క్రితం వరకు వైసీపీ సయన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి ముత్తా శశిధర్‌ తనయుడు ముత్తా గోపాలకృష్ణ తన తండ్రితో కలిసి జనసేనలోకి జంప్‌ చేసేశారు. ఆయనకు కాకినాడ సిటీ సీటుపై పవన్‌ నుంచి హామి వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే గత ఎన్నికల్లో మండపేటలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన గిరజాల వెంకటస్వామినాయుడు సైతం జనసేనలోకి జంప్‌ చేసేసారు.

వచ్చే రెండు నెలల్లో……

ఇక రాజమహేంద్రవరం గ్రేటర్‌ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న కందుల దుర్గేష్‌ ఇటీవల జనసేనలోకి జంప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆయన వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే వీరితో పాటు వైసీపీలో ప్రయార్టీ లేని పలువురు ద్వితీయశ్రేణి, మండలస్థాయి నాయకులు సైతం జనసేనలోకి వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే రెండు నెలల్లో తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో మరింత అనూహ్య పరిణామాలు సంభవిస్తాయని, ఆ పార్టీ మరింత దిగజారుతుందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక వైసీపీ నుంచేకాకా ఇతర పార్టీలో కీలక నేతల సైతం జనసేనలోకి జంప్‌ చేసేస్తున్నారు. అదే టైంలో వైసీపీలో కీల‌క నేత‌లు టీడీపీలోకి కూడా వెళ్లిపోతున్నారు.

ఆయన వచ్చే నెలలో…..

నిన్నటివరకు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న పంతం నానాజి జనసేనలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయన కాకినాడ రూరల్‌ నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. ఇక వైసీపీ రాష్ట్రకార్యదర్శిగా ఉన్న సంగిసెట్టి అశోక్‌ సైతం జనసేనలోకి జంప్‌ చేసి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేసిన ప్రముఖ పారిశ్రామికవేక్త చెలమలశెట్టి సునీల్‌ టీడీపీలోకి జంప్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటీవల చంద్రబాబుతో సమావేశం అయిన అయన వచ్చే నెలలో టీడీపీలో చేరేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు.

పిల్లి మారతారా?

ఇక మాజీ మంత్రి జిల్లా వైసీపీకి కీలకంగా ఉన్న పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అడుగుల సైతం టీడీపీ వైపు పడుతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు పార్టీలో చేరితే టీడీపీ కాకినాడ రూరల్‌ సీటు ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. 2009 ఎన్నికలకు ముందు వరుస జంపింగ్‌లతో నాటి విపక్షం టీడీపీ జిల్లాలో ఎలా విలవిలలాండిదో నేడు అదే తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ఎంట్రీతో ప్రస్తుతం విపక్షంగా ఉన్న వైసీపీ కూడా అలాగే విలవిలలాడుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే వైసీపీ తీవ్ర ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఏర్పడుతుంది. మరి జగన్‌ ముందుగా మేలుకుంటే తప్ప‌ జిల్లా వైసీపీ గట్టి పోటి ఇచ్చే పరిస్థితి కనపడడం లేదు.

Ravi Batchali
About Ravi Batchali 30963 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*