
చిత్తూరు జిల్లా పుంగనూరులో గెలుపు, ఓటములపై ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీతో పాటు, జనసేన సైతం అంచనాల్లో మునిగి తేలుతుంది. సీనియర్ రాజకీయ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరులో నాలుగు సార్లు గెలిచి గత రెండు ఎన్నికల నుంచి పుంగనూరుకు మారి విజయం సాధిస్తూ వస్తున్నారు. పెద్దిరెడ్డి 1989, 1999, 2004 ఎన్నికల్లో పీలేరు నుంచి వరుస విజయాలు సాధించారు. 2009 ఎన్నికల్లో పుంగనూరుకు మారిన పెద్దిరెడ్డి ఇక్కడ సైతం గత రెండు ఎన్నికల్లోనూ గెలుస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపుతో హ్యాట్రిక్ కొట్టడడంతో పాటు వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే కేబినెట్ బెర్త్ కోసం సైతం కాచుకుని కూర్చుని ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసిన ఎన్. వెంకటరమణ రాజుపై భారీ మెజారిటీతో పెద్దిరెడ్డి గెలిచారు. 2009 ఎన్నికల్లో 41,000, 2014లో 31,000 మెజారిటీతో విజయం సాధించిన పెద్దిరెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే అని పోలింగ్ సరళి చెబుతోంది.
అందుబాటులో ఉంటూ….
ప్రజలకు అందుబాటులో ఉండడం, జిల్లాలో బలంగా ఉన్న వైసీపీ వేవ్, నియోజకవర్గంలో బలహీనమైన టీడీపీ అభ్యర్థి, జగన్ పాదయాత్ర, నవరత్నాలు ఇవన్నీ వైసీపీ గెలుపుకు కీలకం కానున్నాయని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. వైసీపీ కీలక నేతలతో పాటు, పెద్దిరెడ్డి కుటంబ సభ్యులు మండలాల వారిగా బాధ్యతను పంచుకుని ఎన్నికల వ్యూహాలు రూపొందించి టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇక టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి అమర్నాధ్ రెడ్డి మరదలు అనీషా రెడ్డి పూర్తిగా తన భర్త ఎన్. శ్రీనాధ్ రెడ్డిపై ఆధారపడి ప్రచారం చేశారు. పుంగనూరులో ఉన్న ముస్లింలను వైసీపీకి దూరం చేసే క్రమంలో ఆమె చేసిన ప్రచారం కొంత వరకు ఫలించింది. పుంగనూరులో వైసీపీ నాయకులు కేసీఆర్, ఒవైసీ ఫ్లెక్సీలు ఏర్పాటు చెయ్యడంతో అక్కడ ఆంధ్రా నినాదం తీసుకురావడం ద్వారా వారిలో కొంత మంది టీడీపీ వైపు ఆకర్షితులయ్యేలా చెయ్యడంలో ఆమె సక్సెస్ అయినట్టు తెలుస్తోంది.
పెద్దిరెడ్డి వైపే మొగ్గు….
అనీషారెడ్డి ఎంత చేసినా పోలింగ్ సరళి పెద్దిరెడ్డికే మొగ్గు ఉన్నట్టు స్పష్టంగా చెపుతోంది. ఇక జనసేన నుంచి పోటీ చేసిన పారిశ్రామిఖ వేత్త రామచంద్ర యాదవ్ వైసీపీ, టీడీపీ పార్టీలపై ఉన్న వ్యతిరేఖ ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు. అదే టైమ్‌లో ఆయన వినూత్నంగా రూ.100 స్టాంప్ పేపర్‌పై రైతులకు ఉచితంగా బోర్లు, 22 అంశాలకు సంబంధించిన హామీ పత్రం ఇవ్వడం ప్రజల్లో చర్చినీయాంశం అయ్యింది. ఏదేమైనా పుంగనూరులో గెలిచేందుకు పెద్దిరెడ్డికే ఎక్కువ స్కోప్ ఉన్నట్టు చిత్తూరు జిల్లా పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే టైమ్‌లో పెద్దిరెడ్డి లాంటి సీనియర్ నేతకు జగన్ కేబినెట్లో జిల్లా నుంచి ఖాయం అన్న టాక్ కూడా వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అటు పెద్దిరెడ్డి తనయుడు మిథున్‌రెడ్డి ఇప్పటికే రాజంపేట ఎంపీగా గెలుపు బాటలోనే ఉన్నట్టు టాక్.
Leave a Reply