పెద్దిరెడ్డి బరిలో గిరి గీశారే….!!

peddyreddyramchandrareddy chandrababunaidu

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బరి చుట్టూ గిరి గీశారా? ఆయన ఆ నియోజకవర్గం హద్దు దాటకుండా వ్యూహాలను రచిస్తున్నారా..? అంటే అవుననే అనిపిస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కట్టడి చేయాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు వ్యూహాలను రచిస్తున్నారు. పెద్దిరెడ్డిని పుంగనూరుకే పరిమితం చేయగలిగితే తన సొంత జిల్లాలో మెజారిటీ స్థానాలను వచ్చే ఎన్నికల్లో సులువుగా గెలుచుకోవచ్చన్నది చంద్రబాబు ఆలోచన. గత ఎన్నికల్లో పెద్దిరెడ్డి వ్యూహంతోనే చిత్తూరు జిల్లాలో టీడీపీకి భారీగా దెబ్బపడింది. అయితే ఈసారి అది పునరావృతం కాకుండా చంద్రబాబు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నల్లారిని నేరుగా….

పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గానికి ఇప్పటికే మంత్రి అమర్ నాధ్ రెడ్డి మరదలు అనీషారెడ్డిని చంద్రబాబు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పుంగనూరులో అనీషారెడ్డి తన భర్త శ్రీనాధరెడ్డితో కలసి విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయినా వీరివల్ల పెద్దిరెడ్డికి పెద్దగా ఇబ్బంది జరగదేమోనని భావించిన చంద్రబాబు నేరుగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని రంగంలోకి దించారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పీలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. పీలేరులో పార్టీ బాధ్యతలను చూసుకుంటూనే పుంగనూరు పై దృష్టి పెట్టాలని నల్లారిని చంద్రబాబు ఆదేశించారు.

అదనపు బాధ్యతలు….

నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పుంగనూరు నియోజకవర్గం అదనపు బాధ్యతలను అప్పగించారు. నిజానికి పెద్దరెడ్డికి, నల్లారి ఫ్యామిలీకి దశాబ్దాల నుంచి రాజకీయ వైరం ఉంది. ఒకరిని ఓడించడానికి మరొకరు ప్రతి ఎన్నికల్లో ప్రయత్నిస్తూనే ఉంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుంగనూరు మాత్రమే కాకుండా జీడీ నెల్లూరు, పూతలపట్టు, పీలేరు, మదనపల్లి నియోజకవర్గాల్లో పట్టుంది. ప్రత్యేక వర్గం ఉంది. పెద్దిరెడ్డి ఎటు ఉంటే ఆ ఓట్లు అటువైపే పడతాయి. ఇక ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి ఆ నియోజకవర్గాల్లో పర్యటించి తన పార్టీకి అనుకూలంగా మలచుకుంటారు. అభ్యర్థులకు అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తుంటారాయన.

పుంగనూరుకే పరిమితం చేయాలని….

అందుకోసమే నల్లారిని నేరుగా రంగంలోకి దించి పుంగనూరులో పెద్దిరెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నం చేయగలిగితే ఆయన మిగిలిన నియోజకవర్గాల్లో పెద్దగా దృష్టి పెట్టే అవకాశం ఉండదన్నది చంద్రబాబు ఆలోచన. ఇప్పటికే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పెద్దిరెడ్డి అనుకూల వర్గాలను తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మంత్రి అమర్ నాధ్ రెడ్డి కూడా పుంగనూరులో విస్తృతంగా పర్యటిస్తన్నారు. ఇలా పెద్దిరెడ్డిని పుంగనూరుకే పరిమితం చేసి మిగిలిన నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగురవేయాలన్న బాబు వ్యూహం ఎంతమేరకు పనిచేస్తుందో చూడాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 33978 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*