
భవిష్యత్తుపై ఆశలు రేకెత్తినప్పుడు ఆనందం వెల్లివిరుస్తుంది. రాజకీయాల్లో తమ దశ మారుతుందనే నమ్మకమే కార్యకర్తలను, నాయకులను ముందుకు నడుపుతుంది. నిస్తేజంగా మారుతున్న కాంగ్రెసులో నిరాశావహ వాతావరణం పార్టీని నిలువెల్లా ఆవరించింది. పార్టీని దీర్ఘకాలంగా పట్టుకుని వేలాడుతున్న వారిలోనూ భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది. సామదానభేదోపాయాల జాతీయవాదంతో మొత్తం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ఛిన్నాభిన్నం చేసేస్తున్న మోడీ, అమిత్ షాల ధాటికి విపక్షాలన్నీ కకావికలమైపోయాయి. అన్ని పార్టీలు కలిసి జట్టుకట్టినా ఈ కమల నాయకద్వయాన్ని దీటుగా ఎదుర్కోగలరన్న నమ్మకం లోపించింది. అనేక పార్టీలు కలిసి ఫ్రంటుల టెంటులు వేసేందుకు యత్నాలు చేస్తున్నాయి. కానీ పూర్తిగా ఫలించడం లేదు. అన్నిసర్వేలు ఏదోరకంగా మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని చెప్పేస్తున్నాయి. మెజార్టీ తగ్గవచ్చేమో కానీ పవర్ పగ్గాలు కమలానికే అంటూ సర్వేలు చాటిచెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక బలమైన పార్టీ కేంద్రంగా ప్రతిపక్షకూటమి కడితే మాత్రమే బీజేపీని నిరోధించడం సాధ్యమవుతుంది. ప్రియాంక గాంధీ పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీకి ఆ బలాన్నిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
అన్నకు బలమా?బలహీనతా..?
కొంతకాలం క్రితం యువనాయకుడిగా రాహుల్ గాంధీని ఆకాశానికెత్తేశాయి పార్టీ శ్రేణులు. కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలోనూ ఆయన పార్టీ బాధ్యతలు స్వీకరించాలనే డిమాండ్లు హోరెత్తాయి. రాహుల్ ప్రధానమంత్రి పీఠం ఎక్కాలన్న నాయకులకూ కొరత లేదు. పార్టీ అధికారం కోల్పోయిన మూడేళ్లకు గానీ రాహుల్ అధ్యక్ష స్థానాన్ని తీసుకోలేదు. సోనియా అనారోగ్య కారణాలతో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను రాహుల్ నేత్రుత్వంలోనే పార్టీ ఎదుర్కొంది. బీజేపీ వరస విజయాలతో దూసుకుపోయింది. ఐరన్ లెగ్ గా పార్టీ వర్గాలే తమ నాయకుడిపై ముద్ర వేసేశాయి. నిజానికి రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించకముందే ప్రియాంకను రాజకీయాల్లో దింపాలనే డిమాండ్ పెరిగిపోయింది. తెగించి 2018 డిసెంబర్ లో ఆయన అధ్యక్షపీఠం ఎక్కారు. పార్టీ కొంత పుంజుకోవడం ప్రారంభించింది. దీనికి రాహుల్ ఘనత కంటే బీజేపీ స్వయంక్రుతాపరాధాలే కారణమని చెప్పాలి. దీర్ఘకాలం అధికారంలో ఉన్నచోట్ల బీజేపీ దెబ్బతింది. బొటాబొటి మెజార్టీతో హస్తం పార్టీ గెలుపు సాధించింది. కానీ 2019 ఎన్నికలను దున్నేస్తామన్న నమ్మకం కాంగ్రెసు శ్రేణులకు ఏర్పడలేదు. తాజాగా ప్రియాంక రంగప్రవేశం మళ్లీ ఆమె అధ్యక్షపీఠాన్ని స్వీకరించాలనే డిమాండ్ కు దారి తీసే ప్రమాదం లేకపోలేదు. ఒకరకంగా చూస్తే ఇంతవరకూ అన్నకు సలహాదారుగా ఉన్న ప్రియాంక పూర్తిగా కార్యాచరణకు దిగుతున్నట్లేగానే చెప్పాలి.
పోలిక ప్లస్సా..మైనస్సా..?
ప్రియాంకను ఐరన్ లేడీ ఇందిరతో పోల్చడం రాజకీయంగా ఆత్మహత్యాసద్రుశం. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని డక్కామొక్కీలు తిన్న తర్వాత ఇందిర రాటుతేలారు. సిండికేట్ ను ఎదుర్కోవడంలోనూ , సొంతంగా పార్టీని నిర్మించుకోవడంలోనూ ఆమె ముద్ర వేరు. రాజకీయ ప్రత్యర్థులను, శత్రుదేశాలను , అంతర్జాతీయ సమాజాన్ని ఆమె చాలా చక్యంగా ఎదుర్కొన్నారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో చిన్ననాటినుంచి రాజకీయాల్లోనే పుట్టి పెరిగారామె. తల్లి, సోదరుడు రాజకీయ రంగప్రవేశం చేసేవరకూ దాదాపు రాజకీయాలకు దూరంగా పెరిగారు ప్రియాంక. అందువల్ల హై ఎక్స్ పెక్టేషన్స్ నైతికంగా దెబ్బతీస్తాయి. అందులోనూ ఆమెకు అప్పగించిన బాధ్యత అత్యంతక్లిష్టమైనది. ఎస్పీ, బీఎస్పీ కలయిక తర్వాత యూపీలో అధికారపార్టీయే ఆపసోపాలు పడుతోంది. కాంగ్రెసుకు కనుచూపుమేరలో అధికారం, అవకాశం కనిపించడం లేదు. ఇక్కడ వ్యవహారాలను చక్కదిద్దడం మాటలు కాదు. పూర్వ వైభవం అన్నది కలలోని మాటే. రిటర్న్ ఆఫ్ ఇందిర, ట్రంప్ కార్డు వంటి బిరుదులతో బెంబేలెత్తించడం కంటే సమయం అనుకూలించేంతవరకూ సహనంతో ఎదురుచూడటం ముఖ్యం. ఎందుకంటే ప్రియాంక ప్రస్థానం ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణంలో పరాజయాలతోనే మొదలు కాబోతోంది.
రాజకీయ కోలాహలం…
దేశరాజకీయాల్లో ప్రియాంక పొలిటికల్ అరంగేట్రం కోలాహలంగా మారింది. కేవలం కాంగ్రెసు కే పరిమితం కాలేదు. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పరిణామం కావడంతో కాంగ్రెసు క్యాడర్ సంబరాలు చేసుకొంటోంది. అన్ని రాజకీయపార్టీలు ఆహ్వానిస్తున్నాయి. ప్రధానిమంత్రి సైతం స్పందించడం ఈ సంఘటనకు గల ప్రాధాన్యానికి నిదర్శనం. ’వారికి కుటుంబమే పార్టీ. మాకు పార్టీయే కుటుంబం‘ అంటూ మోడీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రియాంకపై ఎక్కుపెట్టే అస్త్రాలకు ఇది తొలి చురక. వ్యూహకర్తలు, ప్రధానపార్టీల నాయకులు అంతా ప్రియాంక రావడం దేశరాజకీయాల్లో కొత్తదనానికి నాంది పలుకుతుందనే అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. మొరటు రాజకీయాలతో దేశాన్ని శాసిస్తున్న మోడీ, షాల కమలానికి అయిదోతరం కాంగ్రెసు వారసులైన యువనాయకులు రాహుల్, ప్రియాంక సవాల్ విసురుతున్నారు. రాజకీయ అవకాశ వాదం వాళ్లిద్దరికీ కొత్తే. అవినీతి, జడత్వం, కాలానుగుణంగా మార్పు లేకపోవడం వంటి అవలక్షణాలను నిలువెల్లా నింపుకున్న కాంగ్రెసులో కొత్త శకానికి అన్నాచెల్లెళ్లు కలిసికట్టుగా బాటలు వేస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
-ఎడిటోరియల్ డెస్క్
Leave a Reply