
ప్రజల తీర్పు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అదేసమయంలో నాయకుల అదృష్టం కూడా ఎలా ఉంటుందో ఊ హించలేం. ఖచ్చితంగా ఓడిపోతారనుకున్న నాయకులు కూడా లక్కు కలిసొచ్చి గెలిచిన సందర్భాలు అనేకం ఉన్నా యి. ఇక, ఖచ్చితంగా గెలుస్తారని అంచనాలు వేసుకున్న నాయకులు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నికల రణరంగంలో గెలుపు ఓటములు ఎవరికి ఎలా దక్కుతాయో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి పరిణామమే పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి పితాని సత్యనారాయణకు ఎదురవుతోంది. ఈ నియోజకవర్గంలో పితానికి ఎదురులేదు. వరుసగా ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధిస్తూనే ఉన్నారు.
హ్యాట్రిక్ గెలుపుతో…
పార్టీలతో సంబంధం లేకుండా ఆయనకు ప్రజలు కూడా జై కొడుతున్నారు. అయితే, దీనికి అనేక కారణాలు కనిపిస్తు న్నాయి. 2004, 2009, 2014 ఎన్నికల్లో పితాని ఇక్కడ నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అయితే, ఆయా ఎన్నికల్లో ఆయన గెలిచారు అనేకన్నా.. పలు పార్టీలు చేసిన తప్పిదాలే ఆయనను గెలిపించాయని అంటున్నారు పరిశీలకులు. 2004లో కాంగ్రెస్ తరఫున రద్దయిన పెనుగొండ నుంచి పోటీ చేసిన పితాని విజయం సాధించారు. అప్పటికే ఆయన అక్కడ వరుసగా ఓడిపోతుండడంతో వెల్లువెత్తిన సానుభూతి, ఆ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో పితాని తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక, 2009లో టీడీపీ మిస్టేక్ చేసి.. రెడ్డి వర్గానికి చెందిన కర్రి రాధాకృష్ణారెడ్డికి టిక్కెట్ ఇచ్చారు.వాస్తవానికి ఇక్కడ రెడ్డి వర్గం ప్రభావం చాలా తక్కువ. పైగా కర్రి రాధాకృష్ణారెడ్డి చాలీ వీక్ క్యాండెట్. పితానికి పోటీ లేకపోవడంతో ఆయన మరోసారి విజయం సాధించారు.
మరోసారి ఛాన్స్ ఇలా…
ఇక, 2014కు ముందు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన పితాని జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. అయితే, ఎన్నికల సమయానికి టీడీపీలోకి జంప్ చేసి ఆచంట టికెట్‌ను సంపాయించుకున్నారు. ఇక, ఇక్కడ నుంచి వైసీపీ తరఫున ముదునూరి ప్రసాదరాజు పోటీకి దిగారు. నిజానికి ఆయనకు ఈ నియోజకవర్గంతో సంబంధాలు తక్కువ. నరసాపురం ఇంచార్జ్‌గా ఉండి.. వైసీపీని బలోపేతం చేశారు. అయితే, ఎన్నికల సమయానికి వచ్చేసరికి జగన్ ఆయనను తీసుకు వచ్చి ఆచంట టికెట్ ఇచ్చారు. ఈ పరిణామం పితానిని బలోపేతం చేసింది. ఫలితంగా గత ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఈ వరుస పరిణామాలే పితాని గెలుపునకు కారణమయ్యాయి.
బీసీ కార్డు వాడుతూ….
ఇక, ఇప్పుడు మాత్రం పితాని గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. వైసీపీ తరఫున చెరుకువాడ శ్రీరంగనాథరాజు పోటీకి దిగారు. రాజకీయంగా బలమైన నాయకుడు, ఆర్థికంగా కూడా స్థితి మంతుడు కావడంతో చెరుకువాడ ఏడాదిన్నర ముందుగానే నియోజకవర్గంలో కలియదిరిగారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోతూ.. నేనున్నాననే భరోసా కల్పించారు. ఇక, టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆర్థికంగా ఎక్కడా వెనుకా ముందు ఆడకుండా ఖర్చు చేశారు. ఇక పితానిపై పదేళ్లుగా ఉన్న వ్యతిరేకత, ఇటు సరైన ప్రత్యర్థి బరిలో ఉండడంతో పితాని వర్గంలో టెన్షన్ నెలకొంది. ఇక ప్రతిసారి ఎన్నికల వేళ బీసీ కార్డు, మన కులం శెట్టిబలిజ అంటూ ఆ కార్డును వాడుకుని బయటపడుతూ వస్తోన్న పితానికి ఈ సారి సొంత సామాజికవర్గంలో కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పటి వరకు ఎన్నికల్లో గెలిచిన తీరుకు భిన్నంగా ఇక్కడ పోటీ జరగడం, బలమైన నాయకుడుగా పేరు తెచ్చుకోవడం వంటివి చెరకువాడకు ప్లస్‌గా మారడంతో పితాని వర్గం సైతం తమ నాయకుడి గెలుపు బాగా టైట్ అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Leave a Reply