కింగ్ ఎవరు..? మేకర్ ఎవరు?

polling-trs-congress-bjp

తెలంగాణలో మూడు నెలలుగా ప్రారభమైన ఎన్నికల హడావిడి ముగింపు దశకు చేరుకుంది. మరికొద్దిసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. ఓటర్లు స్వచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరింది. ఇక గతానికి భిన్నంగా ఎన్నికల ప్రక్రియలో ఈసారి అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈవీఎంలో ఓటేశాక ఎవరికి ఓటేశామో చూసుకోవడానికి పక్కనే వీవీపాట్ లను ఏర్పాటుచేశారు. పోలింగ్ సరళిని మొత్తం వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టుల ప్రభావం ఉన్న 13 నియోజకవర్గాల్లో 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 1,821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా… అత్యల్ఫంగా బాన్సువాడ నియోజకవర్గంలో ఆరుగురు మాత్రమే బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 3,873 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 1 లక్ష మందితో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. 279 కంపెనీల కేంద్ర బలగాలను భద్రత కోసం ఉపయోగించుకుంటున్నారు.

పథకాలే గట్టెక్కించాలి…

ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సమితి మిగతా పార్టీల కంటే ముందుంది. సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దు చేసి 105 మంది అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. దీంతో అప్పటి నుంచే టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ఇక కేసీఆర్ సుడిగాలి పర్యటనలతో ప్రచారం నిర్వహించారు. సుమారు 80కి పైగా నియోజకవర్గాలను కవర్ చేస్తూ 50కి పైగా బహిరంగ సభలకు ఆయన హాజరయ్యారు. ఒక్కో రోజు ఆయన 6 నుంచి 8 బహిరంగ సభల్లోనూ పాల్గొన్నారు. ఇక కేటీఆర్ ఎక్కువగా హైదరాబాద్ లో, హరీష్ రావు మెదక్ జిల్లాలో, కవిత నిజామాబాద్ జిల్లా బాధ్యతలు తీసుకుని ప్రచారం నిర్వహించారు. మొత్తానికి కేసీఆర్ ప్రచార బాధ్యతలను పూర్తిగా తలకెత్తుకుని నడిపించారు. సంక్షేమ ఫలితాలు, ప్రాజెక్టుల నిర్మాణం మధ్యలో ఉండటం, ఉత్తర తెలంగాణలో ప్రత్యర్థుల కంటే చాలా బలంగా ఉండటం, బలమైన నాయకత్వం, ‘మళ్లీ చంద్రబాబు పెత్తనం అవసరమా’ అనే అంశం ప్రజల్లోకి వెళ్లడం టీఆర్ఎస్ కి సానుకూలంగా కనిపిస్తున్నాయి. అదే స్థాయిలో ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అభ్యర్థులపై వ్యతిరేకత ఎక్కువగా ఉండటం, ప్రజా కూటమి ఏర్పడటం, అందులో మంద కృష్ణ, కృష్ణయ్య, గద్దర్ వంటి వారూ ఉండటం, పాలనా వైఫల్యాలు, ముఖ్యమంత్రి ప్రజల్లో లేరనే విమర్శ, నియంతృత్వ పాలన అని ప్రజల్లోకి వెళ్లడం, యవతలో వ్యతిరేకత వంటి అంశాలు టీఆర్ఎస్ కు మైనస్ గా మారాయి. అయితే, కళ్యాణలక్ష్మీ, పింఛన్లు, రైతుబంధు వంటి పథకాలపై మాత్రం గ్రామాల్లో ఎక్కువ సానుకూలత ఉంది.

కేసీఆర్ పై వ్యతిరేకతే కూటమి బలం…

ఎలాగైనా కేసీఆర్ ను గద్దె దించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ సారథ్యంలో ప్రజాకూటమి ఏర్పడింది. టీడీపీ, టీజేఎస్, సీపీఐతో కాంగ్రెస్ కూటమి కట్టింది. ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాహుల్ గాంధీ 10కి పైగా సభలు నిర్వహించారు. సోనియా గాంధీ సభ కూడా జరిగింది. ఇక జాతీయ పార్టీ నేతలు, పక్క రాష్ట్రాల నేతలు సుమారు 20 మందికి పైగానే తెలంగాణలో మకాం వేశారు. ప్రసార మాధ్యమాల ద్వారా పార్టీ విధానాలను, మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. కేసీఆర్ ప్రభుత్వంపై కొన్నివర్గాల్లో వ్యతిరేకత, టీఆర్ఎస్ అభ్యర్థులపై వ్యతిరేకత, మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్లడం, బలమైన అభ్యర్థులు, ఓటు బ్యాంకు ఉండటం, కూటమి ఏర్పాటు వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశాలు తగ్గడం వంటి అంశాలు ప్రజాకూటమికి సానుకూలాంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక, ముఖ్యమంత్రి ఎవరవుతారో చెప్పుకోలేకపోవడం, నామినేషన్ల చివరి నిమిషం వరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం, ఎన్నికలు కేసీఆర్ – చంద్రబాబు మధ్య పోటీగా మారడం, కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు పెత్తనం ఉంటుందనే అంశం ప్రజల్లోకి వెళ్లడం కాంగ్రెస్ కు ప్రతికూల అంశాలుగా కనిపిస్తున్నాయి.

ప్రత్యామ్నాయం తామే అంటున్న బీజేపీ

ఇక బీజేపీ కూడా ఈసారి బాగానే పుంజుకుందనే అంచనాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా ఆ పార్టీ బలం స్పష్టంగా తేలలేదు. ఈసారి అన్ని స్థానాలలో ఒంటరిగా బరిలో దిగుతోంది. బీజేపీ తరపున ప్రధాని మోదీ, అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని ఎప్పుడూ లేనంత ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. మార్పు కోసం ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వమని కోరుతూ ఎన్నికల ప్రచారం సాగింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలది కుటుంబ పాలన అని, ప్రత్యామ్నాయగా ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ ప్రచారం చేసింది. కేంద్రంలో అధికారం, బలమైన నాయకత్వం కలిగి ఉండటం, పలు స్థానాల్లో బలమైన అభ్యర్థులను దింపడం, కేంద్ర పథకాలను ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఇటీవల ఎంఐఎం నేతలు చేసిన వ్యాఖ్యలు బీజేపీకి సానుకూల అంశాలుగా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎక్కువగా కూటమినే చూస్తుండటం, ఆలస్యంగా ఎన్నికలకు సమాయత్తం అవడం, బలమైన ఓటు బ్యాంకు లేకపోవడం, గ్రామాల్లో పట్టు సాధించలేకపోవడం, టీఆర్ఎస్ తో అవగాహన ఉందన్న ప్రచారం జరగడం వంటి అంశాలు బీజేపీకి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే టీఆర్ఎస్ – ప్రజాకూటమి మధ్య ద్విముఖ పోరు కనిపిస్తున్నా… హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలోనూ కొన్ని స్థానాల్లో బీజేపీ బాగా పుంజుకున్నట్లు కనిపిస్తోంది. మరి, ఏ పార్టీల ఏ మేర సత్తా చూపిస్తుందో చూడాలంటే 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*