పీకే వచ్చిన తర్వాతనే సీన్ మారిందా?

ఇప్పుడు వైసీపీలో అంతా ప్రశాంత్ కిషోర్ మాటే. ఆయన వచ్చిన తర్వాతనే పార్టీ గాడిలోపడిందన్న చర్చ పార్టీలో జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు, సూచనల వల్లనే పార్టీ ఈరోజు ఇంతగా ప్రజల్లోకి వెళ్లిందని వైసీపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. నాలుగేళ్లలో వైసీపీ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే….జగన్ తాను అనుకున్నట్లే ముందుకు వెళుతున్నారు. 2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే జగన్ దృష్టంతా 2019 ఎన్నికలపై పెట్టారు. ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆయన టార్గెట్ 2019 ఎన్నికలే. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే జగన్ మీడియా సమావేశం పెట్టి ఓటమిని అంగీరిస్తున్నానని, ప్రజాసమస్యలపై పోరాడతానని చెప్పారు. ఇక అప్పటి నుంచి క్షణం ఊరుకోలేదు. పార్టీ అధికారంలోకి రాకపోయినా పెద్దగా నిరాశ పడలేదు. ఆనాటి నుంచి జగన్ జనం మధ్యలోనే ఉండేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు.

నిత్యం జనంలోనే…..

యువభేరి, దీక్షలు, ప్రజా సమస్యలపై ఆందోళనలతో నిత్యం జగన్ జనం మధ్యనే ఉన్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా నినాదాన్ని నాలుగేళ్ల క్రితమే భుజానకెత్తుకున్న జగన్ అదే నినాదంతో అన్ని జిల్లాలను పర్యటించి వచ్చారు. ప్రత్యేక హోదా కోసం గుంటూరులో ఎనిమిది రోజుల పాటు ఆమరణ దీక్షకు కూడా దిగారు. ఇలా పార్టీ శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం మనదేనన్న ధైర్యాన్ని క్యాడర్ కు నూరిపోయడంలో జగన్ కృతకృత్యులయ్యారనే చెప్పాలి.

నాలుగేళ్లలో ఆటుపోట్లు……

జగన్ కు ఈ నాలుగేళ్లలో మామూలుగా షాక్ లు తగల్లేదు. ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. తనపై నమోదయిన కేసులు ఒకవైపు, పార్టీ నేతలు వరుసగా వెళ్లిపోవడంతో ఆయన ఒకదశలో కుంగిపోయారని పార్టీ నేతలు చెబుతారు. అప్పటి వరకూ తనకు అండగా ఉన్న మైసూరారెడ్డి, సబ్బంహరి, కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావులు పార్టీని వీడినప్పుడు కొంత మనస్తాపానికి గురయ్యారని చెబుతారు. ఇక వైసీపికి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా వీడిపోతున్నప్పుడు మాత్రం ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ముఖ్యంగా భూమానాగిరెడ్డి కుటుంబం పార్టీని వీడినప్పుడు మాత్రం తన సన్నిహితుల వద్ద ‘‘అన్నా ఇక ఎవరిని నమ్మాలి’ అని వ్యాఖ్యలు చేశారు. ఇలా జగన్ ఎన్నో ఆటుపోట్లు అధిగమించారు.

పీకే ఎంటర్ కావడంతో…..

గత ఎన్నికల్లో స్వల్ప ఓటింగ్ శాతంతో అధికారానికి దూరమైన జగన్ ఈసారి ఆతప్పు చేయదలచుకోలేదు. అందుకే ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా నియమించిన తర్వాత జగన్ కు పార్టీలోనూ, క్షేత్రస్థాయిలోనూ జరుగుతున్న వాస్తవ పరిస్థితులు అవగతమయ్యాయి. పార్టీ నేతలు ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని సర్వేల ద్వారా తెలుసుకున్న జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికి రెండు వేల కిలోమీటరల్ు పైగానే పాదయాత్ర పూర్తి చేసిన పార్టీని ఇప్పుడు ఒక దారిలో తెచ్చారంటున్నారు. ఇప్పుడు జగన్ పార్టీకి ఏపీలో మైలేజీ బాగా పెరిగిందంటున్నారు. కేంద్ర ఇంటలిజెన్స్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న కేంద్రంలో ఉన్న బీజేపీ అందుకే టీడీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుని ఏడాది నుంచి పక్కన పెట్టి…పొగపెట్టి బయటకు పంపింది.

పోల్ మేనేజ్ మెంట్ లో వీక్ కావడంతో…..

అయితే పోల్ మేనేజ్ మెంట్ లో వీక్ గా ఉండటం ఆ పార్టీకి మైనస్ పాయింట్. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ మాదిరి బూత్ లెవెల్ మేనేజ్ మెంట్ లో వైసీపీకి పెద్దగా అనుభవం లేదు. దీన్ని అధిగమించడానికే ఇటీవల ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవెల్ కమిటీ సమావేశాలు పెట్టి వారిని గాడిలో పెట్టే ప్రయత్నంలో పడింది వైసీపీ. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ కమిటీ శిక్షణ తరగతులు పూర్తయ్యాయి. ఎన్నికల నాటికి మరోసారి సమావేశాలు పెట్టాలన్నది జగన్ ఆలోచన. ఇలా జగన్ నాలుగేళ్ల నుంచి అధికార పార్టీకి ధీటుగా ప్రజల్లోకి వెళుతూ పార్టీని గాడిలో పెట్టారు. మరి ఎన్నికల నాటికి ఈ జోష్ పార్టీలో ఉంటుందా? చంద్రబాబు వ్యూహాల ముందు వైసీసీ తేలిపోతుందా? లేదా? అన్నది చూడాల్సిందే. మొత్తం మీద నాలుగేళ్లుగా జగన్ పడుతున్న కష్టాన్ని ఆ పార్టీ నేతలు పాదయాత్రలో గుర్తు చేసుకుంటుండటం విశేషం.

Ravi Batchali
About Ravi Batchali 22563 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*