
శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కాయి. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటుండటంతో ప్రతిభా భారతి దారెటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతిభా భారతి తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్. గతంలో స్పీకర్ గా పనిచేసిన ప్రతిభా భారతి రాజాం నియోజకవర్గం నుంచి వరుసగా ఓటమి పాలవుతూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఆమె విజయం సాధించినట్లయితే ఖచ్చితంగా మంత్రి పదవో , స్పీకర్ పదవో వచ్చి ఉండేది. కానీ కాలం కలసి రాకపోవడంతో ప్రతిభ ఓటమి పాలయ్యారు.
నాలుగున్నరేళ్లుగా ఇన్ ఛార్జిగా…..
తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజాం నియోజకవర్గంలో ప్రతిభా భారతి మరింత పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత నాలుగున్నరేళ్లుగా ఆమె రాజాం నియోజకవర్గ ఇన్ ఛార్జిగాకొనసాగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. కానీ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళావెంకట్రావుతో ఆమెకు పొసగడం లేదు. గత కొన్నాళ్ల నుంచి రెండు వర్గాల మధ్య వార్ నడుస్తోంది. కళా, ప్రతిభ వర్గాలుగాచీలిపోయి విడివిడిగా సమావేశాలు పెట్టుకుని అధిష్టానానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.
కళాతో కలహాల వల్లనే…..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్ద పట్టున్న కళావెంకట్రావు శరవేగంగా పావులు కదిపారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రతిభా భారతి విజయం సాధించే అవకాశాలు లేవని, కొండ్రమురళిని పార్టీలోకి చేర్చుకుంటే విజయం ఖాయమని ఆయన కొద్దిరోజులుగా చంద్రబాబు చెవిలో ఊదుతూనే ఉన్నారు. దీంతో చంద్రబాబు కూడా కొండ్రుమురళి వంటి యువనేతను తీసుకోవాలని నిర్ణయించారు. ఈనెల 31వ తేదీన కొండ్రమురళి పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారయింది. తన అనుచరులతో సమావేశమైన కొండ్రుమురళి వేలాది మందితో అమరావతికి బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు.
పార్టీ వీడతారా? లేక….?
ఈ నేపథ్యంలో ప్రతిభా భారతికి ఇక రాజాం టిక్కెట్ లేనట్లేనన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. కొండ్రుమురళికి స్పష్టమైన టిక్కెట్ హామీ లభించబట్టే ఆయన పసుపు కండువా కప్పుకుంటున్నారని తెలియడంతో ప్రతిభ తన అనుచరులతో, సన్నిహితులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తన ఓటమికి కారణం కళా వెంకట్రావు కారణమంటూ ఆమె వాదనను తెరపైకి తెచ్చారు. కళా వెంకట్రావు కారణంగానే తాను ఓటమి పాలయ్యానని, తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని చివరిసారిగా చంద్రబాబును కలసి ప్రతిభాభారతి కోరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ లభించకపోతే పార్టీ మారైనా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసైనా తన సత్తా ఏంటో చూపాలని ప్రతిభాభారతి భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద కొండ్రు మురళి పార్టీలో చేరినా ప్రతిభాభారతి సహకారం లేకుంటే ఆయన గెలుపు అంత ఈజీ కాదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
Leave a Reply