ప్రతిభ పగ పడితే….?

ఎచ్చెర్లలో కళా వెంకట్రావును ఓడించేందుకు ప్రతిభా భారతి భారీ వ్యూహం రచించారా? తనను పక్కనపెట్టి తన నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండ్రుమురళిని సైకలెక్కించడంలో కళా వెంకట్రావు కీలక పాత్ర పోషించారని ప్రతిభా భారతి పగతో రగలి పోతున్నారు. అన్నగారి నుంచి చంద్రబాబు వరకూ తాను పార్టీనే నమ్ముకుని ఉంటే తనకు ప్రత్యర్థులను డంప్ చేయడంపై ఆమె మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కళా వెంకట్రావును ఓడించడమే తమ లక్ష్యమని ఆమె సన్నిహితులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొందరు ముఖ్యనేతలతో ఆమె ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం.

ఎచ్చెర్ల లో పట్టు ఉండటంతో…..

ప్రతిభా భారతికి నిజానికి ఎచ్చెర్ల నియోజకవర్గంలో పట్టుంది. ఇక్కడ కళింగ, వెలమ, ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దాదాపు పదిహేను వేల మంది ఎస్సీ ఓటర్లున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతిభాభారతి ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. 1983, 1985, 1989, 1994, 1999 వరుసగా ఐదుసార్లు ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే 2004 ఎన్నికల్లో ఆమె ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కొండ్రుమురళిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2009లో ఎచ్చెర్ల నియోజకవర్గం జనరల్ గా మారింది. దీంతో ప్రతిభా భారతి ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గమైన రాజాంకు మారారు.

వరుస ఓటములతో….

2009లో రాజాం నుంచి పోటీ చేసిన ప్రతిభా భారతి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కొండ్రుమురళి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2014లోనూ వైసీపీ అభ్యర్ధి కంబాల జోగుల చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే రాజాం నియోజకవర్గంలో పట్టు పెంచుకున్న పరిస్థితుల్లో కళా వెంకట్రావు తనకు వ్యతిరేకంగా కొండ్రుమురళిని పార్టీలోకి తేవడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోతున్నారు. కొండ్రు మురళికే టిక్కెట్ ఖాయమని దాదాపుగా తేలిపోయింది. చంద్రబాబు ఇచ్చిన ఆ హామీతోనే కొండ్రుమురళి పార్టీలో చేరుతున్నారు. దీంతో ప్రతిభాభారతికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇక్కడ లేనట్లే అన్నది దాదాపుగా తేలిపోయింది. ఆమెకు కూడా స్పష్టంగా తెలిసింది. దీంతో తనను రాజకీయంగా దెబ్బతీయాలనుకుంటున్న కళాను వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్నదే తన ముందున్న లక్ష్యమని ప్రతిభా భారతి చెబుతున్నారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు వర్గంతో కూడా ప్రతిభా భారతి మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం.

నేతలకు ఫోన్ల ద్వారా……

కళా వెంకట్రావు ప్రస్తుతం ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన తన సమీప వైసీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ పై కేవలం మూడు వేల ఓట్ల స్వల్ప తేడాతోనే విజయం సాధించారు. తన సామాజిక వర్గానికి చెందిన వారు గత ఎన్నికల్లో ఓటు వేయడం వల్లనే కళా వెంకట్రావు గెలిచారన్నది ప్రతిభా భారతివాదన. తనకే ఎసరు పెట్టేటప్పుడు ఆయనను ఎందుకు గెలిపించాలన్న ప్రశ్న ప్రతిభాభారతి వర్గం నుంచి వస్తుంది. ఎస్సీ సామాజికవర్గ ఓట్లు దాదాపు పథ్నాలుగు వేలకు పైగా ఉండటంతో ఆ సామాజిక వర్గ నేతలకు ఫోన్ చేసి కళా వెంకట్రావు తనకు చేసిన అన్యాయాన్ని గురించి ప్రతిభా భారతి వివరిస్తున్నారని సమాచారం. తనకు టిక్కెట్ లేకపోయినా పరవాలేదు..వచ్చే ఎన్నికల్లో కళా వెంకట్రావు గెలవకూడదని ప్రతిభాభారతి శపథం పూనారట. మొత్తం కళాపై ప్రతిభ ఈ విధంగా పగ తీర్చుకుంటారా? అన్న వ్యాఖ్యలు ఎచ్చెర్ల నియోజకవర్గంలో విన్పిస్తున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 34226 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*