ఖమ్మంలో ఇక భం..భం…భోలే….!

ముందస్తు ఎన్నికలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వేడెక్కింది. ఇటు అధికార పార్టీలో అసంతృప్త నేతలు రోడ్డెక్కుతుంటే….మహాకూటమి ఎవరి సీట్లను గల్లంతు చేస్తుందోనన్న ఆందోళన విపక్ష పార్టీల నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే మహాకూటమిలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జనసమితి, సీపీఐలు భాగస్వామ్యులయ్యాయి. వీరి మధ్య సీట్ల పంపంకం జరగాల్సి ఉంది. అయితే మహాకూటమిలో భాగస్వామ్యులైన తెలుగుదేశం పార్టీ, సీపీఐకి ఇక్కడ పట్టు ఉండటంతో ఎక్కువ స్థానాలను ఇక్కడ డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ కు కూడా ఇక్కడ గ్రిప్ ఉండటంతో ఆ సీట్లు ఇచ్చేందుకు కిందా మీదా పడాల్సి వస్తోంది.

గులాబీ పార్టీలో….

తొలత అధికార పక్షాన్ని తీసుకుంటే టీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఇక్కడ ప్రభావం చూపలేకపోయింది. తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా గులాబీ పార్టీ బలం పుంజుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. కొన్ని చోట్ల గులాబీనేతలు రాజీనామా బాట పట్టారు. రోడ్డెక్కి తమ నిరసనలను తెలియజేశారు. ముఖ్యంగా కొత్తగూడెం సీటును ఆశించిన మట్టా దయానంద్ సీటు దక్కకపోవడంతో బల ప్రదర్శన చేయడం గమనార్హం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించారు.

అసంతృప్తులను చల్లారుస్తూ…..

ఇదే జిల్లాలోని వైరా నియోజకవర్గంలో గులాబీ అసమ్మతి నేతలందరూ కలసి కొణిజర్లలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ లాల్ కు వ్యతిరేకంగా పనిచేయాలని తీర్మానించుకున్నారు. మదన్ లాల్ అభ్యర్థిత్వాన్ని వెంటనే తొలగించి మరొకరికి ఇవ్వాలీని వారు కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఇక మధిర టిక్కెట్ తనకే వస్తుందని భావించిన బొమ్మెర రామ్మూర్తి కూడా అసంతృప్తి గళం విప్పారు. అయితే మంత్రి కేటీఆర్ మంతనాలతో ఆయన కొంత మెత్తబడ్డారు. కొత్తగూడెం సీటు విషయంలో మాత్రం ఇంకా లుకలుకలు నడుస్తూనే ఉన్నాయి.

మహాకూటమిలోనూ ప్రకంపనలు…….

ఇక గత ఎన్నికల్లోనూ సీపీఐ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. గత ఎన్నికల్లో వైరా, పినపాక, కొత్తగూడెం సీట్లను కాంగ్రెస్ పార్టీ సీపీఐకి కేటాయించింది. అయితే కొత్త గూడెం సీట్లను ఈసారి సీపీఐకి కేటాయిస్తే ఊరుకోబోమని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. గత ఎన్నికలలో ఆపార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదని, వనమా వెంకటేశ్వరావుకు కొత్తగూడెం సీటును కేటాయించాలని గట్టిగా కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు. ఇదిలాంటే ఖమ్మం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం స్థానాలను కోరుతుంది. సత్తుపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఉన్నారు. కొత్త గూడెం టిక్కెట్ ను కోనేరు నాగేశ్వరరావు మహాకూటమి అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. కేటాయిస్తే సొంత పార్టీ నేతలే రెబల్స్ గా మారే అవకాశముంది. దీంతో ఆచితూచి కాంగ్రెస్ నేతలు అడుగులు వేస్తున్నారు. మొత్తం మీద ఖమ్మం జిల్లాలో ఇటు అధికార పక్షం, అటు విపక్షాల్లో ముందస్తు ఎన్నికలు మంటలు రేపాయనే చెప్పొచ్చు.

Ravi Batchali
About Ravi Batchali 21574 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*