నాగేశ్వర్ కు ఎందుకీ నగుబాటు…?

ప్రొఫెసర్ నాగేశ్వర్

కచ్చితంగా గెలుస్తున్నానని ముందే ప్రకటించుకుని బరిలోకి దిగిన నాయకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఎమ్మెల్సీ ఎన్నికలు తనకు నల్లేరుపై బండి నడక మాదిరేనని సగర్వంగా చెప్పారాయన. అంతగా పేరు లేని సమయంలో 2007, 2009 ల్లోనే రెండు సార్లు గెలిచిన తనకు పట్టం గట్టడానికి పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారని భ్రమించారాయన. రియల్ పాలిటిక్స్ ను, రాజకీయ మేనేజ్ మెంట్ ను విస్మరించి అతి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దానినే ఆత్మవిశ్వాసంగా బావించారు. కానీ హైదరాబాద్, రంగారె్డ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితమయ్యారు. మీడియా విశ్లేషకునిగా, యూ ట్యూబర్ గా, ప్రొఫెసర్ గా, మేధావిగా ఎంతో గుర్తింపు ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ కు చేదు అనుభవం వెనక చాలా కారణాలే కనిపిస్తాయి. ఒకటి ఆయన స్వయంకృతాపరాధం. రెండు ప్రత్యర్థులు నాగేశ్వర్ పైనే కేంద్రీకరించి రాజకీయాలు నడపటం. సాధారణ పరిస్థితుల్లో బేరీజు వేస్తే విద్యావర్గాల్లో నాగేశ్వర్ ను పెద్దగా విమర్శించే వాళ్లు కనిపించరు. వామపక్ష సైద్దాంతిక భావ జాలం ఆయన విశ్లేషణల్లో తొంగి చూసినా తటస్థ కోణంలోనే చెబుతున్నట్టుగా కనిపించేందుకు ప్రయత్నిస్తారాయన. ప్రత్యేకించి సామాన్యుడే తనకు ప్రాతిపదిక అన్నట్లుగా విశ్లేషిస్తారు. అయితే గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిచిన నాటికి, ఇప్పటికి పరిస్థితుల్లో చాలా వ్యత్యాసం వచ్చింది. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వ్యక్తులు చట్ట సభల్లో కూర్చోవడం ప్రధాన రాజకీయ పార్టీలకు ఇచ్చగించడం లేదు.

ఆ ఇద్దరు ఒకటయ్యారా?…

గడచిన కొంతకాలంగా తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ఉప్పునిప్పుగా మారాయి. పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. తామే ప్రత్యర్థులమని ప్రజల మైండ్ లలో ఫిక్స్ చేసేశాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసును సోదిలో లేకుండా చేయాలని చూస్తున్నాయి. లోతుగా అద్యయనం చేస్తే బీజేపీ, టీఆర్ఎస్ ల ఎత్తుగడలు ఎవరికైనా అర్థమైపోతాయి. కానీ బీజేపీది సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం. భవిష్యత్ ఎన్నికల్లో పోటాపోటీ వాతావరణం కల్పించాలంటే కచ్చితంగా గెలిచి తీరాలి. అందుకు కమలం పార్టీ సర్వశక్తులూ ఒడ్డింది. కానీ ఒకే ఒక బలహీనత ప్రొఫెసర్ నాగేశ్వర్ రూపంలో వెంటాడింది. ఆయన మాత్రం గెలవకూడదన్నట్టుగా ప్రచారం సాగించింది. ప్రధాన ప్రత్యర్థి అయిన టీఆర్ఎస్ పై ఫోకస్ తగ్గించింది. ఫలితంగా తన స్తానాన్ని అధికార పార్టీ కి దఖలు పరిచింది. ఈ మూడు జిల్లాల్లోని పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీకి మంచి పట్టుంది. పైపెచ్చు టీఆర్ఎస్ బరిలోకి దింపిన పీవీ నరసింహారావు కుమార్తెను బలమైన అభ్యర్థిగా ఎవరూ భావించలేదు. సెంటిమెంటు కార్డుతో గట్టెక్కించవచ్చని టీఆర్ఎస్ ఒక పాచిక విసిరిందంతే. పాచిక పారింది. సక్సెస్ చేజిక్కింది. కానీ ఈ ఎన్నికలో ఫ్రొఫెసర్ నాగేశ్వర్ నెగ్గకుండా బీజేపీ, టీఆర్ఎస్ లు పరస్పరం సహకరించకున్నాయనే వాదనలూ వినవస్తున్నాయి. ముఖ్యంగా నాగేశ్వర్ అభిమానులు ఈ వాదనను ముందుకు తెస్తున్నారు. బీజేపీ ఎన్నికలలో ఓటింగు వరకూ ప్రొఫెసర్ నాగేశ్వర్ నే ప్రధాన ప్రత్యర్థిగా ఊహించుకుంటూ వచ్చింది.

వ్రతం చెడ్డా.. ఫలం మృగ్యం..

ప్రొపెసర్ నాగేశ్వర్ వామపక్ష భావజాలికుడు. తన వాదనతో ఇప్పటికే కేంద్ర, రాస్ట్ర ప్రభుత్వాలను తూర్పారపడుతున్నాడాయన. రేపొద్దున్న మండలిలో కూర్చుంటే రెండు ప్రభుత్వాలకూ శిరోభారంగా మారతారని బీజేపీ, టీఆర్ఎస్ లకు తెలుసు. అందువల్ల ఆయన ఎన్నిక కాకుండా చూడటంపై పెద్ద కసరత్తే సాగింది. కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తుంటే టీఆర్ఎస్ కేంద్రంపై పోరాటం చేయడం లేదనే వాదననూ నాగేశ్వర్ ఇప్పటికే ముందుకు తెస్తున్నారు. చట్ట సభ వేదికగా అదే వాదనతో ముందుకు వెళితే టీఆర్ఎస్ కు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుంది. ప్రజల్లో పలచనై పోతుంది. శాసనసభ ఎన్నికలపైనా టీఆర్ఎస్ బలహీనతలు ప్రభావం చూపుతాయి. వాటిని ఎక్స్ పోజ్ చేసేందుకు నాగేశ్వర్ ప్రయత్నిస్తారు. టీఆర్ఎస్ ను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బీజేపీకి ముకుతాడు వేసేందుకూ యత్నిస్తారు. ఈ భావనతోనే అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ తమలో ఎవరు నెగ్గినా నాగేశ్వర్ మాత్రం గెలవకూడదని కోరుకున్నాయి. ద్వితీయ ప్రాధాన్య ఓట్లలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య చాలా మేరకు సాఫీగా సాగిన ఓట్ల మార్పిడి ఇదే విషయాన్ని ధ్రువపరుస్తోంది. ఈ రెండు పార్టీల ద్వితీయ ప్రాధాన్య ఓట్లు పూర్తిగా తనకే వస్తాయని ఆశించి నాగేశ్వర్ భంగపడ్డారు. నిజానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ కు ప్రజాక్షేత్రంలో పెద్దగా బలం లేదు. 2007, 2009 నాటి పరిస్థితులు వేరు. అప్పట్లో వై.ఎస్. హయాంలో కాంగ్రెసును ఎదుర్కొనేందుకు టీడీపీ, టీఆర్ఎస్ పరోక్షంగా నాగేశ్వర్ కు సహకరించాయి. రెండేళ్లకే డ్రా ఫలితంగా పదవి ముగియడంతో 2009 లో సానుభూతి సెంటిమెంటు కూడా కలిసి వచ్చింది. అది తన సొంతబలంగా భ్రమించి ప్రొఫెసర్ నాగేశ్వర్ తాజాగా చేదు అనుభవాన్ని చవి చూశారు. పైపెచ్చు ఈ ఎన్నికలో నాగేశ్వర్ మతం కార్డునూ బయటికి తీశారు. తాను రామాయణాన్ని పదిహేను సార్లు చదివానని తనను తాను రామభక్తునిగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ పెద్దలెవరైనా తనతో రామాయణంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. వామపక్ష సిద్దాంతాన్ని పక్కనపెట్టి హిందువుల ఆరాద్య దైవమైన రాముడిని ఆశ్రయించేందుకు సిద్దపడ్డారు. కానీ వ్రతం చెడ్డా నాగేశ్వర్ కు ఫలం దక్కలేదు.

విద్యా వంతులూ అంతే..

సాధారణ ఓటర్లకు భిన్నంగా విద్యావంతుల నుంచి ఎక్కువ ఆశించడం తప్పని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. తెలంగాణ ఉద్యమం మొత్తానికి అఖిలపక్ష సారథిగా నాయకత్వం వహించిన కోదండరామ్ నే ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం చేశారు. ఆయనతో పోల్చుకుంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ పోషించిన పాత్ర చాలా పరిమితం. పట్టభద్రులు, ఉద్యోగులు తమకు లభించే ప్రయోజనాలు, ఆర్థిక గిట్టుబాటుపైనే ద్రుష్టి పెడుతున్నారు. మేధోపరమైన అంశాలు, దీర్ఘకాలిక దృష్టి విడిచి పెట్టేశారు. సామాజిక మాధ్యమాల ప్రభావానికి సైతం లోనవుతున్నారు. తమ కోపాన్ని దూషణభూషణలతో ప్రదర్శించే వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు. సమస్య పరిష్కారం కంటే తక్షణ ఉపశమనం, మానసిక సాంత్వన దొరికితే చాలనుకుంటున్నారు. అందుకే ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో తీన్మార్ మల్లన్నకు ద్వితీయ స్థానం కట్టబెట్టారు. మాట తూలకుండా ఆచితూచి వ్యవహరించే కోదండరామ్ ను కాదనుకున్నారు. మేధోపరమైన రాజకీయాలకు కాలం చెల్లింది. సామదానభేద దండోపాయాలతో నిధులు కుమ్మరించేందుకు సిద్ధమైతేనే రంగంలోకి దిగాలి. పెద్దల సభ సైతం ఇందుకు అతీతమేమీ కాదని నూటికి నూరుపాళ్లు తేలిపోయింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 38150 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*