ఉన్నం సున్నం పూసేటట్లున్నారే….!!!

raghuveerareddy-kalyanadurgam-constiuency

కల్యాణ దుర్గం నియోజకవర్గం ఇప్పడు ఆంధ్రప్రదేశ్ లోనే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన గెలవకుంటే పార్టీ పరువు బజారున పడుతుంది. అందుకే ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయన్న టాక్ నడుస్తోంది. కల్యాణ దుర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా ఉషాశ్రీ చరణ్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు. ముగ్గురు మధ్య పోటీ ఉందనుకుంటున్నా ఇక్కడ వైసీపీ, కాంగ్రెస్ ల మధ్యనే పోటీ ఉందని చెబుతున్నారు.

రెబల్ గా దిగి…..

నిన్న మొన్నటి వరకూ కల్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్నం హనుమంతరాయ చౌదరి ఉన్నారు. ఆయనకు ఈసారి టిక్కెట్ ఇవ్వకపోవడంతో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తనకు టిక్కెట్ రాకపోవడానికి కారణం జేసీదివాకర్ రెడ్డి, పయ్యావుల కేశవ్ అని అనుమానించిన ఉన్నం హనుమంతరాయ చౌదరి ఇప్పుడు ఎవరి పక్షాన నిలిస్తే వారిదే గెలుపని తెలుస్తోంది. పీసీపీ చీఫ్ రఘువీరారెడ్డికి సహకరించాలని ఇప్పటికే కల్యాణ దుర్గం టీడీపీ నేతలకు ఆదేశాలు అందడంతో ఇక్కడ టీడీపీ సీన్ నుంచి తప్పుకున్నట్లేనని చెబుతున్నారు.

వైసీపీకి మద్దతిస్తే….

ఇది గమనించిన ఉన్నం హనుమంతరాయ చౌదరి తనకు టిక్కెట్ రాకుండా చేసిన జేసీ, పయ్యావుల కు బుద్ధిచెప్పాలంటే వైసీపీ అభ్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనకు సంబంధించిన అనుచరులు, వర్గానికి ఈ మేరకు ఉన్నం సంకేతాలు పంపారని చెబుతున్నారు. ఇక్కడ రఘువీరారెడ్డి గెలిచినా తెలుగుదేశం పార్టీ గెలిచినట్లేనని, అందుకే వైసీపీకి మద్దతివ్వాలని ఆయన తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. దీంతో కల్యాణదుర్గంలో రఘువీరారెడ్డి గెలుపు అంత ఈజీగా లేదు.

రఘువీరాకు కష్టమేనా…?

రెండు రోజుల క్రితం కల్యాణదుర్గంలో జరిగిన జగన్ సభకు జనం పోటెత్తారు. ఉషశ్రీ చరణ్ కు మద్దతుగా అసంతృప్త నేతలంతా కలిసిపోయారు. గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన తిప్పేస్వామి తొలుత కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా ఇప్పుడు వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ కు మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు ఉన్నం హనుమంతరాయ చౌదరి కూడా చివరి నిమిషంలో వైసీపీకి అండగా నిలుస్తారని తెలియడంతో ఆయన కోసం టీడీపీ నేతలు ఇప్పటికీ బుజ్జగింపుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ ను ఒక్క సీటులోనైనా గెలిపించాలనుకున్న టీడీపీ లక్ష్యం నెరవేరేలా కన్పించడం లేదు. వారి ఆశలపై ఉన్నం సున్నం చల్లేట్లు ఉన్నారు.

Ravi Batchali
About Ravi Batchali 31033 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*